సామాన్యులలో అసామాన్యులు-1
యామిని ఫౌండేషన్
20 సంవత్సరాల వయస్సులో కూడా పసిపిల్లల మనస్తత్వం, ఆకలేస్తే అన్నం తినాలని తెలియనితనం, హద్దుల్లేని భావోద్వేగాలు, ఎందుకు నవ్వాలో ఎందుకు ఏడవాలో తెలియనితనం, కల్మషం లేని నవ్వు, ఒక్కక్షణం కేరింతలు-మరో క్షణంలో అరుపులు ఏడుపులు---ఈసునసూయలు, మాయా మర్మం, కుట్రలు కుతంత్రాలు తెలియని మనుషులు---వారే మానసికంగా ఎదగని పిల్లలు---రాగద్వేషాలకి అతీతులు---తమదైన లోకానికి తామే ప్రభువులు.
ప్రతి తల్లిదండ్రి తమ బిడ్దలు ఆనందంగా ఆరోగ్యంగా సుఖసంతోషాలతో వుండాలని కోరుకుంటారు. దాని కోసం అహోరాత్రులు కష్టపడతారు-ఇది మనకు ఓ మామూలు విషయమే. కాని కొంతమంది తల్లిదండ్రులు వుంటారు- తమ బిడ్దతో పాటు ఇతరుల బిడ్దల గురించి కూడా ఆలోచించేవాళ్లు. అది కూడా మామూలు బిడ్డలు కాదు తమ ఉనికి గురించి తమకే సరిగా తెలియని మానసికంగా ఎదగని పిల్లల గురించి. (వీరిని ఇప్పుడు మానసిక వికలాంగులు అనో మెంటల్లీ రిటార్డెడ్ అనో అనటం లేదు......మెంటల్లీ చాలెంజ్‌డు, మెంటల్లీ డిసేబుల్డు, ఇంటలెక్చ్యువల్లీ డిసేబుల్డు, ఇంటలెక్చ్యువల్లీ చాలెంజ్‌డు, డెవలప్‌మంటల్లీ చాలెంజ్‌డు, డెవలప్‌మంటల్లీ డిసేబుల్డు, స్పెషల్ చిల్డ్రన్ అంటున్నారు, మరి తెలుగులో ఏమంటున్నారో? నేనయితే మానసికంగా ఎదగని పిల్లలు అని అంటున్నాను).
తమ చిన్నారి పాపకి బుద్ది మాంద్యం సంక్రమించినప్పుడు తమకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తమ లాంటి పరిస్థితులలో ఉన్న ఆర్థికంగా వెనుకపడిన తల్లిదండ్రులకి బాసటగా మానసికంగా ఎదగని పిల్లల కోసం ఓ వ్యక్తి నెలకొల్పిన సంస్థ యామిని ఫౌండేషను.
శ్రీకాకుళంకు చెందిన శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు పిల్లలు. అందులో మొదట పుట్టిన అమ్మాయికి మూడు నెలల వయస్సులో వచ్చిన మెదడు వాపు వ్యాధి కారణంగా ఆ అమ్మాయిలో మానసిక ఎదుగదల లోపించింది. తమ కూతురికి చికిత్స చేయించటంలో, విద్యాబుద్దులు నేర్పించటంలో సంఘంలో తమకు ఎదురైన అనుభవాలని దృష్టిలో పెట్టుకుని మానసికంగా సరైన ఎదుగుదల లేని పిల్లలకు సాయపడాలనే ఉద్దేశ్యంతో కొంతమంది మితృల సహకారంతో హైదరాబాదులోని కూకట్‌పల్లిలో 2005 లో వీరు యామిని స్కూలుని ప్రారంభించారు.
శ్రీనివాసు గారు వెనకాల ఆస్తిపాస్తులు ఉన్నవారు కాదు, పెద్ద ఉద్యోగీ కాదు, రాజకీయ నాయకుడూ కాదు, ఓ సామాన్య దిగువ మధ్యతరగతి వ్యక్తి. బ్రతుకు తెరువు కోసం ఆయన చేసేది ఓ చిరు వ్యాపారం. డబ్బు సహాయం, మాట సహాయం చేసేవాళ్లు చాలామందే ఉంటారు, కానీ బుద్దిమాంద్యం వున్న పిల్లలని తన కూతురితో సమానంగా ఆయన చేరదీయటం నిజంగా గొప్ప విషయం. అందుకే ఆయన నా దృష్టిలో సామాన్యులలో అసామాన్యుడు. ఆయనకి తోడ్పాటునందిస్తున్న మిగతా చేతులకి కూడా నా వందనాలు.
ప్రస్తుతం ఈ సంస్థ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకి చెందిన 52 మంది బుద్దిమాంద్యం ఉన్న పిల్లలకి ఉచిత ప్రత్యేక విద్య, వైద్య సహాయం, మధ్యాహ్న భోజనం, బట్టలు మరియు వారికి అవసరమైన కౌన్సిలింగు, ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ లాంటి సేవలను అందచేస్తుంది.
ఇక్కడ 6 ఏళ్ల వయసు పిల్లలనుండి 40 ఏళ్ల వయస్సు వారి వరకు వున్నారు. 40 ఏళ్ల వయస్సు వారు కూడా చూడటానికి 15-20 ఏళ్ల వయస్సు వారిలా అనిపిస్తారు, వీరి మానసిక వయస్సు కూడా 3 సంవత్సారాలే వుంటుంది. వీరి మానసిక ఎదుగుదలని బట్టి వీరికి ఇవ్వాలిసిన శిక్షణ వుంటుంది. పిల్లల మానసిక వయస్సుని బట్టి ప్రైమరీ, సెకండరీ, వొకేషనలు అని మూడు విభాగులుగా చేసి వారికి శిక్షణ ఇస్తున్నారు. పిల్లల మానసిక వయస్సు తెలుసుకోవటానికి వీరు NIMH (National Institute for the Mentally Handicapped) వారి సహాయం తీసుకుంటున్నారు. ఏదైనా ప్రత్యేక చికిత్స అవసరం అయిన సందర్భాలలో కూడా వీరు NIMH వారి సహాయం తీసుకుంటున్నారు. ఇక్కడ పిల్లలలో ఆటిజం సమస్య ఉన్న ఓ పిల్లవాడు వున్నాడు. తనకంటూ ఎవరూలేని ఓ అనాధ పిల్లవాడు కూడా వున్నాడు. ఇతనికి స్కూలు వారే ఓ వసతి గృహంలో వసతి సౌకర్యం ఏర్పాటు చేసారు.
ఇలాంటి పిల్లలతో వ్యవహరించటానికి చాలా ఓర్పు, నేర్పు, అంకితభావం వుండాలి. ఈ స్కూలులో పిల్లలకు అవసరం అయిన ప్రత్యేక విద్యనందించటానికి శిక్షణ పొందిన టీచర్సు వున్నారు. ప్రస్తుతం ఈ స్కూలు వారూ వీరూ ఇచ్చే విరాళాల మీద నడుస్తుంది. మధు వారణాసి అన్న ఓ హోమియో డాక్టరు అన్ని విధాలా తనకు చేతనైన తోడ్పాటు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబరు 31 న ఈ పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇప్పిస్తున్నారు.
ఉన్నవాళ్లు సేవ చేయటం గొప్ప కాదు, ఓ దిగువ మధ్యతరగతి వ్యక్తి ఇదంతా చేస్తున్నాడంటే మనకు చాలా అశ్చర్యం, ఆనందం కలుగుతాయి. నేను, నా ఇల్లు, నా పిల్లలు--ఈ వృత్తం లోనే గిరిగీసుకుని వుండే మనలాంటి వారం ఇలాంటి వారిని చూసి నేర్చుకోవలసినది చాలా వుంది. కల్లా కపటం తెలియని ఈ పసిమనసుల్ని చూస్తే మనస్సుకి హాయి అనిపిస్తుంది. అసూయలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు తెలియని వారి స్వచ్చమైన నవ్వుని చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయి ఎవరికైనా.
ఎక్కడో చదివాను ఒక సామాన్యుణ్ణి వాడు చేసే చిన్న పనిని గుర్తించి ప్రోత్సహిస్తే వాడు ఖచ్చితంగా మరో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు అని-అందుకే ఇంతకుముందు అంకురం పిల్లలకు సహాయపడిన విధంగా ఈ యామిని ఫౌండేషను వారికి కూడా ప్రమదావనం తరుపున చేతనైన సహాయం చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
10 వ్యాఖ్యలు:
మంచి సంస్ధని పరిచయం మనసుని తట్టేలా చేసారు.
చాలా విషయాలు చెప్పారు...అటువంటి వారికి సేవ చేసిన వారి జీవితం ధన్యం..భగవంతుడు తప్పకుండా వారికి మంచి చేస్తాడు..
వరూధిని గారూ మీ శీర్షికకి సరైన వ్యక్తిని ఎన్నుకున్నారు! మొన్న అంకురం లోని పిల్లలు, ఇప్పుడు వీళ్ళని గురించి చదువుతుంటే మనసు ద్రవించిపోతుంది :(
అంతమంది పిల్లలకి విద్య, భోజనాదులే కాకుండా థెరపీలు కూడా ఉచితంగా అందించాలంటే ఎంత ఖర్చు అవుతుందో కదా! ఈ సంస్థకి ప్రమదావనం సహాయహస్తం అందబోతున్నందుకు సంతోషంగా ఉంది..
వరూధిని గారూ మీరు పరిచయం చేసిన శ్రీనివాస్ గారు నిజంగా "సామాన్యులలో అసామాన్యులు ".
ఈ కష్టం నా కే ఎందుకు రావాలి అని బాధపడుతూ కూర్చోకుండా అటువంటి కష్టం లో వున్న మరికొంత మందికి తాను సహాయం చేస్తున్నారంటే వారే నిజమైన" ధీరులు".
ఈ సంస్థకు సహాయం చేయటం కొరకు వాళ్ళ వివరాలు కావాలి.
మీరు వాటిని తెలియజేయగలరా?
సంతోషం. సంకల్ప బలానికి మించిన నిధికానీ అవలంబన కానీ లేదని శ్రీనివాస్ దంపతుల వంటి అసాధారణ వ్యక్తులు నిరూపిస్తుంటారు.
వరూధిని గారూ !మంచి విషయాన్ని టపా ద్వారా అందరికీ తెలియ చేశారు .అభినందనలు .
చాలా బాగుందండి..
ఈ పిల్లల చేత జూబ్లీ హిల్సులో ఓ ఫోటొ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం చేపించపోతున్నారు.
@భవాని గారు, మీరు మొదటి ఫోటొ మీద క్లిక్ చేస్తే వాళ్ల అడ్రస్సు కనపడుతుంది.
సరైన టైటిల్ సిరిసిరిమువ్వ గారు. మంచి సంస్థని పరిచయం చేసినందుకు నెనర్లు.
Post a Comment