పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 18, 2010

చదువులమ్మ ముద్దు బిడ్దలు..వీరికి చేయూతనిద్దాం

పేదరికం వాళ్ల ఆశలమీద నీళ్లు చల్లుతున్నా వాళ్ల పట్టుదల..దీక్ష వాళ్లకి దారి చూపుతున్నాయి.  ఒక్కొక్కళ్లది ఒక్కో కథ..వ్యథ.  ఈ సారి EAMCET లో అతుత్తమ మార్కులు వచ్చిన వాళ్లలో ఎక్కువమంది నిరుపేద కుటుంబాలనుండి వచ్చినవాళ్లే. 

తండ్రి దూరమయినా ఆయన మాటే వేదంగా మెకానిక్ మామయ్య అండతో పట్టుదలగా చదివి ఆకాశమే హద్దుగా 159 మార్కులతో ప్రథమస్థానంలో నిలిచిన పల్లవి..
పల్లవితో సమానంగా EAMCET లో మార్కులు సాధించి ఇంటరులో 600 కి 600 మార్కులు సాధించిన ఆటోడ్రైవరు కొడుకు మహ్మద్ గౌస్
తల్లిదండ్రులు నిరక్షరాస్యులయినా మూడోస్థానంలో నిలిచిన కిరణ్.....లక్ష్మీపతి

వీరందరికి ఉన్నదల్లా ఒక్కటే ధ్యేయం..బాగా చదవాలి..ఉన్నతంగా జీవించాలి.  ఎన్ని అడ్డంకులు ఎదురయినా కసి.... పట్టుదల...ఉన్నతంగా జీవించాలన్న ఆశ..అవే వారిని విజయపథాన నడిపిస్తున్నాయి. ఇలాంటివారికి అవసరం ఉన్నప్పుడు చేయూత ఇవ్వటం మన బాధ్యత..కర్తవ్యం కూడా! అలాంటి ఓ చదువుల తల్లికి సహాయం చేసే అవకాశం ప్రమదావనానికి లభించింది. 

హారిక అన్న అమ్మాయిది కరీంనగర్ జిల్లా ముస్తాబాద్.  తండ్రి ఓ చిన్న రైతు..సంవత్సర ఆదాయం 14,000-18,000.  ఆ అమ్మాయికి 10వ తరగతిలో 91% వచ్చింది.  ఇంటరులో చైతన్య కాలేజి వాళ్లు మొదటిసంవత్సరం ఉచితంగా శిక్షణనిచ్చారు..రెండవ సంవత్సరం నామమాత్రం రుసుము వసూలు చేసారు.  ఇంటరులో 93% వచ్చింది.  EAMCET లో ర్యాంకు రావటంతో వర్థమాన్ కాలేజి, షంషాబాదులో ఇంజనీరింగు సీటు వచ్చింది. రోజూ ECIL నుండి షంషాబాదు వెళ్ళి చదువుకుంటుంది.  ఎలాగో తిప్పలు పడి మొదటి రెండు సంవత్సరాలు ఫీజులు కట్టారు.  ఇప్పుడు మూడవ సంవత్సరం ఫీజు కట్టాలి..వాళ్ల నాన్న చేతులెత్తేసారు.  మన బ్లాగరు రవిచంద్ర ద్వారా ఈ విషయం తెలిసి ప్రమదావనం తరుపున ఈ రోజు ఆ అమ్మాయికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించటం జరిగింది.  ఇంకొక బ్లాగరు పరిమళం గారు వ్యక్తిగతంగా 1000 రూపాయలు సహాయం అందించారు.

ఎవరయినా సహాయం చెయ్యదలిస్తే ఆ అమ్మాయిని సంప్రదించవలిసిన ఫోను నంబరు 9703299899
తన బ్యాంక్ అకౌంట్ వివరాలు.
A/C number: 30903316788
Name of A/C Holder: L. Srinu
Bank: SBI
Branch: Vinukonada
తనకి ఆంధ్రాబ్యాంకులో అకౌంటు ఉంది కాని దాని ATM కార్డు పోయింది కనుక వేరే a/c నంబరు ఇస్తుంది..త్వరలో ATM కార్డు తీసుకోవటమో ఇంకొక a/c ఓపెన్  చేయటమో చేస్తుంది. 

Read more...

June 14, 2010

సపోటాల లక్ష్మి

మధ్యాహ్నం రెండిటప్పుడు మా తలుపు టకటకా మోగిందింటే అది సపోటాల లక్ష్మే అని అర్థం.  వచ్చిందంటే తీసుకునేదాకా ఊరుకోదు. ఒక్క సపోటాలే కాదు ఏ సీజనులో పళ్లు ఆ సీజన్లో తెస్తుంది..ఎక్కువగా మాత్రం సపోటాలే.  అవేమో మరీ గోళీకాయలలాగా ఉంటాయి..అందులో గడ్లు పోతే మనకు తినటానికి ఏమీ మిగలదు! వద్దు అంటే వినదు...ఒక డజనన్నా తీసుకోమ్మా అంటూ బ్రతిమాలుద్ది..నాకొద్దు..పిల్లలు తినటంలేదు..వెళ్ళులే అంటానా..ఊహు..ఊరుకోదు..పిల్లలు తినకపోతే ఏం నువ్వు తిను..చూడు ఎంత బక్కగా ఉన్నావో..మంచిగా పళ్ళు తినాల..అసలే పెద్ద జబ్బుపడి లేచావు (నేను జబ్బు పడి లేచి మూడు సంవత్సరాలు అయిపోతుంది..కాని అది నిన్నా మొన్నా అన్నట్టు మాట్లాడుతుంది).  నాకొద్దు తల్లీ అంటా ..ఇదుగో ఈ పాతిక తీసుకో..ఎంత మంచిగా ఉన్నాయో చూడు..అన్నీ పళ్ళే...ఒక్కటి తిని చూడు..ఇంకో యాభై ఈమంటావు..అంటూ ఓ పాతిక తీసి కింద పెడుతుంది..నాకొద్దన్నానా..తీసుకెళ్ళు అని నేను కాస్త కోపం ప్రదర్శిస్తా..ఊహూ...తీసుకెళ్లటానికేంటి పెట్టింది..నాకు డబ్బులియ్యొద్దులే..తిని చూసి రేపొస్తాగా అప్పుడు ఇద్దువులే అంటూ బుట్ట నెత్తిన పెట్టుకుంటుంది..ఇక డబ్బులు ఇవ్వక చస్తామా..అసలే బక్క ప్రాణం..రెండు అంతస్తులు ఎక్కి వచ్చింది పాపం అని డబ్బులిచ్చి నువ్వు పైకి రాకు..నాకవసరం అయితే నేనే పిలుస్తాగా అని చెప్పి పంపిస్తా..ఊహూ ..మూడోనాడు మళ్ళీ తయారవుద్ది.  ఈ మా అనుబంధం గత ఆరేడు సంవత్సరాలుగా ఇలా సాగుతూనే ఉంది.

 ఆ పళ్ళేమో మా పిల్లలు కన్నెత్తి అన్నా చూడరు..అది చెప్పినట్టు నేను తిన్నన్ని తిని మిగతావి పనమ్మాయికో...మా వాచుమాన్ వాళ్ల పిల్లలకో..అదీ కాకపోతే మా చెత్తబుట్టకో పెట్టేస్తుంటా! ఆ మధ్య కొన్నాళ్లు వాటితో మిల్కుషేకులు...మిశ్రమ రసాలు చెయ్యటం మొదలుపెట్టా..మా అమ్మాయి పాపం నేనేమి ఇచ్చినా మాట్లాడకుండా తాగుతుంది..మా అబ్బాయి మాత్రం..వాడి రుచిగ్రంధులు చాలా పదును..ఎలా పడతాడో తెలియదు..ఏంటి ఇలా జిగురుజిగురుగా ఉంది..సపోటా పళ్ళు వేసావా..ఇంకెప్పుడూ వెయ్యకు అని ఓ అల్టిమేటం జారీ చేసాడు..ఇక అదీ మానేసా. ఇలా లాభం లేదని గత కొంతకాలంగా మధ్యాహ్నం పూట తలుపు మోగితే తీయటం మానేసా (అది తప్ప ఇంకెవరూ ఆ టైములో తలుపు కొట్టరన్న ధీమా) . కొన్నాళ్ళు చూసి లక్ష్మి కూడా రావటం మానేసింది.  మొన్నొక రోజు రోడ్డు మీద కనిపించి ఏందమ్మా ..ఈ మధ్య ఎప్పుడొచ్చినా నిద్రపోతున్నావు..తలుపు తీయటంల  అంటు పరామర్శించింది..మరి ఎండాకాలం కదా అని ఏదో సర్దిచెప్పా!  నిన్న మాత్రం దానికి అడ్డంగా బుక్ అయిపోయా! అది వచ్చే టైముకి తలుపు తీసే ఉంది.  నన్ను చూడగానే బాగున్నామ్మా..ఇయాల పొద్దుటినుండి నువ్వే యాదికొస్తాండావు..అందుకే వచ్చా...అంటూ ముఖమంతా నవ్వుతూ పరామర్శించింది.  బాగానే ఉన్నా కాని పాప కూడా లేదు కాయలొద్దు అంటే వినదే! ఇదుగో నువ్వు నా దగ్గర కాయలు కొని ఎన్నాళ్ళవుతుంది..ఏడన్నా ఓ ఏడాది అయి ఉంటది..వద్దంటావేంది ఓ పది రూపాయలవి తీసుకో అంటూ పోట్లాడి మరీ ఓ పాతిక కాయలు పోసి పోయింది..ఇక డబ్బులియ్యక చస్తానా! ఏంటో దానికీ నాకూ మధ్య ఈ బంధం?

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP