హైదరాబాదు నుండి శ్రీశైలం దారిలో..ఓ అద్భుతం
ఈ శని ఆదివారాలు శ్రీశైలం వెళ్ళి వచ్చాం. మామూలుగా ఎప్పుడూ ఉదయాన్నే బయలుదేరి వెళ్లి సాయంత్రానికి వచ్చేసేవాళ్లం. ఈ సారి శనివారం సాయంత్రం బయలుదేరి వెళ్ళి ఆ రాత్రికి అక్కడ ఉండి ఆదివారం తిరిగి వచ్చాం.
శనివారం బయలుదేరే ముందు జోరున వాన. ఓ నిమిషం మానేద్దామా అనుకున్నాం..బయలుదేరాక మానుకోవటం ఎందుకులే అని 3:30 కి బయలుదేరాం. అప్పటికి వర్షం కొంచం తగ్గింది. హైదరాబాదు దాటాక పెద్దగా వర్షం లేదు.
బాగా మబ్బులు పట్టి వాతావరణం చాలా బాగుంది. మధ్య మధ్య సన్నటి తుప్పర. ఘాట్ ఎక్కేటప్పటికి చీకటి పడింది. మన్ననూరు దాటాక చిమ్మ చీకటి..ముందు రోడ్డు ఏమీ కనపడటం లేదు. అలానే రేడియం ఇండికేటర్ల వెలుతురులో ప్రయాణం సాగించాం.
ఆ చిమ్మ చీకటిలో రోడ్దు మీద అక్కడక్కడా వరసగా రేడియం ఇండికేటర్ల ఎర్రటి కాంతి చూడటానికి ఎంత బాగుందో!
మధ్యలో ఒకచోట అయితే మేఘాలు ఎంత కిందగా ఉన్నాయంటే..మన ముందే తేలిపోతున్నాయి. అప్పుడే సన్నటి జల్లు.. అ జల్లులో ఈ మేఘాలు..మంచు జల్లు పడుతున్నటే ఉంది చూడటానికి..కాసేపు కాశ్మీరులో ఉన్నామా అనిపించింది.
ఎక్కడ మలుపు ఉందో..ఎక్కడ రోడ్డు వంపు ఉందో తెలియనంత దట్టమైన చీకటి..కారు చాలా జాగ్రత్తగా నడపాల్సి వచ్చింది.
కొంచం రిస్కు ప్రయాణం అయినా బాగుంది. మధ్యలో్ జంతువులు ఏమైనా కనిపిస్తాయేమో అని చూసాం కాని ఏమీ కనపడలేదు.
రాత్రి పూట లైట్ల వెలుతురులో డామ్ వ్యూ కూడా బాగుంది. బాగా వర్షాలు పడుతున్నాయి కదా గేట్లు ఎత్తుతారేమో అని ఆశపడ్డాం కానీ ఎత్తలేదు.
శ్రీశైలం చేరేటప్పటికి 8:30 అయింది. బోలెడన్ని సత్రాలున్నాయి కదా రూము దొరుకుతుందిలే అని ముందుగా రూము బుక్కు చేసుకోకుండా ధీమాగా వెళ్లాం....సత్రంలో రూము దొరకలేదు. దేవస్థానం వాళ్ల రూము దొరికింది..ఛండీశ్వర సదనంలో. A/C రూము కానీ A/C పనిచేయటం లేదు..(పని చేయటం లేదని చెప్పే ఇచ్చారు లేండి కానీ చార్జీలు మాత్రం A/C చార్జీలే:). రూము బాగానే ఉంది. వేడి నీళ్లు కూడా ఉన్నాయి.
రూముకి వెళ్లేటప్పటికి 10 అయింది. ఉదయానికి అభిషేకం టిక్కేట్లు దొరుకుతాయేమో అని ప్రయత్నించాం..దొరకలేదు..కొంతమం
ఉదయం ఐదు గంటలకల్లా గుడికి వెళ్ళాం. వంద రూపాయల టిక్కెట్టు తో దర్శనం త్వరగానే అయిపోయింది. అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడినుండి బయటపడ్డాం.
దర్శనం అవగానే రోప్ వే దగ్గరకి వెళ్ళాం. ఉదయాన్నే కావటాన ఎక్కువమంది జనం లేరు. టిక్కెట్టు 50 రూపాయలు. అక్క మాహాదేవి గుహలు చూడాలంటే రెంటికీ కలిపి ఒకే టిక్కెట్టు తీసుకోవచ్చు..రెండిటికి కలిపి అయితే టిక్కెట్టు 230 రూపాయలు. ఆ అక్క మహాదేవి గుహలు చూద్దాం అనుకున్నాం కాని అక్కడికి పదకొండు గంటలకి కానీ తీసుకు పోరంట (అక్కడికి బోటులో వెళ్ళాలి). పాతాళగంగ నుండి పది కిలోమీటర్ల దూరం అట! అందుకని ఒక్క రోప్ వే కే వెళ్ళాం.
రోప్ వే నుండి కృష్ణమ్మ అందాలు |
కృష్ణమ్మ మిలమిలలు |
కృష్ణమ్మ ఒంపుసొంపులు |
రోప్ వే మరీ ఎక్కువ లేదు...కొంచం దూరమే కాని వ్యూ బాగుంది. రోప్ వే నుండి వచ్చాక అక్కడే గంగా హోటల్ అని ఉంటే అందులో టిఫిన్లు చేసి 8:30 కల్లా శ్రీ శైలం నుండి బయలుదేరాం.
మధ్యలో డామ్ వ్యూ పాయింటు దగ్గర కాసేపు ఆగాం. అక్కడ శ్రీశైలం కట్టినప్పుడు తీసిన కొన్ని ఫోటోలతో ఓ గదిలో ప్రదర్శనలా పెట్టారు..ఆ గది ఇప్పుడు తెరుస్తున్నట్టు లేరు..అంతా దుమ్ము కొట్టుకుని పోయి ఉంది.
డాం వ్యూ పాయింటు దగ్గర కొన్ని ఫోటోలు తీసుకుని 8:30 కల్లా హైదరాబాదు బయలుదేరాం.
మధ్యలో లింగాల గట్టు దగ్గర బోలెడన్ని నున్నటి రాళ్లు (లింగాలు) ..ఓ చోట గుట్టగా ఉంటే పడి ఉంటే ఓ ఐదు రాళ్ళు తెచ్చేసుకున్నా!
ఇక అసలు ప్రయాణం మొదలయింది. అలా చూడకండి..శ్రీ శైలం ప్రయాణం అనుకున్న దగ్గరనుండి నేను చూడాలనుకుంటున్న ఓ ప్రదేశం హైదరాబాదు ..శ్రీశైలం మధ్యలో వస్తుంది. ఆ ప్రదేశం ఎక్కడ మిస్సు అవుతామో అని కళ్లు పత్తికాయల్లా చేసుకుని చూస్తున్నా....అదే ఫరాహాబాద్..
దాని గురించి తరువాతి టపాలో వివరంగా..
అలానే ట్యూన్ అయి ఉండండి....
.
10 వ్యాఖ్యలు:
అన్యాయం అక్రమం :)))
బావుందండి పోస్టు త్వరగా సెకండ్ పార్ట్ రాయండి . మొన్న జనవరి మేము కూడా ఇలా నైట్ రోడ్ చూసి ఇదే అనుకున్నాం , బాగా మైంటైన్ చేస్తున్నారు GMR వాళ్ళు
ఇదన్యాయం....పొద్దున్నుండీ ఊరించి ఊరించి చివరకు చెప్పకుండా ఇలా దాటేస్తారా...దారుణం, ఘోరం!
గేట్ల దగ్గర ఎరుపు, నీలం లైట్లు బలే ఉన్నాయి.
డామ్ వ్యూ గురించే చెప్తారని అనుకున్నాను. వాటర్ ఫుల్ గా ఉంది కదా..వ్యూ బాగుంటుంది.
interesting!waiting....
లాస్ట్ మూడు ఫోటోలూ, రోప్ వే ఫోటోలూ నాకు బాగా నచ్చాయండీ.. తరువాతి పోస్ట్ కోసం వెయింటీంగ్ ;)
వరూధినిగారూ అంతా బాగుంది కానీ ఇలా మధ్యలో ఆపేయటమే బాలేదు.
అదేంటండీ అలా ఆపేశారు. త్వరగా రాయండి.
రోప్ వే ట్రైల్స్ లోనే (అంటే నిర్మిస్తున్నప్పుడే) accounts ఆడిట్ పని మీద వెళ్లి, పాతాళగంగ వరకు వెళ్లి అక్కడి నుంచి టైటానిక్ లాంటి బోటు లో అక్కమాంబ కేవ్స్(గుహలు) వరకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు రోప్ వే మద్యలో పది నిమిషాలు ఆగిపోయి రోప్ కొండల మద్యలో తాడుకు వేలాడుతూ,గుండె ఒక్కసారి ఆగి పోయిన అనుభూతి కలిగి క్షేమంగా పైకి చేరాను...అప్పుడు అనుకొన్నా..మన చేతిలో ఎంత అధికారం ఉన్నా..ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు అని ..(రోప్ వే నిర్మిస్తున్న వాళ్ళను అధికార దర్పం తో శాసించాను రోప్ వే లో పాతాలగంగా కు తీసుకువెళ్ళమని,వాళ్ళు ప్రస్తుతం ట్రైల్స్ వేస్తున్నాం ..అంత సేఫ్ కాదని చెప్పినప్పటికీ...)
మువ్వగారూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు :) మీరు ఇలా ఊరించడం ఏం బాలేదు మరి. పుట్టినరోజుకదా! ఏమి అనకుండా వెల్లిపోతున్నా! తొందర రెండో పార్టు వేసేయండీ. అసలే నాకు శ్రీశైలం అంటే ఎంత ఇష్టమో! :)
శ్రావ్యా, సౌమ్యా, ఎక్కువేం ఊరించలేదు కదా!.
తృష్ణ గారూ, అవునండి డాం నిండా నీళ్లతో బాగుంది. పైన ఇంకొక్క పెద్ద వర్షం పడితే గేట్లు ఎత్తవచ్చు.
చిన్ని గారు, రాజ్‍కుమార్ గారూ, మురళి గారూ టపా పెట్టేసాను చూడండి.
తొలకరి గారూ, వ్రాసానండి..చూడండి.
రక్తచరిత్ర గారూ, తృటిలో అపాయం తప్పిచుకున్నారన్నమాట! మీ అనుభవాలు ఇలాంటివి మీ బ్లాగులో అందరితో పంచుకుంటే బాగుంటుది.
ఇందు, ధన్యవాదాలు...పుట్టినరోజు శుభాకాంక్షలకు మరియు ఏమీ అనకుండా వెళ్ళిపోయినందుకు:)
Post a Comment