పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

January 9, 2009

నిగ్గదీసి అడుగు......

సత్యంలో అంతా అసత్యమేనట.  మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే కష్టాలలో వున్న సాఫ్టువేర్ పరిశ్రమకి మరో దెబ్బ. ఇక్కడ నాకు అర్థం కాని విషయం--ఇలాంటివి బయటపడ్డప్పుడే మన పత్రికల వాళ్లు అంతకుముందు వున్న లోట్లు, లొసుగులు, జరిగిన మోసాలు, ఇత్యాది గురించి పేజీలకి పేజీలు కథనాలు ప్రచురిస్తుంటారు ఎందుకని?(investigative journalism అంటే ఇదే అంటారా!)  ఇవన్నీ ముందే బయటపెడితే  సామాన్య మానవుడు కాస్త జాగ్రత్తపడతాడుగా. అయినా ఇక్కడ సామన్యుడిని పట్టించుకునేది ఎవరంటారా? అదీ నిజమే.

ఆటోవాడు మీటరు వేయను నేను అడిగినంత ఇవ్వాల్సిందే అన్నప్పుడూ, తప్పుడు మీటరుతో ఎక్కువ డబ్బులు తీసుకున్నప్పుడూ, అరటిపళ్ల బండి వాడు డజను కాయలకి 10 కాయలే వేసి నన్ను మోసం చేయాలని చూసినప్పుడూ, పేపరు వాడు సరిగ్గా  పేపరు వేయకుండానే పేపరు బిల్లుకి వచ్చినప్పుడూ, పాలవాడు నిలవ వున్న (ముందు రోజువి) పాల పాకెట్లు వేసినప్పుడూ---చ లోకంలో అంతా మనల్ని మోసం చేయాలని చూసేవాళ్లే అని బాధపడిపోతుంటాను, వాళ్లని ఏదో చేయాలన్ని కసి, ఏమీ చేయలేని ఉక్రోషం, అస్సహాయత-కానీ ఇప్పుడు జరిగిన మోసం చూస్తుంటే ఇవన్నీ అసలు మోసాలే కాదు అనిపిస్తుంది.  వాళ్లు బ్రతకటానికి చేస్తుంటే వీళ్లు బ్రతక నేర్చి చేస్తున్న మోసం.

ఒకటి కాదు రెండు కాదు అక్షరాలా ఏడువేల కోట్ల రూపాయలకి దొంగ లెక్కలు. మరి ఇలాంటి మోసగాళ్లని ఏం చేయాలో! నే చేసింది తప్పే, అంతా నేనే చేసాను అని తప్పు ఒప్పేసుకుంటే సరిపోతుందా? అసలు ఇంత జరుగుతున్నా మూడోకంటికి తెలియకపోవటం ఏమిటి? మనింట్లో జమాఖర్చుల్లో ఓ పది రూపాయలు తేడా వస్తేనే మనకి నిద్ర పట్టదు  మరి అలాంటిది ఇన్ని కోట్లకి దొంగ లెక్కలు వేస్తుంటే అంత పెద్ద కంపెనీలో ఎవరికీ తెలియలేదా? మళ్లీ ఓ ప్రసిద్ధ విదేశీ కంపెనీ దాని లెక్కలు చూసేది.  వాళ్ల లెక్కలు వాళ్లే రాసుకునేప్పుడు దానికి ఇంకో కంపెనీ ఎందుకో? ఏంటో మనలాంటి వాళ్లకి అన్నీ ప్రశ్నలే! ఏది సత్యమో ఏది అసత్యమో అంతా అయోమయమే! అయినా మన ప్రశ్నలకి జవాబిచ్చేదెవరు?

సత్యం వాళ్లకున్న ఆస్తులు అన్నీ అమ్మితే ఈ కష్టాలనుండి బయటపడరంటారా? కానీ అమ్మరు! వాళ్ల కోట్లు వాళ్ల కోట్లలోనే వుండాలిగా మరి!! ఇవాళ సత్యం షేరు ధర ప్రారంభంలో ఆరు రూపాయలకు పడిపోయిందట! నిన్న మొన్నటి దాకా ఎవరైనా కలగన్నారా ఆ షేరు ఆ ధరలో లభిస్తుందని.  అదేంటో జనాలేమో రాజు గారు సత్యాన్ని గట్టెక్కించటానికి తన షేర్లు కూడా అమ్ముకున్నారు అని బాధపడిపోతున్నారు !  అప్పుడు కొనుక్కొన్న వాళ్ల గతి ఇప్పుడేంటి? ఇందులో లాభపడిందెవరు?నష్టపడిందెవరు? ఎంతమంది మదుపుదార్ల గుండెలు పగిలి వుంటాయి? మన ప్రశ్నలకి జవాబిచ్చేదెవరు?

సత్యం CFO వడ్లమాని శ్రీనివాస్ ఆత్మహత్యా ప్రయత్నం చేసారని మీడియా ప్రచారం చేస్తుంది, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇది కూడా  ఇంకో నాటకమా? మన ప్రశ్నలకి జవాబిచ్చేదెవరు?

ఇక్కడ నాకు గాయం సినిమాలో  సిరివెన్నెల పాట ఒకటి గుర్తుకొస్తుంది....

 నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం..మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమై పోనీ
మారదు లోకం..మారదు కాలం..||నిగ్గదీసి||

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం ..||నిగ్గదీసి||

పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్య కాండ..||నిగ్గదీసి ||

10 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar January 9, 2009 at 6:02 PM  

నిజమే! సిగ్గుసిగ్గు.

చైతన్య.ఎస్ January 9, 2009 at 7:35 PM  

బాగా చెప్పారు.

వెనుక దగా, ముందు దగా,
కుడి యెడమల దగా, దగా

krishna rao jallipalli January 9, 2009 at 8:09 PM  

సత్యం CFO వడ్లమాని శ్రీనివాస్ ఆత్మహత్యా ప్రయత్నం చేసారని ... ఆయనకీ, రాజుకి, మోహన రావుకి, పాలెపు జి. కృష్ణ, మహా ప్రతివ్రత మంగళం శ్రీనివాసన్ మరియు మిగతా directors కి ఏమి ఖర్మ ఆత్మహత్య చేసుకోవడానికి - చేసుకుంటే, గీసుకుంటే షేర్ హోల్డర్స్ చేసుకోవాలిగాని.

Vani January 9, 2009 at 8:45 PM  

మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను..

కొత్త పాళీ January 9, 2009 at 9:01 PM  

బాగా చెప్పారు. ఈ బడా కార్పొరేటు వ్యవహారాల్లో ఒక్ఖ విషయం నమ్మడానికి వీల్లేదు. ఇక్కడ ఎన్రాన్ కథ వినే ఉంటారుగా.
సరే, ఇహ మన మీడియా వారి ఇన్వెష్ట్గేటివు ముష్టిని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
తమాషాగా ఈ సందర్భంలో శ్రీశ్రీ కొటేషన్లు బాగా వింపిస్తున్నాయి. ఎవరో నిప్పులు చిమ్ముకుంటూ కోట్ చేశారు కానీ పైన చైతన్య గారి కొటేషను బాగా నప్పింది.

పెదరాయ్డు January 9, 2009 at 9:55 PM  

There is some thing worse going on in background.

Raju's note indicate he is trying to save some big heads. Raju seems to become scape goat in corp-political games. Does it look like a suicide note???

Unknown January 9, 2009 at 10:57 PM  

సత్యం సంస్థని కుటుంబ ఆస్థిలా వాడుకున్నారు రాజు గారు. ఆయన వాటా 8 శాతమే అయినా, తన కొడుకు కోసం మొత్త్తం సంస్థని ముంచేసారు.రామలింగ రాజు గారి కొడుకు తేజా రాజు అర్హత లేకున్నా, ఆకాశానికి నిచ్హెనలు వేసి రాజు గారిని, సత్యం ని ముంచేశాడు.అవినీతి శేఖరుడు తన ముడుపులు కోసం సత్యం ని, రాజు గారిని పావులా వాడుకున్నాడు. నాలుగు సంవత్సరాలుగా రామోజి సామ్రాజ్యాన్ని కూలగొట్టాలని విశ్వప్రయత్నాలు చేసినా వీలుగాని రౌఢీ శేఖరుడు,ధుర్యోధనుడిని, కౌరవ సామ్రాజ్యాన్ని ముంచేసిన శకుని వలే,తేజా రాజుని, సత్యం ని ముంచేచాడు.కొడుకు అత్యాశకి ద్రుతరాష్టుడిలా సత్యం సామ్రాజ్యాన్ని బలిపెట్టారు రామలింగరాజు.నాగార్జునా ఫీనాన్సు లో డ్యెరెక్టురుగా వున్న నిమేష్ కంపాని ని అరెష్టు చేయటానికి ఆఘమేఘాల మీద హడావిడి పడిన శేఖర్ దాదా (కేవలం రామోజి సంస్థ లో 1200 కోట్లు పెటుబడి పెట్టిన నేరానికి....),ఇప్పుడు రాజు నేరం ఒప్పుకున్నా గాని అరెష్టు చెయ్యటానికి ముందుకు రాని వెనుక ఎన్ని వందల కోట్ల అవినీతి సొమ్ము వుందో ఈ ప్రభుత్వ పెద్దలవద్ద.

Anil Dasari January 9, 2009 at 11:54 PM  

>> "ఇలాంటివి బయటపడ్డప్పుడే మన పత్రికల వాళ్లు అంతకుముందు వున్న లోట్లు, లొసుగులు, జరిగిన మోసాలు, ఇత్యాది గురించి పేజీలకి పేజీలు కథనాలు ప్రచురిస్తుంటారు ఎందుకని"

మేటాస్ పైన ప్రభుత్వ అవ్యాజానురాగాల గురించి ఇంతకు ముందూ ఎన్నో కధనాలొచ్చాయి. వాటిని చదివి వదిలేసినవాళ్లేగానీ పట్టించుకున్న ప్రజలెందరు? సెజ్‌ల పేరుతో సత్యం వంటి సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగటం గురించి కూడా వివరమైన వార్తలొచ్చాయి. వాటినీ చదివొదిలేశారు.

మేటాస్ టేకోవర్ ప్రకటన గురించి మీడియా ఎక్కువగా పట్టించుకోబట్టే సత్యం పరిస్థితి ఇలా అయింది అని కొందరు బ్లాగర్లు రాస్తున్నారు. మీడియా దేన్ని గురించైనా పట్టించుకుంటే ఒక చావు, పట్టించుకోకుంటే మరో చావులాగుంది.

సుజాత వేల్పూరి January 10, 2009 at 9:50 AM  

pedarayudu garu,

I agree with you! He is trying to save some big heads and the story behind them!

sbfkj sadi askdsao January 12, 2009 at 4:27 PM  

hello sarigamalu...
namskaram...
ok i agree with u openion but i have some Questions .
1."meeru eppudina annayam mee kalla mundu garugutunte aapara ?.
2.entomandi money,nammakanni,andhra pratistanu,kevalam tana gelupu kosam nasanam chesadu.
3.Ramalingaraju company petti jobs estunnadu ani anntru kondaru ,raju kakunte infosy,megasoft....inkokaru ...
kani samudram middle loki tesukoni poyi akkada vadileste ella?

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP