పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

October 28, 2009

తప్పెవరిది?

గత రెండురోజులుగా ప్రసారమాధ్యమాలలో మైదుకూరు స్కూలులో తెలుగు మాట్లాడినందుకు ఇద్దరు పిల్లలకు ఉపాధ్యాయులు వేసిన శిక్ష  ఓ పెద్ద చర్చాంశనీయమయింది.  మన టి.వి చానళ్లకి మరో పండగ.  ఈ రోజు ఉదయం నుండి ఏ చానలు తిప్పినా  దీనిమీదే చర్చ.  వీళ్లు ఇప్పుడే కళ్లు తెరిచారో లేక వేరే సంచలనాత్మక వార్తలు ఏమీ లేక దీనిమీద పడ్డారో అర్థం కావటం లేదు. అసలు పిల్లలు ఎలాంటి తప్పు చేసినా ఇలా మెడలో బోర్డులు వేలాడదీయటం తప్పు.....మనం స్పందించాల్సింది దానికి...మనం ముందుగా ఖండించాల్సింది ఇలాంటి శిక్షలని.  ఆ పంతుళ్ల మెడలకి "ఇక ఇలాంటి పని చేయను" అన్న బోర్డు తగిలించి ఊరంతా తిప్పాలి.....అదే వారికి సరయిన శిక్ష..

నిజానికి స్కూలులో ఇంగ్లీషులోనే మాట్లాడాలని పిల్లలని నిర్భందించటం, మాట్లాడకపోతే శిక్షలు వేయటం కొత్త విషయం ఏం కాదు.  గత  10-15 ఏళ్ల నుండీ  హైదరాబాదులో ఇలాంటి ఆంక్షలు చాలా స్కూళ్లల్లో ఉన్నాయి.  లేని స్కూళ్లని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అది ఇప్పుడు చిన్న చిన్న ఊర్లకి కూడా పాకింది.  మేము చదువుకునే రోజులలో అంటే 30 ఏళ్ల క్రితం కూడా మిషనరీ స్కూల్సులో తెలుగులో మాట్లాడితే ఫైన్ ఉండేది. ఎండలో నిలబెట్టటం. బెంచీలు ఎక్కించటం, మోకాళ్లమీద కూర్చోపెట్టటం, కొండకచో కొట్టటం కూడా చేస్తుంటారు.  తమ పిల్లలు తెలుగులో మాట్లడటం తక్కువతనమనుకునే తల్లిదండ్రులున్నంత కాలం మన తెలుగుకి....మన పిల్లలకి ఇలాంటి దుర్గతి తప్పదు. స్కూలులో తెలుగు ఎక్కువగా మాట్లాడుతున్నారని స్కూలులు మార్చే తల్లిదండ్రులున్నప్పుడు వాళ్ల దగ్గర డబ్బులు దండుకుంటున్న స్కూళ్ల  యాజమాన్యాలు ఇలా చేయక మరి ఎలా చేస్తాయి? మార్పు రావల్సింది తల్లిదండ్రుల్లో.....ఇంగ్లీషు రాకపోతే తమ పిల్లలు జీవితంలో పైకి రాలేరు..వాళ్లకి భవిష్యత్తు లేదు అన్న భావన నుండి మనం బయటకు వచ్చినప్పుడే ఈ ఝాడ్యం వదిలేది. 

మొన్న బజారులో ఓ తెలిసినామె కనపడితే కుశల ప్రశ్నలు అయ్యాక మీ బాబు ఇదివరకటి స్కూలేగా అన్నా! లేదండి పోయిన సంవత్సరం మార్చాం అంది.  అదేంటండి ఆ స్కూలు బాగుంటుందన్నారు కదా, బాగా ఆటలు అవీ ఆడిస్తారు, పిల్లల మీద ఒత్తిడి ఉండదు కదండీ అంటే........ఆవిడ ప్రతిస్పందన........అన్నీ బాగానే ఉన్నాయి కానీండి.... అక్కడ క్లాసు బయట పిల్లలు తెలుగులో ఎక్కువగా మాట్లాడతారండి అందుకని మార్చాం అంది. అదీ ప్రస్తుత పరిస్థితి.  మామూలుగా మన తెలుగువారం ఏదైనా బాధ కలిగినప్పుడో, దెబ్బ తగిలినపుడో అమ్మా అనో అబ్బా అనో అంటాం..అది అసంకల్పిత చర్య......కానీ  ఇంగ్లీషు పిచ్చి ఉన్న మన ఆధునిక తల్లిదండ్రులు ఉన్నారే ......వాళ్లు పిల్లలు బాధ కూడా తెలుగులో పడకూడదనుకుంటారు..పడ్డప్పుడు అమ్మ బదులు మమ్మీ అనాలనుకుంటారు....అలా అంటేనే తమ పిల్లలకి ఇంగ్లీషు బాగా వచ్చినట్లన్నమాట!  అమ్మలు బ్రతికున్న శవాలు అయిపోయారన్నమాట!

ఇంగ్లీషులో మాట్లాడితేనే పిల్లలు జీవితంలో పైకి వస్తారు అనుకునే మనస్తత్వం మనకున్నంత కాలం ఇలాంటివి మామూలే. ఓ రెండు రోజులు గోల చేస్తాం..చర్చలు..వాదనలు..ప్రతివాదనలు..ఆవేశాలు..రక్తం ఉడికిపోవటాలు ....మరిగిపోవటాలు....ఊకదంపుడు ఉపన్యాసాలు..అన్నీ మామూలే.......మూడో నాడు షరా మళ్లీ ఇంగ్లీషు మామూలే.. మళ్లీ ఈ ఊసే ఎవరూ ఎత్తరు.  భాషా శాస్త్రవేత్తలు ఎప్పడో మొత్తుకున్నారు.....ముందు మాతృభాష సరిగ్గా వస్తే మిగతా భాషలు నేర్చుకోవటం చాలా సులువు అని......కానీ మనం ఇపుడు తెలుగు రాకపోతే మాత్రం ఏం ఇంగ్లీషు వస్తే చాలనుకుంటున్నాము. నర్సరీలో ఉన్న మన పిల్లకాయ..ముద్దుముద్దుగా ఏ ఫర్ ఆపిల్ అంటుంటే ...అబ్బో ఇంగ్లీషు ఎంత చక్కగా మాట్లాడుతుందో అని మురిసిపోతాం. చందమామ రావే ..జాబిల్లి రావే.. స్థానంలో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు వచ్చేసింది....చిట్టి చిలకమ్మని.... జానీ జానీ మింగేసాడు..మన అమ్మ భాష మనకి పరాయి అయిపోయింది!

టపటపా నాలుగు ఇంగ్లీషు ముక్కలు మాట్లాడనివాడు మన దృష్టిలో మనిషే కాదు..అలాంటి పిల్లలకు భవిష్యత్తే లేదు అని జాలిపడిపోతుంటాం.  మన పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవాలనుకోవటం తప్పు కాదు, మంచి ఇంగ్లీషు మాట్లాడాలనుకోవటం తప్పు కాదు...కానీ ఇంగ్లీషే తాగాలి, ఇంగ్లీషే తినాలి, ఇంగ్లీషుతోనే బ్రతుకంతా ఉంది అనుకోవటమే తప్పు! తెలుగెందుకు ఇంగ్లీషులోనే అభివృద్ధి అంతా ఉంది అనుకోవటమే తప్పు. మన పక్కనున్న చైనా వాళ్లు ఏ ఇంగ్లీషు నేర్చుకుని ఇంతగా అభివృద్ధి చెందారు? 

ఇక్కడ అసలు నవ్వొచ్చే (ఏడవలేకే లేండి) విషయమేమిటంటే ఈ ఇంగ్లీషు స్కూళ్లలో చదివే అధిక శాతం పిల్లలు మాట్లాడే ఇంగ్లీషు వింటే ఇంగ్లీషు సరిగ్గా రాని నేనే చాలా నయం అనిపిస్తుంది. ఓ గ్రామరు ఉండదు, ఓ వ్యాక్య నిర్మాణం సరిగ్గా ఉండదు..ఓ..యా..లే తప్ప అందులో భాషే ఉండదు.  ఇలాంటి ఇంగ్లీషు వస్తే ఎంత రాకపోతే ఎంత? ఓ విషయం ఇచ్చి ఓ పది వ్యాక్యాలలో చిన్న వ్యాసం వ్రాయమనండి. స్పెల్లింగు తప్పులు లేకుండా ఒక్క వ్యాక్యం కూడా ఉండదు. అందరూ ఇంతే అనను కాని చాలావరకు ఇంతే.  ఈ ఇంగ్లీషు మీద మరోసారి మాట్లాడుకుందాం.

మైదుకూరులో స్కూలు మూసేయించుతారంట..ఎన్ని స్కూళ్ళని అలా మూసేయించుతారు..తల్లిడండ్రులు ఇష్టపడే కదా తమ పిల్లలని ఇంగ్లీషు మీడియం స్కూళ్లకి పంపుతుంది. మన ఇళ్లల్లో ఎంతమందిమి పిల్లలకి చక్కటి తెలుగు నేర్పుతున్నామో, ఎంతమందిమి పిల్లలతో పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతున్నామో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం.  మన పిల్లలు ఎంతమంది తెలుగు అక్షరాలు అన్నీ గుర్తుపట్టగలరు?..తప్పులు లేకుండా ఎన్ని గుణింతాలు వ్రాయగలరు? ఎన్ని అంకెలు చెప్పగలరు?..వారాలేంటో అవి ఎన్నో ఎంతమందికి తెలుసు?  అసలు జనవరి.......ఫిబ్రవరే కాదు తెలుగు సంవత్సరాలు కూడా ఉన్నాయని ఎంతమంది పిల్లలకి తెలుసు??మారాల్సింది మనం.

తల్లిదండ్రులూ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి--తప్పెవరిది??


Read more...

October 2, 2009

పాండవులున్న గుట్టలట.....ఎవరయినా చూసారా?


పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు,  రాముడు వనవాసం చేసినప్పుడు ఎక్కడెక్కడ తిరిగారో చెప్పటానికి మన దేశంలో బోలెడు కథలు ప్రచారంలో ఉన్నాయి.  వాళ్లు నిజంగా అక్కడ తిరిగారో లేదో తెలియదు కాని ఆ ప్రదేశాలు చూసినప్పుడు మాత్రం ఒక రకమయిన ఉద్వేగానికి లోనవుతాం.  అనుకోకుండా అలాంటి ఓ కొండకి ఈ మధ్య వెళ్ళి వచ్చాం....అదే పాండవుల గుట్టలు (పాండవుల గుహలు, పాండవుల కొండలు....ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు). పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు అక్కడ ఉన్నారని కథ,  దానికి ఆనవాళ్లుగా అక్కడ కొండల మీద దశరథుడు గీసాడని చెప్పే బొమ్మలు ఇంకొన్ని చారిత్రిక ఆధారాలు ఉన్నాయి.....ఇవన్నీ నిజమా కాదా అన్నది పక్కన పెడితే.....పచ్చని చేల మధ్య ఈ కొండలు మాత్రం నిజంగా ఓ అద్భుతం. నాకు బాగా నచ్చాయి.  ఇవి వరంగల్లు జిల్లా రేగొండ మండలంలో ఉన్నాయి.


పోయిన వారాంతం వరంగల్లు జిల్లాలోని రామప్ప గుడి చూడటానికి వెళ్లి పనిలో పనిగా వీటిని కూడా చూసి వచ్చాం.  రామప్ప గుడి నుండి 24 కి.మీ దూరంలో ఈ కొండలు ఉన్నాయి.  రామప్ప నుండి ఘనపురం మీదుగా పరకాల రోడ్డులో భూపాలపల్లి క్రాసు రోడ్డు (కొత్తపల్లి) దాకా వెళ్ళాక ఎడమ వైపుకి తిరిగితే అక్కడి నుండి ఒక కి.మీ దూరంలో జూబ్లీనగర్--తిరుమల గిరి గ్రామాల మధ్య ఉన్నాయి ఈ కొండలు. ఈ కొండల్ని చూస్తే మెకన్నాస్ గోల్డు సినిమాలోని కొండలు గుర్తొస్తాయి (నేను చూసిన నాలుగయిదు ఇంగ్లీషు సినిమాలలో ఇది ఒకటి, అదీ బడాయి).

ఈ కొండలు ఓ 300-400 మీటర్ల ఎత్తు ఉండి ఉండవచ్చు.  వీటిని పూర్తిగా చూడాలంటే ఓ రోజు పడుతుంది.  ఎన్ని గుహలో.....ఎన్నెన్ని మలుపులో!  అన్నీ ప్రకృతి విచిత్రాలే!  కొండ పైకి నడవటానికి కొంతవరకు మెట్లు, సిమెంటు చేసిన దారి ఉన్నాయి. ఆ పైన ఎక్కాలంటే కాస్త కష్టమే. ఓపిక  ధైర్యం  ఉన్నవాళ్లు  ఎటునుండయినా  ఎక్కవచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే వీటిని గురించి చెప్పేవాళ్లు.... దారి చూపించే వాళ్లు లేకపోతే వీటిని చూడటం మన వల్ల కాదు. వచ్చిన వాళ్లకి దారి చూపించటానికి, వాటి గురించి చెప్పటానికి ఆ కొండల దగ్గర ఓ ఇద్దరు ముసలి వ్యక్తులు ఎప్పుడూ కాచుకుని కుర్చుని ఉంటారు....వాళ్లు లేకపోతే మనం ఏమీ చూడలేము.  వాళ్లకి ఎంతో కొంత మనకు తోచినంత ఇస్తే చాలు.  ఆ వయస్సులో కూడా వాళ్లు అంత ప్రయాసపడి మనకి దారి చూపుతున్నందుకు నిజంగా అభినందనీయులు.  అది వాళ్లకి భుక్తి మార్గం కూడా.  వాళ్లు గత నలభై సంవత్సరాలనుండి ఇదే వృత్తిలో ఉన్నారట, మరియు ఈ కొండలకి ఈ మాత్రమన్నా ప్రాచుర్యం రావటానికీ,  అక్కడ ఈ మెట్ల సౌకర్యం అదీ రావటానికి వారే కారణమట! ఇంకా ఏదో చేయాలన్న తపన ఉంది వాళ్లల్లో.


మేము కొండ పైకి సుమారు రెండు కి.మీ ఎక్కి ఉంటాము.....అంటే అంతవరకే నడక దారి మెట్లు ఉన్నాయి . కొండలు విభిన్న ఆకృతులలో భలే ఉన్నాయి.  అభిమన్యుడి  రధచక్రం,  కృష్ణుడి చక్రం...ఇలా ఆకారాలని బట్టి వాటికి పేర్లు.  ఓ కొండ అయితే పడుకున్న ఒంటె ఆకారంలో ఉంది.  మధ్య మధ్య చిన్న చిన్న నీటి మడుగులు...వాటికి కుంతీ గుండం, ద్రౌపది గుండం..భరధ్వాజ గుండం..పాండవుల కోనేరు.... అని ఏవేవో పేర్లు.  ఇంకొక విషయమేమిటంటే ఇక్కడి రాళ్లు అసలు జారవు,  కొంచం గరుకుగా ఉన్నాయి.


ఓ నిఠారయిన కొండ మీద కుంతీదేవి గుడి ఉంది.  ఈ  కొండ ఎక్కటం చాలా కష్టంగా ఉంటుంది.....ఏటవాలుగా కొండ అంచు మీద ఎక్కాలి.  మధ్యలో పట్టుకోవటానికి నాలుగు చిన్న చిన్న ఇనుప రాడ్లు పాతారు.. ..ఆ రాడ్ల పక్కనే కాలు పెట్టటానికి కొంచం రాతిని చెక్కారు.  అవి కూడా ఈ మధ్యే పెట్టారట....లేకపోతే అసలు ఎక్కలేకపోదుం..ఆ కొండ అంచున ఎక్కుతూ ఒక్కసారి కిందకి చూసామంటే.....ఇక అంతే!  కాస్త భయం ఉన్నవాళ్లయితే కిందకి పడిపోతారేమో కూడా!  ఆ ముసలివాళ్లు ఇద్దరూ మాత్రం ఎంత అలవోకగా ఎక్కారో!  పైకి ఎక్కాక మాత్రం మహ ఆద్భుతంగా ఉంటుంది....ఓ గుహ.....అందులోకి మోకాళ్లమీద పాకుతూ వెళ్లాలి....అక్కడ..అప్పట్లో కుంతీదేవి పూజ చేసిన దేవుని విగ్రహాలని చెప్తారు....అవి ఉంటాయి.  పక్కన నీటి గుండం..అక్కడ నీరు ఎప్పుడూ వస్తుంటుందట.

ఇది ధర్మరాజు  పీఠం

మునీశ్వర గుహ,  ధర్మరాజు పీఠం..ఇలా కొన్ని గుహలకి పేర్లు పెట్టారు.  మునీశ్వర గుహ....ఇక్కడ భరధ్వాజ ముని తపస్సు చేసుకునేవాడట. ధర్మరాజు పీఠం...ఇక్కడ ధర్మరాజు కూర్చునేవాడట. ఇక్కడ చాలా  చల్లగా ఉంది. అక్కడే రకరకాల బొమ్మలు గీసి ఉన్నాయి...వాటిని పాండవులు గీసారని చెప్తారు. అవన్నీ కూడా ఎప్పటివో పురాతనకాలం నాటివి లాగానే ఉన్నాయి.  కొండ పైకి ఎక్కేముందు కూడా కింది నుండి చూస్తుంటే  ఒకచోట జింకల బొమ్మలు గీసి ఉంటాయి....... ధర్మరాజు ఎక్కడ ఉంటే అక్కడ అలా జింకలు బొమ్మలు గీసేవాడట!!

ఇవి పాండవులు గీసిన బొమ్మలట!

అప్పట్లో వాళ్లు రాళ్లతో గుమ్మాలు దర్వాజాలు కూడా కట్టుకున్నారట....అలాంటి ఓ ధర్వాజా  చూసాము.  మేము అన్ని కొండలు చూడలేదు.....అవన్నీ చూడాలంటే చాలా ఓపిక కావాలి....ఎక్కటం కూడా  కష్టమే.  ఈ కొండల మీద రకరకాల మెడిసినల్ ప్లాంట్సు కూడా ఉన్నాయి..పాము విషానికి విరుగుడుగా పనికొచ్చేవి..డయాబెటిస్‌ (షుగర్) వ్యాధికి వాడే ఆకులు, జమ్మి, మారేడు.. ఇలా చాలా రకాల మొక్కలు చూపించారు.

ఇదే రాతి దర్వాజా,  మాకు దారి చూపిన తాత

ప్రస్తుతానికయితే ఈ కొండల దగ్గర పర్యాటకులకు ఎలాంటి  సౌకర్యాలు లేవు.  అసలు వీటి గురించి సరయిన ప్రచారం కూడా లేదనే చెప్పవచ్చు.  వీటిని చూసాక మన చుట్టూ ఉన్న ఇలాంటి వాటిని వదిలి ఎక్కడికెక్కడికో వెళ్లి చూసి వస్తుంటాము అనిపించింది.  ఎప్పుడూ చూసే ప్రదేశాలే కాకుండా ఇలాంటి చోట్లకి వెళితే కొత్త అనుభవాలు..కొంగొత్త అనుభూతులు మన సొంతం చేసుకోవచ్చు.  పిల్లలకి కూడా మంచి హుషారుగా ఉంటుంది. హైదరాబాదులాంటి రద్దీ ప్రదేశాలనుండి ఇలాంటి వాటి దగ్గరకి వెళితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో!

 ఇప్పటికయితే ఇక్కడ  పర్యాటకుల రద్దీ అసలు లేనట్టే,  ఎప్పుడయినా వస్తుంటారట.  మేమెళ్లిన రోజయితే పండగని ఎవరూ రాలేదు అని చెప్పారు.  ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని వీటిని అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక స్థలంగా మారుతుంది.

ఈ గుట్టలకి సంబంధించిన మరికొన్ని చిత్రాలు నా ముందుటి టపాలో చూడవచ్చు.




Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP