పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

May 23, 2011

దీర్ఘాయుష్మాన్‍భవా! ట్రిపుల్ థమాకా!



ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు....నిన్నటితో EAMCET.......etc.... CET లన్నీ అయిపోయి పుట్టినరోజు నాటికి పరీక్షల జంజాటం నుండి విముక్తి  అయ్యాడు.  అన్నీ బాగానే వ్రాసాడు.  IIT....BITS ల్లో మంచి మార్కులు వచ్చాయి.  ఆ రెండిటిల్లో ఏదో ఒక దాంట్లో చేరతాడు.

మా అన్నయ్యగారబ్బాయిలు ఇద్దరు (కవలలు)..వాళ్లూ నిన్న EAMCET Medical వ్రాసారు..వాళ్ళిద్దరికి కూడా మంచి మార్కులు వస్తున్నాయి..గవర్నమెంటు కాలేజిలోనే మెడికల్ సీటు రావచ్చు..అందుకని మాకు ఈ రోజు ట్రిపుల్ థమాకా అన్నమాట!

పుట్టినరోజు అంటే మా ఇంట్లో కొత్త బట్టలు..గారెలు..పులిహోర....పాయసం.. అంతే.....కేకు కటింగులు...కొవ్వొత్తులు ఊదటాలూ....పార్టీలూ  ఉండవు.  మొదటి రెండు పుట్టినరోజులకే కేకు కటింగు..బాగా చిన్నప్పుడు స్కూల్లులో పిల్లలకి చాక్లెట్టులు ఇవ్వటం.... మా అబ్బాయి పుట్టింది మేలో కాబట్టి అది కూడా ఉండేది కాదు.  చిన్నప్పుడు బాగా గొడవ చేసేవాడు..నా పుట్టినరోజు ఎప్పుడూ సెలవలలోనే ఎందుకొస్తుందని:). ఇలా సెలవుల్లో..అందులోనూ ఎండాకాలం సెలవుల్లో  పుట్టినరోజు వస్తే పిల్లలకి ఎంత నిరుత్సాహంగా ఉంటుందో!

















రాత్రి మాత్రం మా అమ్మాయి చెప్పపెట్టకుండా కేకు తెచ్చి కోయించింది..ఈ పుట్టినరోజు కాస్త స్పెషల్ అని..అవును మరి ఇక పెద్దయిపోయాడు కదా! ఇప్పటివరకు అమ్మా ఏం డ్రస్సు వేసుకోను....అమ్మా ఆదేది..అమ్మా ఇదేది..అని అన్నిటికి  వెనకెనక తిరిగే పిల్లాడు ఇక నుండి తనకు తానుగా ఉండాలి...తన నిర్ణయాలు..చిన్నవైనా పెద్దవైనా.. తనే తీసుకోవాలి..పిల్లల జీవితంలో ఈ వయస్సు ఓ పెద్ద మలుపు...పిల్లల వ్యక్తిత్వం ఓ రూపు దిద్దుకునేది  ఈ వయస్సునుండే!  ఇప్పటి వరకు అమ్మా నాన్న చెయ్యి పట్టుకుని నడిచిన పిల్లలు..ఆ చేతులు వదిలేసే తమంత తాముగా అడుగులేసే సమయం..అడుగు తడబడితే చేయూతనివ్వటానికి ఇప్పటిలాగా అమ్మానాన్న పక్కనే ఉండరు..తమంత తామే నిలదొక్కుకోవాలి..ఆచితూచి విశ్వాసంతో అడుగులెయ్యాలి...అడుగులు తడబడినా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి.

జీవితాంతం ఆ విశ్వాసం...ఆత్మస్థైర్యం..మా అబ్బాయికి ఉండాలని ఆశిస్తూ.....

Read more...

May 9, 2011

మా ఊరు..మా గాలి...తాటి ముంజలు.





ఎండాకాలం మల్లెలు.....మామిడి కాయలు..అంటూ అందరూ ఎదురు చూస్తారు కానీ నేను మాత్రం తాటి ముంజలు..ఈతకాయలు కోసం ఎదురు చూస్తా. మాకు పొలాల గట్ల వెమ్మటి బారులు తీరి ఉంటాయి తాటి చెట్లు.  హైదరాబాదులో తీసిన ముంజలు దొరుకుతాయి కానీ..ముంజల్ని కాయనుండి బొటనవేలుతో తోడుకు తినటంలో ఉండే మజాయే వేరు..ఆ మజా తీసిన ముంజలు తింటే రాదు.

ఎండాకాలం ఇంటికి వెళితే నేను మొదటిగా చేసేది మా శ్రీనుని (పనబ్బాయి) పిలిచి సాయంత్రానికల్లా ముంజకాయ గెలలు..ఈతకాయలు తెమ్మని ఆర్డర్ జారీ చేయటం. అసలు నేను వస్తున్నాని తెలిస్తే ముందే తెచ్చిపెడతాడు.

మొన్న మాత్రం రెండు రోజులు ఉన్నా ముంజ కాయలు దొరకలేదు.  చిన్న చిన్న కాయలే కొట్టుకెళుతున్నారు... పిల్లలు అసలు ఉంచట్లేదు..అని శ్రీను బాధపడిపోయాడు.  సరేనని మా అక్క  వాళ్ళింటికి వెళ్ళగానే ముందుగా చెప్పిన మాట నాకు ముంజ కాయలు కావాలి తెప్పించు అని...సాయంత్రం అవి వచ్చేదాకా పదినిమిషాలకి పదినిమిషాలకి  గుర్తుచేయటమే..ఏంటి ఇంకా తేలేదు..మళ్ళీ కబురు చేయి అని మా అక్కా వాళ్ళ  చిన్నాడ్ని షంటుతూనే ఉన్నా!  పిన్నీ నీకెందుకు సాయంత్రానికల్లా తీసుకొస్తాడుగా అన్నా విననే! అవి వచ్చేదాకా కాలుకాలిన పిల్లిలా గేట్లోకి ఇంట్లోకి తిరుగుతూనే ఉన్నా! రాగానే ఓ 7-8 కాయలు లాగించేసా. బాగా లేత కాయలు...ఒక్క పూటే తిన్నానే అని  ఓ  దిగులు..ఇంకో పూటన్నా ఉండి మరో పదో ఇరవయ్యో కాయలు తింటే కాని తృప్తిగా ఉండదు మరి!


టకటకా పనాళ్ళు కాయలు కొడుతుంటే ధన ధనా లాగించేస్తూ ఉంటాం... ఓ పదిమందిమి ఉన్నామంటే ఓ ఇద్దరు పనాళ్ళకి చేతినిండా పనే! మళ్ళీ మనొంతు వచ్చేదాకా ఎదురుచూడాలి.   బొటనవేలితో ముంజ తోడుకు తినటం ఓ కళ....అందులో .నీళ్ళు పోకుండా తినటం అందరికీ రాదు. 


ఎండాకాలం ఈ తాటి ముంజల్లో నీళ్లు చాలా చలువ చేస్తాయి...ముఖ్యంగా చిన్న పిల్లలకి ముసలి వాళ్లకి చాలా మంచిది.  కొంతమంది కాస్త గడ్డుగా ఉండే ముంజల్ని ఇష్టపడతారు..అవి కొబ్బరిలాగా కసాకసామంటూ ఉంటాయి.  నాకు మాత్రం అటు మరీ లేతగా కాకుండా ..ఇటు మరీ గడ్డుగా కాకుండా. ఉండాలి..పిల్లలకి ముంజలు తీసిస్తామన్నా వినరు ....మేమే తీసుకుతింటాం అని మహా చక్కగా లాగించేస్తారు! మాతో పోటీ అన్నమాట!



ఇప్పుడు కాయలు తింటామా...ఆగస్టు సెప్టెంబరు వచ్చేటప్పటికి  పండిన తాటికాయలతో బూరెలు..కుడుములు చేస్తారు... బాగా పండిన తాటికాయల్ని కాల్చి రసం పిండి కొంచం బొబాయి రవ్వ కలిపి  చేస్తారు.  తాటి బూరెల్లో వెన్నపూస పెట్టుకు తింటే ఆహా..ఏమి రుచి అనాల్సిందే.  నేను తినే ఏకైక స్వీటు తాటి బూరెలే! ఇవీ మరీ అంత తియ్యగా ఉండవు. అసలు కాల్చిన తాటిపండు కూడా మహా రుచిగా ఉంటుంది.  కాల్చిన తాటి బుర్ర చీకుతూ తినటం కూడా ఓ కళే! మా నాయనమ్మకి మహ ఇష్టం....అవలీలగా రెండు కాయలు తినేది.  ఇక తేగల గురించి చెప్పక్కరలేదుగా! కాల్చిన తేగలకన్నా ఉడకపెట్టినవి బాగుంటాయి.

చిన్నప్పుడు తినేసిన తాటి బుర్రలతో అందరూ బండ్లు కట్టే ఉంటారు..ఒకసారి మా బుడ్డోళ్ళని చూడండి..అన్నా చెల్లెళ్ళిద్దరూ పోటీ పడి లాగేస్తున్నారు!


ఈ తాటి కాయలు ఈతకాయలతో పాటుఎండాకాలం సాయంత్రాలు మా ఊర్లో వీచే గాలి కూడా నాకు మహా ఇష్టం.  పగలు ఎంత వేడి ఉన్నా సాయంత్రం అయ్యేటప్పటికి మంచి చల్లటి గాలి కొడుతుంది.  అరుబయట మంచం వేసుకు పడుకుంటే .. ఓపక్క మా అమ్మ కబుర్లు చెప్తూనే ఉంటుంది...నేను హాయి హాయిగా అలా అలా నిద్రలోకి జారిపోతాను.  టివిలు... కంప్యూటర్లు..అన్నీ బంద్.  అసలు వాటి ధ్యాసే  ఉండదు... అంత సమయమూ ఉండదు.

ఈతకాయల గురించి మరో సారి...

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP