పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

August 16, 2011

పాలగుమ్మి... మా ఊరు ఒక్కసారి పోయి రావాలి

అప్పుడెప్పుడో మా ఊరి గురించి వ్రాసుకుంటూ పాలగుమ్మి విశ్వనాథం గారు పాడిన.. మా ఊరు ఒక్కసారి పోయి రావాలి ....పాట గుర్తుచేసుకున్నా. ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం వ్రాసిన పాట..అప్పటికి ..ఇప్పటికీ ..ఎప్పటికీ నిత్యనూతనం ఈ పాట.

ఈ మధ్య అదే పాట పదాలు కాస్త మార్చి కొత్త.చరణాలు కలిపి మల్లేష్ అనే అతను పాడింది విన్నా.  శ్రీ నిలయం అనే ఆల్బంలో ఉంది ఈ పాట (ఆల్బం మీద అయితే వ్రాసింది పాలగుమ్మి గారనే ఉంది).

ఈ పాటకి.... పాలగుమ్మి గారు పాడిన పాటకి భావంలో తేడా లేకపోయినా పాలగుమ్మి గారి గొంతులోని ఆర్తి ఇందులో నాకు కనపడలేదు. పాటలో  హైలెస్సో..గౌరమ్మ .... బతుకమ్మ....మరి కొన్ని తెలంగాణా పదాలు  చేర్చి తెలంగాణైజేషన్ చేసారు.  ఇప్పటి అభిరుచులకు తగ్గట్టు నేపద్య సంగీతం పెట్టారు..అయినా ఏదో లోటు.

పాట మంచి హుషారుగా బాగుంది కానీ పాలగుమ్మి గారి పాట వింటుంటే మన ఊరు మన కళ్ల ముందు మెదులుతుంది.  ఊర్లో కోవెల...పంట చేలు..పైర గాలి...దూరమైన మన నేస్తాలు గుర్తుకొచ్చి.....జ్ఞాపకాల బరువుతో  కళ్లు చెమ్మగిల్లుతాయి. మల్లేష్ గారి పాట ఇంతగా గుండెల్ని తట్టదు.  ఓ హుషారయిన పాట వింటున్నట్టుంటుంది.. లేచి చిందేయ్యాలనిపిస్తుంది... కానీ  జ్ఞాపకాల  అనుభూతుల్ని తడమదు.

దాదాపు అవే పదాలు..అదే భావం...కానీ ఎందుకని పాలగుమ్మి గారి పాటకి స్పందించినంతగా మల్లేష్ పాటకి స్పందించలేకపోతున్నాం ..పాలగుమ్మి గారి గొంతులోని ఆర్తి..మనల్ని కదిలిస్తుంది.  ముఖ్యంగా "ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి"...  పాడేటప్పుడు ఆ గొంతులో ఎంత భావం పలికిస్తాడో!

ముందుగా పాలగుమ్మి గారి పాట వినకుండా మల్లేష్ గారి పాట వింటే బాగానే ఆనందించగలమేమో.

ఘజల్ శ్రీనివాస్ గారు కూడా  ఇదే భావంతో ఇంచుమించు ఇలాంటి మాటలతోనే ఒక పాట వ్రాసారు..ఒక్కసారి ఊరు పోయిరా ...అంటూ.  అది కూడా బాగుంటుంది. ఘజల్ కదా భావుకత పాలు కాస్త ఎక్కువగా ఉంటుంది.

మూడిటిలోనూ నాకు పాలగుమ్మి గారిదే ఇష్టం.

మూడిటి సాహిత్యం ఇస్తున్నాను..మీరే చూడండి.

మొదటిది పాలగుమ్మి గారు వ్రాసి ..స్వరపరచి... పాడినది.



పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..
పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి..

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి..

ఒయ్యారి నడకలతో ఆ ఏరు..
ఆ ఏరు దాటితే మా ఊరు..
ఒయ్యారి నడకలతో ఆ ఏరు..
ఆ ఏరు దాటితే మా ఊరు..

ఊరి మధ్య కోవెలా.. కోనేరు..
ఒకసారి చూస్తిరా తిరిగి పోలేరు..
ఊరి మధ్య కోవెలా.. కోనేరు..
ఒకసారి చూస్తిరా వదిలి పోలేరు..

పంట చేల గట్ల మీద తిరగాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి..

పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి...
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి...
పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి...
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి...

ఏరు దాటి తోట.. తోపు తిరగాలి...
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి...
ఏరు దాటి తోట ..తోపు తిరగాలి...
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి...

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..

చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి...
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి...
చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి...
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి...

ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి...
ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి...
ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి...
ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి...

పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి.
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..

*******************************************************************

ఇక రెండవది..శ్రీనిలయం ఆల్బం లో మల్లేష్ గారు పాడింది. దీని ఆడియో సరిగ్గా లేదు...మధ్య మధ్యలో కట్ అవుతుంది.



పంట సేల గట్ల మీద నడవాలి
ఊహలకు రెక్కలొచ్చి ఎగరాలి
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

ఒహో..ఒహో...

ఒయ్యారి నడకలతో సెలఏరు,
ఆ ఏరు దాటితేనే మా ఊరు!
ఒయ్యారి నడకలతో సెలఏరు,
ఆ ఏరు దాటితేనే మా ఊరు!

ఊరి మధ్య కోవెలా....కోనేరూ
ఒక్కసారి చూస్తిరా ...తిరిగి రాలేరు

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

ఓ..ఓ..ఓహో..ఒహో..
హైలెస్స..ఓ..ఓ..హైలెస్సా..
ఓహో..ఓహో...హైలెస్స...ఓ ..ఓఓఓఓ

చిన్ననాటి స్నేహాలు చుట్టూ చేరాలి
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి
చిన్ననాటి స్నేహాలు చుట్టూ చేరాలి
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి
ఒకరికొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి
ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల
బంగారు బ్రతుకమ్మ ఉయ్యాల
మన గౌరి గౌరమ్మ ఉయ్యాల
మా ఊరి వెలుగంట ఉయ్యాలో

మా ఊరి పక్కనే చెరువుంది
ఆ చెరువు గట్టు మీద రెండు చెట్లున్నాయి
మా ఊరి పక్కనే చెరువుంది
ఆ చెరువు గట్టు మీద రెండు చెట్లున్నాయి
చెట్లకింద బ్రతుకమ్మలాట చూడాలి
పక్కనున్న పైరు చూసి పరవశించాలి

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

గోవుల్ని కాసేటి గోవిళ్లు అందంబు
ఆ గోవిళ్లు పాడేటి పాటలందంబు
సందెవేళ చప్పట్ల కోలాటాలందంబు
ఆడుతూ ఊగే వంగుటుయ్యాల అందంబు

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి
ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

పాట అంతా దాదాపుగా ఒక్కటిగానే ఉన్నా చివరి రెండు చరణాలు చూడండి..అవి పాలగుమ్మి గారు పాడిన దాంట్లో ఉండవు.

************************************************************************

ఇక మూడవది ఘజల్ శ్రీనివాస్ గారిది.


Get this widget | Track details | eSnips Social DNA


ఏరా రాముడూ ఊడుపులైపోయినియేంట్రా
లేదురా రేపో మాపో మొదలెడతాను
సరే సాయంత్రం సావిడికాడికొచ్చెయ్
అక్కడ కబుర్లు సెప్పుకుందాం
అలాగే  తుర్ర్.. హై హై హై

ఒక్కసారి ఊరు పోయిరా
ఒక్కసారి ఊరు పోయిరా
బతికిన పల్లెలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా
అనుభూతుల మల్లెల కోసం
ఒక్కసారి ఊరు పోయిరా
బతికిన పల్లెలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా
అనుభూతుల మల్లెల కోసం

సంక్రాంతి ముగ్గుల్లు.... గొబ్బిళ్ళో
మాలక్ష్మి దీవించు గొబ్బిళ్ళో
మాలక్ష్మి దీవించు గొబ్బిళ్ళో
మా ఊరికివ్వాలి పంటల్లు

ముద్దొచ్చే అమ్మాయిలు దిద్దే ముగ్గుల గీతలు
ముద్దొచ్చే అమ్మాయిలు.. హాయ్.. దిద్దే ముగ్గుల గీతలు
 ఒక్కసారి ఊరు పోయిరా
ఒక్కసారి ఊరు పోయిరా
పడుచుల జడ గంటలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా..

అందరినీ పలకరించూ...కథలెన్నో వినిపించూ
ఏరా రాముడూ ఈ మద్య కనిపించట్లేదేమిట్రా
అందరినీ పలకరించూ...కథలెన్నో వినిపించూ
ఒక్కసారి ఊరు పోయిరా
ఒక్కసారి ఊరు పోయిరా
ముసలి అవ్వలకొసం
ఒక్కసారి ఊరు పోయిరా

చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు...
రామ నవమి పందిరిలో...నాటకాల సందడిలో
బావా ఎప్పుడు వచ్చితీవు..
రామ నవమి పందిరిలో.... నాటకాల సందడిలో
ఒక్కసారి ఊరు పోయిరా
నాన్నా..
ఒక్కసారి ఊరు పోయిరా
అల్లరి పిల్లలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా

ఏటిగట్టు సరదాలు...పాటమీద పగ్గాలు
ఏరా ఎంకన్నా మేట్నీకొత్తావేంట్రా ఈరోజూ?
ఆ కుదరదురా సాయంత్రం వెంకటలక్ష్మి తోటకి రమ్మందిరా..
ఏటిగట్టు సరదాలు...పాటమీద పగ్గాలు
ఒక్కసారి ఊరు పోయిరా
మిత్రమా..ఒక్కసారి ఊరు పోయిరా
చిననాటి మనసుల కోసం
ఒక్కసారి ఊరు పోయిరా

తాననన్న తాననన్న తాననన్న హో..
తననానన తననానన

పల్లెటూరి పిల్లకదా.....పట్నం రాలేదు కదా.
ఓ హొహొ హొహొ ఓ హొహొహొహొ హొయ్
పల్లెటూరి పిల్లకదా.....పట్నం రాలేదు కదా.
ఒక్కసారి ఊరు పోయిరా
ఒక్కసారి ఊరు పోయిరా
కురిసే వెన్నెల కోసం

ఒక్కసారి ఊరు పోయిరా
బతికిన పల్లెలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా
అనుభూతుల మల్లెలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా
బతికిన పల్లెలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా
అనుభూతుల మల్లెలకోసం
ఆ ఏరులకోసం... ఆ నవ్వులకోసం
ఆ కోవెలకోసం... ఆ పొలాల కోసం
ఆ సిగ్గులకోసం... చలిమంటలకోసం
ఆ పంటలకోసం.... ఆ వెన్నెలకోసం..

దీని వీడియో కావాలంటే ఇక్కడ చూడవచ్చు. పాట ఉన్నంత అందంగా వీడియో లేదు అనిపించింది!

ఈ టపా ప్రత్యేకంగా  వేణూ శ్రీకాంత్ కి.

**************************************************************

మీరు పాట వింటూ ఈ టపా చదవవచ్చు.  వద్దనుకుంటే  శ్రీనిలయం ఆడియో క్లిప్ ని ఆపేసెయ్యండి:)

Read more...

August 13, 2011

శ్రావణ పౌర్ణమికి మా ఇంట ఉదయించిన చందమామ

మా ఇంటి జాబిల్లి

సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం.... ఓ శ్రావణ పౌర్ణమి రోజు..

అమ్మాయా..అబ్బాయా అని అందరం ఆతృతగా ఎదురు చూస్తుండగా... రాత్రి 8:35 కి ---- ఆకాశంలోని పున్నమి చంద్రుడితో పోటీ పడుతూ...మా ఇంటి చందమామ ఈ లోకంలోకి అడుగు పెట్టింది.

చిన్న చిన్న కాళ్ళు...చిన్న చిన్న చేతులు..నాలో ప్రాణం పోసుకున్న మరో ప్రాణిని ...మొదటిసారి ఒళ్ళోకి తీసుకున్న ఆ క్షణం..అంతకన్నా మధుర క్షణం... ఈ జీవితంలో మరొకటి ఉండదేమో!  ఆ నులివెచ్చని మొదటి స్పర్శ...కొత్తగా ..వింతగా...ఇప్పటికీ అదొక మధురానుభూతి.

అక్కడి నుండి తనతో గడిపిన ప్రతి క్షణం అపురూపమే. తొలి అడుగు..తొలి మాట..తొలి పాట... తన ప్రతి కదలికని..తన ఎదుగుదలని అక్షరబద్దం..చిత్రబద్దం.. చేసి పెట్టుకున్నాం.

చుట్టుపక్కల నాలుగిళ్ళకి తనే పసిపిల్ల..అందరి గారాబం..ఇల్లేరమ్మలా లేచింది మొదలు ఇళ్లమ్మట తిరుగుతుండేది..

గోరింటాకు పెట్టి చేతులు రెండూ సాక్సుల్లో కట్టేసామని ఓ అర్థరాత్రి లేచి ఏడ్చిన ఏడుపుకి లైనులో అందరూ లేచి వచ్చి ఊరడించిన చిత్రం...

నాన్న ముక్కుని పట్టుకుని కసుక్కున కొరికిన చందం..

మొదటిసారి పలక మీద అ..ఆ..లు దిద్దమంటే నేను దిద్దనని మొండికేసిన వైనం...

స్కూలుకి వెళ్ళనని చేసిన  మారాం...

స్కూలులో టీచర్ టేబులెక్కి అక్కడే కూర్చుంటానని  చేసిన అల్లరి..

ఒకటా రెండా..ఎన్నెన్ని అనుభూతులు...

అందుకే శ్రావణ పౌర్ణమి అంటే నాకు రాఖీ పండగ అని కన్నా మా అమ్మాయి పుట్టిన రోజుగానే ఎక్కువ గుర్తు ఉంటుంది.

రాఖీ పండగకి ..రాఖీలు కట్టటం మాకు అలవాటు లేదు.  చిన్నప్పుడు అసలు ఇలా ఓ పండగ చేసుకుంటారని కూడా తెలియదు.

మా పిల్లలు వచ్చాక మాత్రం మా అమ్మాయి స్నేహితులని చూసి తనూ సరదాగా వాళ్ళ తమ్ముడికి కట్టటం మొదలుపెట్టింది. వాడికీ ఇలాంటివి అంత నచ్చవు.. బలవంతాన కట్టేది. మంచం మీదనుండి లేవటానికే కూడా బద్దకించేవాడు..ఇలాగే కట్టు అని చెయ్యి ఇచ్చేవాడు.  పాచి మొహానే కట్టించుకునేవాడు అన్నమాట.  కట్టాక ఓ అరగంట కూడా ఉంచుకునేవాడు కాదు..తీసి పడేసేవాడు.  బాగా చిన్నప్పుడు ఇలా రాఖీ కట్టించుకున్నాక అక్కకి ఏమైనా గిఫ్టు ఇవ్వాలి ఇవ్వు అంటే ఏంటి ఇచ్చేది అనేవాడు. పోనీలే ఇవాళ అక్క పుట్టిన రోజు కూడా కదా ఇవ్వు అంటే ఇచ్చేవాడు.

ఇప్పుడు దూరాన ఉన్నాడు కదా..మా అమ్మాయికి ప్రేమాప్యాయతలు ఇంకా పెరిగిపోయాయి.  ఓ మంచి కార్డు తనే స్వయంగా  తయారు చేసి రాఖీతో పాటు పంపింది. వాడసలు దాన్ని  తెరిచి చూస్తాడో లేదో కూడా నాకు అనుమానమే!

Read more...

August 8, 2011

ఆధార్ కార్డు నాకు నచ్చలేదు!

ఎన్నాళ్లనుండో ఎదురు చూస్తున్న ఆధార్ కార్డు మొన్ననే వచ్చింది. ఈ కార్డు రావటానికి మేము ఫోటోలు తీయించుకున్నాక ఖచ్చితంగా మూడు నెలలు పట్టింది.  ఇప్పుడు కూడా మా ఇంట్లో మా నలుగురిలోనూ ఇద్దరివే వచ్చాయి..మిగత ఇద్దరివి..నెట్టులో చూస్తే ఇంకా వివరాలు అందలేదు అని వస్తుంది. సరే ఎప్పటికో అప్పటికి అవి కూడా వస్తాయి కానీ అసలు నాకు ముందు కార్డు రూపురే్ఖలు నచ్చలేదు.

ఆధార్...సామాన్యుని హక్కు

కాప్షన్ బాగుంది కానీ...ఇకపై ఉప్పు కావాలన్నా..పప్పు కావాలన్నా..గాస్ కావాలన్నా..బ్యాంక్ అకౌంటు తెరవాలన్నా...  అన్ని నిత్యావసరాలకి ...దేనికయినా ఆధారం ఇదే...మీరు మీరే అనటానికి ఇకనుండి ఋజు పత్రం (identity proof) ఇదే అంటున్న ఈ కార్డు రూపురేఖలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఏదో కరపత్రం లాగా ఉంది కానీ కార్డు లాగా లేదు.


నందన్ నీలేకని ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాజెక్టు కనుక దీని గురించి నేను కాస్త ఎక్కువే   ఊహించుకున్నా..కానీ కార్డు చూడగానే నాకు చాలా నిరుత్సాహం కలిగింది.

ఇకపై భారత పౌరుల జీవితాలకి ఆధారం ఇదే అని ప్రభుత్వాలు ఎలుగెత్తి చెప్తున్న ఈ కార్డు చాలా పొడవుగా ఉంది...నాణ్యత కూడా అంతంత మాత్రమే. కాస్త మందపాటి గ్లేజ్‍డు పేపరు వాడారు.  కనీసం లామినేషన్ కూడా లేదు.



కింద పేరు.. ఆధార్ నంబరు వరకు మాత్రమే కార్డుగా ఉన్నట్లయితే బాగుండేది...మరి అక్కడ వరకు కత్తిరించి వాడుకోవచ్చేమో తెలియదు. మిగతా వివరాలన్నీ కార్డు మీద అవసరం లేదు కూడాను.

ఏది ఏమయినా జీవితాంతం మనతో ఉండాల్సిన ఈ కార్డు ఇలా ఉండటం నాకు అసలు నచ్చలేదు. ఈ కార్డు డిజైను చేసింది ఎవరో కానీ ఈ మాత్రం ఆలోచించలేదా అనిపించింది. దీనిని డిజైను చేసిన వాళ్లు, దానికి అనుమతి ఇచ్చిన వాళ్లు..దాన్ని అమలులోకి తీసుకొస్తున్న వాళ్లు..ఇంతమందిలో ఏ ఒక్కరూ కార్డు పోర్టబిలిటి గురించి కానీ దాని మన్నిక గురించి కానీ ఆలోచించినట్లు కనిపించటం లేదు.  ATM కార్డు లానో, క్రెడిట్ కార్డులానో...  ఓటరు కార్డులానో ..రేషను కార్డులానో ఇది కూడా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లటానికి అనువుగా నాణ్యంగా ఉంటే బాగుండేది.

ఓ సంతోషకరమైన విషయం ఏమిటంటే ఓటరు కార్డులో లాగా ఇందులో అచ్చు తప్పులు లేవు.  తెలుగు అక్షరాలు తెలుగు అక్షరాలా లాగానే చక్కగా ఉన్నాయి. పేర్ల తారుమారులు..తలల తారుమారులు...లింగాల తారుమారులు లేవు.  ఫోటోలు తీయించుకునేటప్పుడే పేరు... అడ్రస్సు...అన్నీ జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు సరిచూసుకుని అక్కడ డాటా ఎంట్రీ వాళ్ళకి తెలుగు అక్షరాలు ఎలా వ్రాయాలో క్లాసు పీకాం అనుకోండి:)

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP