పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 30, 2011

మేమిందుకిలా??? పెళ్ళి ఆడపిల్ల జీవితంలో ఎన్ని మార్పులు తీసుకొస్తుందో!

 నేను చెప్పేది ఇప్పటి ఆడపిల్లల గురించి కాదు! మా తరం గురించి!

అప్పటి వరకు హాయిగా స్వేచ్చగా సీతాకోక చిలుకల్లా ఎగిరిన మేము ఒక్కసారిగా ప్యూపా దశలోకి వెళ్ళిపోతాం.

ఇల్లు..భర్త..పిల్లలు..ఇదే లోకం...అదే సర్వస్వం...

ఇల్లే కదా స్వర్గ సీమ అని పాడేసుకుంటూ  ఆ ప్యూపా దశలోనే ఉండిపోతాం.

అందులోనుండి బయట పడాలని కూడా అనుకోము!

ఇల్లు విడిచి ఒక్క రోజు ..ఒక్క గంట బయటకి వెళ్ళాలన్నా ఎన్ని ప్రతిబంధకాలో!

అమ్మాయి కాలేజీ నుండి వచ్చే టైము..అబ్బాయి ఆటలకి వెళ్లే టైము..అయ్య గారు ఆఫీసు నుండి వచ్చే టైము..మామ గారికి ఒంట్లో బాగోకపోవటమో..చుట్టాలు రావటమో..ఇలా ఏదో ఒకటి అడ్డం పడుతూనే ఉంటుంది.

ఇలా అడ్డాలు లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారనుకోండి..కానీ తక్కువ.

ఓ రెండు రోజులు ఊరెళ్ళాలంటే ఎన్ని ముందస్తు ఏర్పాట్లు చేసి వెళ్లాలో..

ఓ వారం ముందు నుండే ఏర్పాట్లు మొదలుపెట్టాలి..

మంచినీళ్ల దగ్గరనుండి. పెరుగు దాకా.అన్నీ రెడీగా పెట్టి వెళ్లాలి.

వెళ్ళాక అయ్యో ఏం ఇబ్బంది పడుతున్నారో అని మనసులో పీకులాటే...

పాలబ్బాయి వచ్చే టైం కి లేచారో లేదో...పనమ్మాయి టైం కి వచ్చిందో లేదో..

టిఫిన్ తిన్నారో ..తినకుండా పరిగెత్తారో..తలుపులు సరిగ్గా వేసారో లేదో...

పనమ్మాయిని బతిమాలుకోవాలి..నేను లేని రెండు రోజులు మానకుండా రా తల్లీ అని..

అదేంటో ఇంత చెప్పినా మనం ఊరెళ్ళిన టైం లోనే ఆ పనిపిల్లకీ ఏవో అర్జంటు పనులో.. జలుబో..జ్వరమో వచ్చేడుస్తాయి!

మనుషులం అక్కడే కాని మనస్సంతా ఇక్కడే ఉంటుంది..

ఇప్పుడంటే ఫోన్లు వచ్చాక అడుగడుక్కి మానిటరింగ్ చేస్తున్నాం కానీ మా పెళ్లయిన కొత్తలో ఫోన్లు అంతగా లేని రోజుల్లో ఉత్తరాలే ఆధారం..

ఇక ఆ ఉత్తరాల నిండా జాగ్రత్తలు..హెచ్చరికలు..ఉపదేశాలు..మాత్రమే ఉండేవి:)

ఇంతా చేసి వెళ్ళిన దగ్గరన్నా ప్రశాంతంగా ఉంటామా అంటే అదీ లేదు!

మంచాల మీద విడిచిన బట్టల కుప్పలు..సింకులో కడగని గిన్నెలు....పొయ్యి మీద మాడిన దోసెలు కళ్ల ముందు నాట్యం చేస్తుంటే ఇంకెక్కడి ప్రశాంతత!

అదే మగాళ్లకి చూడండి ఈ జంజాటాలు ఏమీ ఉండవు..ఎక్కడికంటే అక్కడికి ఝామ్మంటూ వెళ్ళిపోతారు.

ఎవరి అనుమతులూ అక్కర్లేదు..ఏ ముందస్తు ఏర్పాట్లూ చెయ్యక్కర్లేదు!

ఇంటి గురించి ఏ బెంగా..ఆలోచనలూ..ఆందోళనలూ..ఉండవు!

ఇప్పటి వాళ్లయితే మరీనూ..ఆఫీసు నుండి అటు నుండి అటే ఫ్లైట్ ఎక్కేస్తారు!

మరి నిజంగానే మేము లేకపోతే ఇళ్లల్లో జరగదా అంటే శుభ్రంగా జరిగిపోతుంది, మాకే లేనిపోని ఆరాటం.

అందరూ నా మీదే అధారపడ్డారు..నేను లేకపోతే వీళ్లకిక జీవితమే లేదు అన్న ఓ అందమైన భ్రమలో బ్రతుకుతున్నాం!

ఇప్పుడీ సోదంతా ఎందుకంటే....

మా డిగ్రీ. మరియు.పి.జి కాలేజీల వాళ్లం జనవరి ఒకటిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకుందామనుకుని మొదలెట్టాం(ను).

ఆలోచన ఇంకో ఫ్రెండుది..నాది..కానీ తను ఉండేది అమెరికాలో కాబట్టి ఆ బాధ్యతంతా నేనే తలకెత్తుకున్నాను..

అందరి అడ్రస్సులు సంపాదించటం ఓ ఎత్తయితే మా జనాల్ని ఒప్పించటం ఇంకో ఎత్తయింది..

దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం కదా అని అందరూ ఉత్సాహంగా ఎగురుకుంటూ వస్తారనుకుని మొదలెట్టా!

మొదలెట్టాక కాని తెలియలేదు మా వాళ్ల కుటుంబ భక్తి..పతి భక్తి..పిల్లల భక్తి..

జనవరి ఒకటినా అంటూ సాగదీసిన వాళ్లే ఎక్కువ..

జనవరి ఒకటిన నేను మా ఆయనతోనే ఉండాలమ్మా అని ఒయ్యారాలొలకపోసిన వాళ్లూ...

జనవరి ఒకటిన మా అమ్మాయి దగ్గరికి వెళ్ళకపోతే ఇంకేం లేదే బాబూ..నన్ను చంపి పాతరేస్తుంది అని భయపడి పోయిన వాళ్లూ....

జనవరి ఒకటికి మా ఫామిలీస్ అన్నీ కలిసి రిసార్ట్సు కి వెళతాం..కుదరదబ్బా అన్న వాళ్లూ..(వీళ్లు కలుసుకునేది సంవత్సరానికి ఒక్కసారి జనవరి ఒకటిన మాత్రమే అట..అందరూ మళ్ళీ ఉండేది హైదరాబాదులోనే)!

హైదరాబాదులోనా..మాకు దూరం కదా.వచ్చి వెళ్ళాటానికి కనీసం మూడు రోజులన్నా కావాలి..నేను లేకపోతే మా ఇంట్లో మూడు నిమిషాలు కూడా జరగదమ్మా అని దీర్ఘాలు తీసిన వాళ్లూ..

జనవరి ఒకటి... ప్రోటోకోల్ ప్రకారం మంత్రుల్ని..కలక్టర్లని..ఎమ్మేలేలని కలవాలి కుదరదు అని ఖరాఖండిగా చెప్పిన ప్రభుత్వంలోని పెద్ద ఉద్యోగులు..

మా ఆయన జనవరి ఒకటికి ఎక్కడికన్నా వెళదామంటున్నారు... ఇప్పుడు నేను రానంటే ఆయన చిన్నబుచ్చుకుంటారు ..రానులే అన్నవాళ్ళూ..

మా అత్త గారికి ఆరోగ్యం అంత బాగుండటం లేదు..నీకు తెలుసుగా ఆవిడ్ని మేమే చూసుకోవాలి---ఈ సారికి కుదరుదులే ఏమీ అనుకోకు (ఇదేదో మా ఇంట్లో ఫంక్షన్ అయినట్టు) అని దీర్ఘాలు తీసిన వాళ్లూ..

మా ఆడపడుచు గారమ్మాయి పెళ్ళి కుదిరిందిరా..ఆ షాపింగు పనులతో బిజీగా ఉన్నా..ఇంకో సారి పెట్టినప్పుడు వస్తాలే అన్నవాళ్లూ..

అయ్యో అదే సమయానికి మా ఆయన వాళ్ల స్కూలు వంద సంవత్సరాల వేడుక..తను ఇండియా వస్తున్నారు కాబట్టి నేను రాలేను అన్నవాళ్లు..

చచ్చీ చెడీ..దేశాలన్నీ గాలించి..నెట్టులో జల్లెడ పట్టి...వాళ్లనీ వీళ్లనీ అడుక్కుని...ఓ అరవై మందివి అడ్రస్సులు  ఫోను నంబర్లు సంపాదించి అందరిని కాంటాక్టు చేసి ఎంతో ఉత్సాహంగా మొదలుపెడితే ...

ఈ కారణాలు విని  దిమ్మ తిరిగి...నా ఉత్సాహమంతా చప్పగా నీరు కారిపోయింది..

ఈ కారణాలన్నీ చూడండి..అన్నీ కుటుంబం చుట్టూ తిరిగేవే!

ఎందుకు ఇంతలా మమ్ముల్ని మేము ఈ కుటుంబ బంధాల్లో కట్టి పడేసుకుంటున్నాం?

నచ్చిన సినిమాకి తీసుకెళ్లలేదనో..తను కోరుకున్నంత మోడ్రన్ గా భర్త లేడనో..

అత్త గారితో ఓ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడరనో..అమెరికా వెళ్ళొద్దంటున్నారనో..

ఎడాపెడా విడాకులిచ్చేస్తున్న ఈ రోజుల్లో మేమిందుకిలా ఉన్నాం?

మాకంటూ కాస్త సమయాన్ని ఎందుకు కల్పించుకోలేక పోతున్నాం?

నిజంగా పైన చెప్పినవన్నీ రాలేనంత కారణాలా?

నిజానికి కుటుంబంలో ఇలాంటి వాటికి వెళ్తామంటే వద్దనే వాళ్లు కూడా ఎవరూ ఉండరు..

మేమే అలా అలవాటు పడిపోయాం...మా చుట్టూ మేమే ఓ గిరి గీసుకున్నాం..

అది దాటి బయటకు రావటానికి ఇష్టపడం..రావటానికి ప్రయత్నమూ చెయ్యం..

ఈ ప్యూపా బతుకులే మాకిష్టం!

***********************************************************************************

సరే జనవరి ఒకటని అభ్యంతరాలు చెప్తున్నారు కదా అని కార్యక్రమం జనవరి రెండుకి మార్చినా మరలా ఏవో కారణాలు రాలేకపోతున్నందుకు..

చివరికి ఓ పాతిక మంది తేలారు వచ్చేవాళ్లు..

మేమెందుకిలా???

ఈ ప్యూపా దశ నుండి బయటపడి మళ్లీ సీతాకోక చిలుకల్లా హాయిగా ..స్వేచ్చగా ఎప్పుడు ఎగురుతామో!

14 వ్యాఖ్యలు:

lalithag December 30, 2011 at 6:52 AM  

నేనెప్పుడో వ్రాసుకున్నాను, నా తోటివారిలో కొనమంది ప్యూపా దశనుంచి సీతాకోక చిలుకలుగా మారడం గమనిస్తున్నాను అని. అది గుర్తుకు వచ్చింది మీ ఈ టపా చూస్తే. రెక్కలన్నీ ముడుచుకుని తమ చుట్టూ ఉన్న చిన్ని ప్రపంచంలోనే రోజులు గడిచిపోతుంటే కాలంతో పాటు పరిగెత్తకపోయినా ఒక దశలో కాస్తైనా రెక్కలు చాచే ప్రయత్నం చేస్తున్న వారిని కొందరిని చూశాక అనిపించిన భావం అది. ఐతే ఒక స్నేహితురాలితో ఈ మాట అంటే "నేను గొంగళీపురుగులా ఎప్పుడూ ఉన్నాను?" అని అంది :) గొంగళీపురుగు దశ ఏమో కానీ పెళ్ళయ్యి కొన్నేళ్ళు ఇంకేవీ ఆలోచించకుండా ఆ కుటుంబ వ్యవస్థలో నిలదొక్కుకునే ప్రయత్నంలో తమ అస్తిత్వం గురించి ఉదయించే ప్రశ్నలతో పోరాడి చివరకు ఎవరికి వారే వారు అనుకున్న పరిధిలోనో, లేక తెలుసుకుని పెంచుకున్న పరిధిలోనో రెక్కలు చాపి ఎగిరే ప్రయత్నం చేసే దశలో కనిపిస్తున్నారు నా చుట్టు ప్రక్కల. వారిని చూస్తుంటే సంతోషంగా ఉంటుంది.

sunita December 30, 2011 at 8:16 AM  

అలోచించీ చించీ అరెకరం పోయింది మువ్వగారూ? అఫ్కోర్స్ ఆలోచించని వాళ్ళకూ పోయిందనుకోండి:((((

రాజ్ కుమార్ December 30, 2011 at 8:51 AM  

హ్మ్మ్... ;(

పోనీలెండి కనీసం వాళ్ళయినా వస్తున్నారు కదా.. హేవ్ అ నైస్ టైం.

నూతన సంవత్సర శుభాకాంక్షలండి.

sarma December 30, 2011 at 10:02 AM  

మొదలెట్టిన వాళ్ళకే తలనెప్పి. నిజంగా కుటుంబానికి స్త్రీ యే ఆధారం. kingpin

బులుసు సుబ్రహ్మణ్యం December 30, 2011 at 10:22 AM  

శుభం. మంచిప్రయత్నం. 60 లో పాతిక అంటే ఎక్కువ మంది వస్తున్నట్టే లెఖ్ఖ. మీ సమావేశం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను.

రెండు రోజులు ముందుగా
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శశి కళ December 30, 2011 at 11:23 AM  

అవును మీరు చెప్పిన్ది నిజమ్...మనం పునరాలొచన
చెసుకొవాలి

Maitri December 30, 2011 at 1:34 PM  

అవన్నీ మన ఆరాటమే కానీ వరూధినిగారూ మనం బయటకి వెళ్తే ఏవో చిన్న చిన్న అవసరాలకి మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ వాళ్ళకీ ఆటవిడుపుగానే ఉంటుందేమో ఆలోచించేరా?
"హమ్మయ్యా ఇవాళ్ళ ఇది చేయక్కరలేదు అది తప్పించుకోవచ్చు అమ్మ ఇంట్లో లేడు కదా ఏం పరవాలేదు" అని మన పిల్లలు( భర్తలు కూడా సాధింపు తప్పిందనుకుంటారేమో మరి) అనుకునే అవకాశం కూడా ఉందేమో ఆలోచించండి.

మాలా కుమార్ December 30, 2011 at 3:11 PM  

నీ కోడి కూయకపోతే మాకు తెల్లవారదా వెళ్ళు అంటారు మావారు . కాని మీరనంట్లే వుంటుంది నా పరిస్తితి :)
మీ సమావేశం హాపీగా జరగాలని కోరుకుంటున్నాను . ఎంజాయ్ .
నూతన సంవత్సర శుభాకాంక్షలు .

జ్యోతి December 30, 2011 at 3:48 PM  

వరూధినిగారు మీరు చెప్పినట్టు ఆలోచిస్తే కోపం వస్తుంది. ఒక్కరోజైనా మనకు లీవ్ లేదా అని. బయటకు వెళ్లాలంటే ఇంట్లో మనం లేని లోటు తెలీకుండా అన్నీ చేసి వెళ్లాలి. మనకే డబల్ వర్క్..
మీరు ఐదుగురు వచ్చినా మీటింగ్ పెట్టుకోండి. ఎంజాయ్ చేయండి. అభినందనలు..

buddhamurali December 30, 2011 at 6:41 PM  

బులుసు గారు చెప్పినట్టు 60 లో 25 అంటే ఎక్కువేనండి . ముందు ప్రయత్నం మొదలు పెట్టారు . మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ( మీ కు పోటీ కాదు కానీ మగవారి జీవితం కూడా అంతగా జెలసి పడేంత గా ఎమీ ఉండదండి పీత కష్టాలు పీతవి )

Kottapali December 30, 2011 at 7:38 PM  

Very true. You're brought out the core issue in your usual delicate style. ఇల్లలౌకుతూ తన పేరు మరిచిపోయిన ఈగ కథే!
మళ్ళీ మీరందరూ సీతాకోకచిలుకల్లా ఎగరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ..

Chandu S December 31, 2011 at 7:40 AM  

చాలా బాగా వ్రాశారండీ. ( ఇది చిన్న మాటే)
All the best and have nice time.

జయ January 1, 2012 at 9:44 PM  

సిరిసిరిమువ్వ గారు మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Disp Name January 1, 2012 at 10:31 PM  

సరిగమల వరూధిని గారికి,

వరూధిని కాని జిలేబి అందించు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఏమిటోనండీ, మా కాలం లో ఈ సీతాకోక చిలుక, ప్యూపా లాంటివి తెలియక బతికేసాం మా మానాన. ఈ కాలం వారికి ఎన్ని తంటాలో ఈ ఫాస్ట్ వరల్డ్ లో ! అంతా లక్ష్మీ మాయ !

చీర్స్
జిలేబి.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP