పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

August 30, 2011

హైదరాబాదు నుండి శ్రీశైలం దారిలో ఓ అద్భుతం..ఫరాహాబాద్

నిన్నటినుండి అలానే ట్యూన్ అయి ఉన్నారా! వేచి ఉన్నందుకు ధన్యవాదాలు.  రండి రండి... ఇప్పుడు మీకో అద్భుత ప్రదేశం చూపిస్తా. అదే ఫరాహాబాద్.



ఫరాహాబాద్.... హైదారాబాదు నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో  హైదరాబాదు నుండి 150 కి్.మీ దూరంలో ఉంది.  హైదారాబాదు నుండి వెళ్ళేటప్పుడు కుడివైపున వస్తుంది.  ఓ పెద్ద పులి బొమ్మ ఉంటుంది అదే గుర్తు. పక్కన బోర్డు కూడా ఉంటుంది.  రోడ్డు బాగుంది కదా అని రయ్ రయ్‍న  పోతే మిస్సు అవుతాం..కాస్త మెల్లగా వెళ్ళండి.


పులి బొమ్మ కనిపించిందా?...కనిపించింది కదా!..పక్కనే ఓ పెద్ద ద్వారం కూడా ఉంటుంది చూడండి.  .పులి బొమ్మ పక్కనే ఓ గది ఉంది కదా..అక్కడకి పదండి..అక్కడ వాళ్ళు మీకు అన్ని వివరాలు చెప్తారు. లేకపోతే కింద చదవండి!!

ఫరాహాబాద్...ఇది నల్లమల అడవుల్లో ఓ చూడ చక్కని ప్రదేశం.  ఫరహాబాద్ అంటే అందమైన ప్రదేశం అని అర్థం అట! నల్లమలలో దేశంలోనే అతి పెద్ద పులుల సంరక్షణా కేంద్రం ఉంది. ఈ ఫరహాబాద్ దగ్గర టైగర్ సఫారీ ఉంది.  దీని గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కాని నాకు ఈ మధ్యే తెలిసింది.

గేటు దగ్గరనుండి లోపలికి వెళ్లటానికి ఫారెస్టు డిపార్టుమెంటు వాళ్ల జీపులు ఉంటాయి..మన వెహికిల్సు లోపలికి వెళ్ళటానికి లేదు.  జీపుకి 500 రూపాయలు టిక్కెట్టు..ఇద్దరికయినా ఆరుగురికయినా అంతే. జీపు లెక్క అన్నమాట  జీపు డ్రైవరే గైడ్ కూడా.



ఓ జీపు తీసుకుని బయలుదేరాం.  జీపు డైవరు చాలా జంతువులు కనిపిస్తాయి అని చెప్పాడు మరి చూద్దాం ఏమేమి కనిపిస్తాయో!. మేము జీపు ఎక్కి బయలుదేరుతుండగా ఇంకో కుటుంబం వచ్చింది..వాళ్లూ ముగ్గురే..మాతో కలిసి వస్తామంటే సరే అన్నాం.

 



లోపలికి 11 కి.మి తీసుకెళ్ళి తీసుకొస్తారు.  రోడ్డు బాగానే ఉంది.  లోపల చెంచుల ఇళ్ళు ఉన్నాయి అందుకని  అక్కడక్కడా మనుషులు కనిపిస్తుంటారు.  ఇక మనుషులుండే దగ్గర జంతువులేం ఉంటాయి అనిపించింది..

కొంచం దూరం లోపలికి వెళ్ళగానే ఓ నాలుగు జింకలు రోడ్డుకి అడ్డంగా పరుగెడుతూ కనిపించాయి..పర్లేదు మన అదృష్టం బాగుంటే పులులు కూడా కనిపించవచ్చు అనుకున్నాం.



మధ్య మధ్యలో జంతువులు నీళ్లు తాగటానికి సిమెంటు తొట్లలాంటివి ఉన్నాయి. ఎండాకాలం వాటిల్లో నీళ్లు పోస్తారట.



ఇంకొంచం ముందుకి వెళ్ళాక పెద్ద చెరువు కనపడింది..చాలా పెద్దది.  వర్షపు నీళ్లన్ని ఆ చెరువులోకి వచ్చి కలుస్తాయి అట!  జీపు  చెరువు దాకా వెళ్లలేదు కాబట్టి దూరం నుండే చూసాం.

దార్లో ఎక్కువగా వెదురు చెట్లు,  అడ్డ తీగ (విస్తరాకులు) , టేకు చెట్లు కనిపించాయి.  ఆదీవాసీలు అడ్డాకులు ఏరుకెళ్ళి అమ్ముకుంటారట! ఓ చెట్టు కింద పెద్ద ఆకుల మూట కనపడింది.




 ఇంకేమైనా జంతువులు కనిపిస్తాయేమో అని ఉత్కంఠతతో చూస్తుంటే మరలా జింకలే కనిపించాయి. ఓ బుల్లి జింక పిల్ల చెంగు చెంగున గెంతుతూ పరుగులు తీస్తుంది. దాన్ని చూడగానే ....    ఫెలిక్సు జల్తేన్ రచనకి మహీధర నళినీ మోహన్ గారి అనువాదం "వనసీమలలో" పుస్తకంలోని బేంబీ గుర్తుకొచ్చింది.



అలా కొంచం ముందుకు వెళ్ళగానే ఓ పాడుపడ్డ భవంతి కనపడింది..అది అప్పట్లో నిజాం ప్రభువు కట్టించిందట! ఆయన అక్కడికి విహారానికి..వేటకి వెళ్ళినప్పుడు ఉండేవారట! దాన్ని షికార్‍గర్ అనేవారట!



 దారి పొడుగునా జింకలే కనపడ్డాయి.  ఏంటి రాజూ నాయక్ (డ్రైవర్ పేరు) జింకలు తప్పితే ఇంకేమీ లేనట్టున్నాయే అంటే.. ఎందుకు లేవండి..ఎలుగులు..అడవి పిల్లులు, నెమళ్ళు , నక్కలు ఉన్నాయి కానీ అలికిడికి అవి బయటకు రావు అని ఓ నవ్వు నవ్వాడు. ఎప్పుడయినా పులిని చూసావా అంటే చాలాసార్లు చూసానండి..రాత్రిపూట పెట్రోలింగ్‍కి వెళ్ళినప్పుడు కనపడతాయి అని చెప్పాడు.  ఇప్పుడొకటి కనపడితే బాగుండు అనుకున్నాం.


అలా ముందుకు వెళుతుంటే మరి కొన్ని జింకలు..దుప్పులు కనపడ్డాయి.  వాటికీ మనుషుల..వాహనాల అలికిడి అలవాటైపోయినట్లుంది..బెదరకుండా అలానే చూస్తూ ఉన్నాయి.

చివరికి ఓ ప్రదేశానికి తీసుకెళ్ళి జీపు ఆపేసి ఇక ట్రిప్పు చివరికి వచ్చేసింది..ఇక ఇదే లాస్టు పాయింటండీ అన్నాడు రాజూ నాయక్.  పక్కన ఓ కూలిపోయిన కట్డడం కనిపించింది.  ఇదేంటి అంటే ఇక్కడ అంతకుముందు రెస్టారెంటు ఉండేది..నక్సల్సు పేల్చేసారు అని చెప్పాడు.  హాంగింగు రెస్టారెంటు కూడా ఉండేదట..మొత్తం 12 కాటేజెస్ ఉండేవి..2006-2007 లో అన్నీ పేల్చేసారు అని చెప్పాడు. అసలు అవి కట్టిందే 2004 నట..ప్చ్!!




దిగి చుట్టూ చూసా..కూర్చోవటానికి రెండు బెంచీలు కనిపించాయి..ఇక ఏమీ లేదు అక్కడ...ఇక ఇంతే కాబోలు ఇక సఫారీ అయిపోయింది  అని కాస్త నిరాశ చెందా.

ఇంతలో రాజూ నాయక్ ముందుకి వెళుతూ ఇటురండి మీకొక వ్యూ పాయింటు చూపిస్తా అని కాస్త ముందుకు కొండ అంచుకి వెళ్ళాడు..

కొండ  చివరికి వెళితే ఓ పెద్ద లోయ..కాస్త ముందుకి వెళ్ళి చూస్తే మహాద్భుతం..కింద దట్టమైన లోయ..చాలా లోతులో ఉంది..కాస్త దూరంలో  ఓ చెరువు...ఆ దృశ్యం మహాద్భుతంగా ఉంది..వర్ణించటానికి మాటలు రావంతే. ఫోటోలు చూడండి..అవే మాట్లాడతాయి.



హోరు గాలి..నాలాంటి వాళ్లమయితే జాగ్రత్తగా ఉండకపోతే ఆ గాలికి పడిపోతాం కూడా.  అక్కడ ఎప్పుడూ గాలి అలానే ఉంటుందట. ఎంత బాగుందో!




అసలు ఈ వ్యూ పాయింటు చూడటానికి కొండ అంచున చెక్కతో చక్కగా ఓ ఫ్లాట్‍ఫారం లాంటిది కూడా ఉండేదట! నక్సలైట్లు అది కూడా పేల్చేసారట!




అడవిలో పెద్దగా జంతువులు కనిపించకపోయినా ఆ వ్యూ చూడటానికి అయినా వెళ్లొచ్చు అక్కడికి అనిపించింది నాకు. ఎంతసేపటికీ అక్కడినుండి రాబుద్ది కాలేదు.

మొత్తం ఈ ప్రయాణానికి గంటా పదిహేను నిమిషాలు పట్టింది.

ఆసక్తి ఉన్నవాళ్ళు హైదరాబాదు నుండి వచ్చేటప్పుడు ఫరాహాబాద్ గేటుకి ఓ ఐదారు  కి.మీ ల ముందే గుండం గేటు అని మరో గేటు వస్తుంది..అక్కడనుండి ట్రెక్కింగుకి వెళ్ళవచ్చట!  ఇంకా బాగా లోపలికి వెళితే సలేశ్వరం అనే వాటర్ ఫాల్సు ఉన్నాయట!

ఫరాహాబాద్ నుండి 11 గంటలకి బయలుదేరాం.  అక్కడి నుండి హైదరాబాదు వైపు మరో 40 కి.మీ వస్తే దిండి రిజర్వాయర్..దిండి నది మీద ఈ రిజర్వాయర్ కట్టారు. ఇది కూడా చూడటానికి బాగుంటుంది.



 రిజర్వాయర్ పైకి ఎక్కటానికి చక్కగా మెట్లు ఉన్నాయి..అలా సక్రమంగా ఎక్కితే ఎలా....ఇదుగో ఇలా అడ్డంగా పడి ఎక్కేసాం.



అక్కడ కాసేపు గడిపి హైదరాబాదు బయలుదేరాం.  మధ్యలో కడ్తాల్ దగ్గర సీతాఫలాలు కొనుక్కున్నాం! నాకు దారిలో అక్కడ ఒక్కచోటే సీతాఫలాలు కనిపించాయి.  బాగున్నాయి కూడా!

21 వ్యాఖ్యలు:

Sujata M August 30, 2011 at 11:36 AM  

చాలా బావుంది. కానీ పులులు కనబడ్తాయేమో మీ పోస్టులో అని ఎదురు చూసాను. ప్ప్చ్ .. లేవు. (మీకూ కనబడనందుకు డిసపాయింట్ అయ్యారేమో కదా)

MURALI August 30, 2011 at 12:02 PM  

మేము కూర్గ్‌లో ఇలానే ఒక సఫారీకె వెళ్ళి విసిగిపోయాం. కోతులు, ఏనుగులు, జింకలు కనిపించాయి. ఒక్క పులి కూడా కనిపించలేదు. ఊసరవెల్లి ఒకటి కనిపించింది.

ఆ.సౌమ్య August 30, 2011 at 12:53 PM  

ఓ బావుంది...మొత్తానికి మంచి ప్రయాణం చేసి మనసుకి ఆహ్లాదం కలిగించుకొచ్చారన్నమాట. మేము జిం కోర్బెట్ లో సఫారీకి వెళ్ళు పులి కనిపించక విసిగి వేసారి పులి పంజా గుర్తులకి ఫొటో లు తీసుకొచ్చాం. మిగతా జంతువులు చాలా కనిపించాయి. అయితే అడవి మాత్రం ఓ అద్భుతం. ఆ రంగులు, ఆ చెట్లు...వర్ణనాతీతం.

Sravya V August 30, 2011 at 2:30 PM  

బావుందండి మరీ ముఖ్యం గా ఆ వ్యూ పాయింట్ ,ఈ సారి వెళ్ళినప్పుడు ట్రై చేయాలి !

శ్రీనివాస్ పప్పు August 30, 2011 at 3:38 PM  

హమ్మయ్య క్లిప్పులు తీసేసాములెండి.పులులూ లేవు ఏమీలేవు హుం (కానీ ఆ వ్యూ పాయింట్ మాత్రం కేకంతే ఈ సారి చూడాలి తప్పకుండా)

సిరిసిరిమువ్వ August 30, 2011 at 4:02 PM  

సుజాత గారూ..పులులు కనపడనందుకు ముందు డిసపాయింటు అయ్యాం కానీ ఆ వ్యూ పాయింటు చూసాక అసలు ఆ విషయమే గుర్తుకు రాలేదు..అంత బాగుంది అక్కడ!

మురళి, ముదుమలైలో కూడా ఆంతే..పులి అడుగులు కనిపించాయి కానీ అసలు పులి కనపడలేదు. ముదుమలై గురించి కూడా వ్రాయాలి.

సిరిసిరిమువ్వ August 30, 2011 at 4:05 PM  

సౌమ్యా..అవును జంతువులు కనపడకపోయినా అడవి సౌందర్యం చూస్తే చాలు అనిపిస్తుంది. ముదుమలైలో అయితే పులి కనపడితే బాగుండు అనుకుంటూ గుండెలు చిక్కబట్టుకుని ట్రెక్కింగు చేసాం..ప్చ్ కనపడలేదు..అప్పుడే అక్కడ తిరిగినట్టు తాజా ఆడుగులు మాత్రం కనపడ్డాయి.

సిరిసిరిమువ్వ August 30, 2011 at 4:07 PM  

శ్రావ్యా..అవును చాలా బాగుంది. ఓపిక ఉండి ఇంకా లోపలకి ట్రెక్కింగుకి వెళితే జలపాతం కూడా ఉందట!

పప్పు గారూ, ఆ ప్రదేశం చూసాక పులులు కనపడలేదన్న నిరాశ ఉండదు లేండి.

కమనీయం August 30, 2011 at 5:34 PM  

చిన్నతనంలో దోర్నాలనుంచి శివరాత్రికి శ్రీశైలం మజిలీలు చేస్తూ రెండురోజులకి కాలినడకన చేరుకొన్నాము. ఆ అనుభవమే వేరు.రోడ్డు వేసాక చాలా కాలానికి నంద్యాలనుంచి మహానంది మీదుగా వెళ్ళాము.మూడోసారి హైదెరాబాదు నుంచి కారులో వెళ్ళాము.ఒక్కసారికూడా పులులు కనిపించలేదు .జింకలు ,నక్కలు,అడవిపందులు ,కుందేళ్ళు, కొండచిలవలు ,అడవిదున్నలు,కోతులు ,రకరకాల పక్షులు కనిపించాయి .పులులు,ఎలుగుగొడ్లు మామూలుగా మనిషి సంచారం ఉన్నచోట ,అదీ పగలు కనిపించవు
మీ బ్లాగు ,ఫోటోలు చాలా బాగున్నవి.sancuary గా ప్రకటించారు కాబట్టి మిగిలివున్న అడవి,జంతువులు రక్షింప బడతాయని ఆశిద్దాము.అభినందనలతో,రమణారావు.

Vinay Datta August 30, 2011 at 5:51 PM  

మీ వల్లే ఈ ప్రదేశం గురించి తెలిసింది. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.

మాధురి.

ఇందు August 31, 2011 at 12:35 AM  

వావ్! బాగుంది.నేను చాలాసార్లు అనుకున్నా ఇక్కడికి వెళ్ళాలి అని.కానీ మేము ఎప్పుడు వెళ్ళినా రాత్రి అవుతుంది :( నేను పులి ఏమన్న కనిపించిందేమో మీకు అని ఆశగా చూసా :) పోన్లండీ మంచి వ్యూ కనిపించిందిగా :)

kiran August 31, 2011 at 6:51 PM  

వ్యూ పాయింట్ చాల బాగుందండి..:)

సిరిసిరిమువ్వ August 31, 2011 at 10:51 PM  

కమనీయం గారూ..మీ అనుభవాలు భలే ఉన్నాయండి. రెండురోజులు కాలి నడక చేసి వెళ్లారా! అన్ని రకాల ప్రయాణానుభవాలున్నాయన్నమాట మీకు. అవునండి మనుష సంచారం ఉన్నచోట పులులు కనిపించవు. మీ చిన్నతనంలో మనుష సంచారం..వాహన సంచారం తక్కువ ఉన్నప్పుడే కనిపించలేదంటే ఇప్పుడు అసలే కనిపించవు.

నా బ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలు.

సిరిసిరిమువ్వ August 31, 2011 at 10:53 PM  

మాధురి గారూ ధన్యవాదాలు.

ఇందు:)ఈ సారి తప్పక ఈ ప్రదేశం చూడండి.

కిరణ్ ధన్యవాదాలు.

Hima bindu August 31, 2011 at 11:54 PM  

మీరు చెప్పినట్లే ఫోటోలు చాలా అందంగా మాట్లాడాయి .జర్నీ చాల బాగుందిఇలాటి అందమైన ప్రదేశం వున్నట్లు ఇప్పుడే తెలిసింది .

Venu September 2, 2011 at 10:22 AM  

Can you provide any details of Gundam gate trekking like bookings,contact numbers etc.Thank you

సిరిసిరిమువ్వ September 2, 2011 at 12:20 PM  

వేణు గారూ..మేము అక్కడ ఆగలేదు కాబట్టి పూర్తి వివరాలు తెలియవు..మీరు కింది అడ్రస్సులో ప్రయత్నించండి.

Andhra Pradesh Tourism Development Corporation
Tourism House, Himayatnagar,
Hyderabad

ఫోన్ నం.040-23262152; 23262153
23262154; 23262457

Andhra Pradesh Tourist Information Center
ఫోను నం:040-23450444

APTDC Central Reservation office
Tank Bund Road
ఫోను నం:౦40-2345036; 23450165

కొత్త పాళీ September 6, 2011 at 9:44 PM  

సిసిము గారు, చాలా బావుంది. చక్కని అనుభవం. రంగుటద్దాలకిటికీ పుస్తకం గనక అందుబాటులో ఉంటే అందులో ఖాండవవనం కథ చదవండి ఓ సారి - ఏమన్నా పోలికలు కనిపిస్తాయేమో. :)

Unknown September 19, 2011 at 3:17 PM  

పులులు కనబడ్డాయా మీకు? పోస్ట్ చాలా బావుంది.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP