యామిని పిల్లలు-వెన్నెల కిరణాలు
ఈ చిత్రం గూగుల్ సౌజన్యం
ప్రమదావనం సహాయ కార్యక్రమంలో భాగంగా ఈ సారి యామిని ఫౌండేషన్ వారికి సహాయం అందించటం జరిగింది. యామిని ఫౌండేషన్ అన్నది మానసికంగా వెనుకపడ్డ పిల్లలకి సేవలు అందిస్తున్న ఓ స్వచ్చంద సంస్థ. ఈ సంస్థ గురించిన మరిన్ని వివరాలకు "సామాన్యులలో అసామాన్యులు" టపా చూడవచ్చు.
ముందుగా ప్రమదావనం గురించి ఓ రెండు మాటలు
అలా మొదలయిన ఈ ప్రమదావనం ప్రస్థానంలో సమాజంలో అవసరం ఉన్నవారికి చేతనయినంత సహాయం చేద్దామన్న తలంపుతో సహాయ కార్యక్రమాలకి కూడా అంకురార్పణ జరిగింది. ప్రమదావనం సభ్యుల నుండి కొంత మొత్తం సేకరించి ఈ కార్యక్రమాలకి వినియోగించటం జరుగుతుంది. ఇక్కడ నిర్భంధం ఏమీ వుండదు. ఇవ్వగలిగిన వారే ఇవ్వొచ్చు. ఎవరికి తోచినంత వారు ఇవ్వొచ్చు. ఎవరికి సహాయం చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలు ప్రమదావనంలో చర్చించి నిర్ణయాలు తీసుకోబడతాయి. మొదటిగా "అంకురం" అని ఆడపిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఓ స్వచ్చంద సంస్థకి సహాయం చేయటం ద్వారా ఈ సహాయ కార్యక్రమాలకి 2008 నవంబరులో అంకురార్పణ జరిగింది. అక్కడి పిల్లలకి కావలసిన స్టేషనరీ సామాను కొనివ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతిస్పందనగా మన తెలుగు బ్లాగులోకంలో నుండి కొంతమంది పురుషులు స్వచ్చందంగా ముందుకు వచ్చి వారు కూడా మా సహాయ కార్యక్రమాలకి ఇతోధిక తోడ్పాటు అందించటం మాకెంతో సంతోషంగా వుంది.
ఇంకొక్క మాట-తెలుగులో బ్లాగు వ్రాసే ప్రతి ఒక్క మహిళ ఇందులో బై డిఫాల్టు సభ్యులవటం జరగదు మరియు ప్రతి ఒక్క తెలుగు మహిళా బ్లాగరు ఇందులో సభ్యులు అయి ఉండాలన్న నియమం కూడా ఏమీ లేదు. ఆసక్తి ఉన్నవారు ఇందులో సభ్యులుగా చేరవచ్చు.
కిందటి శనివారం (21-02-09) ప్రమదావనం సభ్యులు యామిని స్కూలుకి అవసరమైన కొన్ని కుర్చీలు మరియు అక్కడి పిల్లలకి మధ్యాహ్న భోజనానికి అవసరమయిన సరుకులు కొనివ్వటం జరిగింది.
పై సరుకులు, కుర్చీలు వారికి అందచేసిన తరువాత అక్కడి పిల్లలతో కాసేపు గడిపాము. స్కూలు పక్కన కల పార్కులో ఆ పిల్లలతో కలిసి ఓ గంట పైగా గడపటం నిజంగా మర్చిపోలేని అనుభవం.
వాళ్లతో ఆడి పాడి కాసేపు మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాం. కాలం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. అలా ఆడుకుంటుంటే వాళ్లలో ఎంత హుషారో! ఆటలలో పాటలలో మామూలు పిల్లలకి మేమేమీ తీసిపోమనిపించారు. వారి ముఖాలలోని ఆనందపు వెలుగులు చూసాక ఆర్థిక సహాయంతో పాటు ఇలా వారితో గడపటం కూడా వాళ్లకి అవసరమే అనిపించింది.
ఇక్కడి పిల్లలలో చాలామంది మనం చెప్పినవి అర్థం చేసుకుని ఆచరించగల మానసిక వయస్సు ఉన్నవారే అందువలన మాకు వారితో ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు. ఒకరిద్దరు హైపర్ ఆక్టివ్ పిల్లలు ఉన్నా మాతోపాటు టీచర్సు కూడా ఉన్నారు కాబట్టి వారితో కూడా ఎలాంటి సమస్యా ఎదురవలేదు. అందులో కొంతమందికి మాటలు సరిగా రావు అయినా ఎంత ఉత్సాహంగా ఉన్నారో!
"అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే" అంటూ యామిని అన్న పాప చాలా చక్కగా ఓ పాట పాడి వినిపించింది. తనకి చాలా పాటలు వచ్చని చెప్పింది. ఈ సారి ఆ పాప పాటలు రికార్డు చేసి తేవాలి. ఈ పాపకి మానసిక వైకల్యంతో పాటు శారీరక వైకల్యం కూడా వుంది. రెండు కాళ్లూ పోలియో వల్ల దెబ్బతిన్నాయి. ఇలాంటి వారు ఇంకో ఇద్దరు ఉన్నారు. ఈ పిల్లల ఆత్మస్థైర్యాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేసింది. చిన్నిచిన్ని కారణాలకే జీవితం మీద విరక్తి పెంచుకుని ఆత్మహత్యలకి పాల్పడేవారికి వీళ్లని ఒక్కసారి చూపించితే చాలు.
పిల్లలతో కాసేపు గడిపాక వారిని మరలా స్కూలులో వదిలిపెట్టి మేము సెలవు తీసుకున్నాము. నేనయితే అప్పుడప్పుడు వెళ్లి ఇలా వాళ్లతో గడిపి రావాలని నిర్ణయించుకున్నాను. స్కూలు వారు పిల్లలని ఇలా ప్రతి బుధవారం పార్కుకి తీసుకెళుతుంటారట. ఈ విషయం నాకు చాలా నచ్చింది. అంతే కాక అదే రోజు సాయంత్రం జూబిలీ హిల్సులో ఓ ఫోటొ స్టూడియోకి ఈ పిల్లలచేత ప్రారంభోత్సవం చేయించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆ పిల్లలలో మీరు కూడా మాలో ఒకరే అన్న భావం పెంపొందించిన వాళ్లమవుతాం కదా అని అనిపించింది!
ప్రస్తుతం ఈ స్కూలుని అద్దె భవనంలో నడపుతున్నారు. త్వరలో స్కూలుకి స్వంత భవనం ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలనీ కమిటీ వారు కాలనీలో కొంత స్థలం ఇచ్చారు. స్థలంతో పాటు నిర్మాణ వ్యయంలో సగం భరిస్తామని ముందుకొచ్చారట. మిగతా సగం స్కూలు వారు పెట్టుకోవాలి. దీనికోసం స్కూలు వారు బయటవారి సహాయాన్ని ఏ రూపంలో ఇచ్చినా తీసుకుంటారు, అంటే ధనరూపేణానే కాకుండా ఇనుము, ఇటుకలు, సిమెంటు, ఇసుక, తలుపులు, కిటికీలు లాంటివి, ఇంకా భవన నిర్మాణానికి అవసరమైన సామగ్రి ఏమి ఇచ్చినా తీసుకుంటారు.
ఈ స్కూలుకి సహాయం చేద్దామనుకున్న వారు ఈ కింది అడ్రస్సులో వారిని సంప్రదించవచ్చు.
Yamini Educational Society
Plot No 5-80-C/2, Vivekanandanagar Colony, Kukatpally
Hyderabad-500072
Phone: 23061796
School founder: K. Sreenivasa Rao; Mobile: 98494 23055
18 వ్యాఖ్యలు:
ప్రమదావనం సభ్యులందరికి జయహో...
ఈ స్పూర్తి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను..
మంచి కార్యక్రమం. అందరూ తలో చెయ్యి వేస్తే ఆ సంస్థలోని పిల్లలకు సహాయంగా వుంటుందని భావిస్తాను.
ప్రమదావనం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసింది నాకు. ఆ పదం అయితే ఇప్పటికి చాలాసార్లు చూసాను. టూకీగా దాని గురించి తెలిపినందుకు నెనర్లు. మంచి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న ప్రమదావనం సభ్యులకు అభినందనలు.
వరూధిని గారూ !
"యామిని పిల్లలు-వెన్నెల కిరణాలు"టైటిల్ చక్కగా ఉంది .వివరణ కూడా అంటే బావుంది .అభినందనలు .
నరసింహ గారూ... మీరు ఎక్కడికో వెళ్లి పోయారు. తలా ఒక చెయ్యి వెయ్యడమా? ఏ విషయంలో?? రాళ్ళు వెయ్యడం లోనా?? ఆడ బ్లాగరుల మనసు నొప్పించడానికా?? బ్లాగుల ముఖ్య ఉద్దేశ్యాన్ని మంట కలపడానికా?? బ్లాగులంటే విరక్తి కలిగించడానికా?? కోజాల్లాగా అజ్ఞాతంలో ఉండి కామెంట్లు విసరడానికా?? దొంగ పేర్లు పెట్టుకొని వారి వారి అసూయలను, అక్రోశాలని, అహాన్ని వేలిబుచ్చడానికా?? పిరికి సన్నాసుల్లాగా , ఆడంగి వెధవల్లాగా ప్రవర్తించ దానికా?? శుభాకాంక్షలు, దీవెనలు, (ఫ్రీయే గాబట్టి) అందించమంటే రెడి. జేబులో మాత్రం చెయ్యి పెట్టం. ఇది ఇప్పుడు ఉన్న కొంత మంది బ్లాగర్ల స్తితి. అనవసర, ఎందుకూ పనికి రాని, కొరగాని, పేజీలకి పేజీల ' సోది' సొల్లు, తనేదో ప్రపంచానికి, దేశానికి, సమాజానికి, సంఘానికి ఏంటో చేసానని, స్వంత డబ్బాలు కొట్టుకుంటానికి టపాలు రాయమంటే రడీ. అనవసరం విషయాల్లో జోక్యం చేసుకుంటానికి యమా రడీ. అంతేకాని సహాయం చేయడానికి మాత్రం ఆమడ దూరం. చెయ్యీ రాదు.. మనసూ అంతకన్నా రాదు.
చాలా మంచి పని చేస్తున్నారు. Hats Off
వరూధిని గారు,మంచి టైటిల్ పెట్టారు.
ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు సార్థకత చేకూరేలా ఉన్నాయి ఈ కార్యక్రమాలు! లోకం తీరు తెలియని ఆ పసిపిల్లలు ఎంత అదృష్టవంతులో! ఇలాంటి పిల్లలకోసం ఎంత ఖర్చైనా పెట్టొచ్చు అనిపిస్తోంది. వారితో కలిసి కొద్ది సేపు గడిపినా అది quality time అవుతుంది.
చాలా స్ఫూర్తి దాయకంగా ఉంది. అయితే మరో కార్యక్రమానికి రూపకల్పన ఎప్పుడో ఆలోచించాలిక.
చాలా మంచి పని చేస్తున్నారు. Hats Off
ప్రమదావనం ఏం చేస్తోందో వివరించినందుకు ధన్యవాదాలు. నిజంగా చాలా మంచి పని చేశారు..
ఈ స్పూర్తి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను..
వరూధిని గారూ.. నా లాంటి వాళ్ళం ప్రత్యక్షంగా భాగస్వాములం కాలేకపోయినా.. ఫోటోలతో సహా టపా రాసి.. మేము కూడా ఈ మంచి పనిలో భాగం పంచుకున్నాం అనే చక్కటి అనుభూతికి లోనయ్యేలా చేశారు.
యామినీ స్కూల్ పిల్లలని కలిసి వారికి మన ప్రమదావనం తరపున సహాయాన్ని అందజేసినందుకు, వారితో కాస్త సమయం గడిపి ఆనందాన్ని కలిగించినందుకు, మన ప్రమదా స్ఫూర్తిని నిలిపినందుకు.. మీకు హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు..!
టైటిల్, బొమ్మ చాలా బావున్నాయి.! ఫోటోలు కూడా.. :)
ఆంధ్రులు ఆరంభ శూరులు అని అపవాదు. ప్రమదావనం చేపట్టిన సహాయకార్యక్రమం ద్వితీయ విఘ్నం గడిచి ఇలా ముందడుగు వెయ్యడం చాలా సంతోషం కలిగిస్తోంది. ఆయా సంస్థల కార్యకాలాపాల గురించి, వారి అవసరాలను గురించి ఇలా బ్లాగులో రాయడం వల్ల ఇతరులు కూడా తెలుసుకుని సహాయపడేందుకు ముందుకు వచ్చే అవకాశం ఇస్తున్నారు. అభినందనలు.
రేపు నేను నా contribution ని పంపిస్తున్నాను.
స్పందించిన అందరికి ధన్యవాదాలు.
కృష్ణారావు గారు సంతోషం మరియు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలు మాత్రం సీమ టపాకాయలండి:)
ప్రమదావనం సభ్యులకి, పాలు పంచుకున్న ప్రతిఒక్కరికి ప్రత్యేక అభినందనలు. శీర్షిక, ఫోటోలు బాగున్నాయండీ, స్ఫూర్తిదాయకంగా ఉంది మీ టపా.
వరూధినీ, చాలా చక్కగా, మంచి సంయమనంతో వివరించారు. కృష్ణారావుగారిభాషలో ఔద్ధత్యం అనవసరం అనిపించినా, సాయం చేస్తానన్నందుకు సంతోషమే. ప్రధానంగా పిల్లలతో కాలం గడపడం, మీరు వేరు కాదు అని వారికి తెలియజేయడం అవసరం. నేను గుంటూరులో బాలకుటీర్ లో గడిపిన 13 రోజులు నాజీవితంలో మరిచిపోను.
మొదటి అడుగు విజయవంతంగా వేసారు. రెండో అడుగు వేయడానికి ముందు ఎన్నో అడ్డంకులు, ఒకానొకసమయంలో ప్రమదావనం అంటే ఇంత హేళనా అన్నంత అసహనం. ఇక్కడ కూడా మహిళలికి ఒక ఆసరా అంటూ చేయి చాచి అండ కోరాల్సిందేనా అన్నంత ఆలోచన వచ్చే సమయంలో అవసరంలేదని అడ్డంకులని అధిగమించి రెండో అడుగు విజయవంతంగా వేసారు. అభినందనలు ప్రమదావనం సభ్యులందరికి.. మూడో అడుగు ఇక త్రోటు పాటు అవసరం లేదు. జయం ఎప్పుడు మంచితనానికే.
మీ వ్యాఖ్యలు మాత్రం సీమ టపాకాయలండి.. అదే బాధగా ఉంది. ఒట్టి సౌండ్ మాత్రమె. పేలి వీర లెవెల్ గాళ్ళ మొహాలని పచ్చడి చేస్తే బాగుండును. THEN... నిన్ననే నా చిన్ని చెక్కును యామిని వారికి పంపాను.
Post a Comment