తెలుగులో పిల్లలు చదవదగ్గ పుస్తకాలు
ఏం చదవాలి?
అదే ఇంగ్లీషులో చూడండి పుంఖానుపుంఖానులుగా పుస్తకాలు వుంటాయి, అక్కడ ఏం తీసుకోవాలో అర్థం కాదు, ఇక్కడ తీసుకోవటానికి ఏమీ దొరకవు అన్నట్టు వుంటుంది పరిస్థితి. మొన్నటి హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో మా పిల్లలని ఈ సారి పుస్తకాలు మీరే వెతుక్కుని కొనుక్కోండి అని వదిలేస్తే అన్నీ ఇంగ్లీషు పుస్తకాలే కొనుక్కొచ్చారు, ఇదేంటర్రా అంటే మరి మాకు తెలుగులో ఏం కనపడలేదు అన్నారు. మేము ఇంగ్లీషు పుస్తకాలు పెద్దగా చదివిందీ లేదు వాళ్లకి చెప్పిందీ లేదు మరి వాళ్లకి ఇంగ్లీషువి దొరికినప్పుడు తెలుగువి ఎందుకు దొరకలేదు? తెలుగులో ఈ వయస్సు పిల్లలని దృష్టిలో పెట్టుకుని అసలు పుస్తకాలు వస్తున్నాయా? రాకపోతే ఎందుకు రావటం లేదు?
ఇక మొన్న ఏం దొరకక యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల తీసుకున్నాను. ఇంటికి వచ్చాక మా అమ్మాయి అడిగింది ఏం తెచ్చావు అని, నాకేం కనిపించల అందుకని ఈ పుస్తకం తెచ్చాను అని చూపిస్తే ఇదా అని ఓ చూపు చూసి అవతల పడేసింది. నువ్వు ఆ మధ్య చదివిన చేతన్ భగత్ కంటే చాలా బాగా వ్రాస్తాడు చదువు అన్నా. అసలు మీరు చిన్నప్పుడు ఎలాంటి పుస్తకాలు చదివేవాళ్లు అంది----అవును అప్పుడు ఏం చదివేవాళ్లం?----ఒకసారి గతంలోకి తొంగి చూస్తే......
అప్పుడు కూడా ఈ వయస్సు పిల్లలకంటూ ప్రత్యేకంగా తెలుగు సాహిత్యం ఏమీ వుండేది కాదు. మా ఇంటికి అన్ని వార, మాస పత్రికలు వచ్చేవి. దాదాపు ఆరు ఏడు తరగతుల నుండే ఈ పత్రికలు చదివేవాళ్లం. అందులో వచ్చే సీరియల్సు అన్నీ మా నాన్న చింపి పుస్తకాలు కుట్టేవారు. ఎండాకాలం సెలవులలో అవన్నీ చదవటం మంచి కాలక్షేపంగా వుండేది. అవి కాక మా పక్క ఊరిలో మంచి గ్రంధాలయం వుండేది, అందులో అప్పట్లో వచ్చిన నవలలన్నీ దొరికేవి, మేము హైస్కూలు ఆ ఊరిలొనే చదివాం కాబట్టి స్కూలు నుండి వస్తూ అవి తెచ్చుకునేవాళ్లం. ఇక మా బంధువులకి పుస్తకాలు అద్దెకిచ్చే షాపు ఉండేది, అక్కడ నుండి ప్రముఖుల కొత్త నవలలు, కొమ్మూరి సాంబశివరావు, షాడో మధు బాబుల డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకుని ఎప్పటివప్పుడు చదివేసి తరువాతి పుస్తకం కోసం ఎదురు చూస్తుండేవాళ్లం. కొమ్మూరి సాంబశివరావుది అయితే నెలకొక పుస్తకం విడుదలవుతుండేదని గుర్తు. గిరిజశ్రీ భగవాన్‌వి కూడా బాగానే చదివేవాళ్లం. అప్పట్లో డిటెక్టివ్ నవలలు పెద్దలు పిన్నలు అందరూ విపరీతంగా చదివేవాళ్లు.
యద్దనపూడి, మాదిరెడ్డి, యండమూరి, మల్లాది, చల్లా సుబ్రమణ్యం, చందు సోంబాబు, యర్రంశెట్టి, కొమ్మనాపల్లి, కోగంటి విజయలక్ష్మి, జొన్నలగడ్డ లలితాదేవి, పోలాప్రగడ, వాసిరెడ్డి, తురగా (మోచర్ల) జయశ్యామల, తురగా జానకీరాణి, అరెకపూడి (కోడూరి) కౌసల్యా దేవి (ఈవిడ నవలల పేర్లలో ఎక్కువగా చక్రం వుంటుండేది!), లల్లాదేవి, తోటకూర ఆశాలత, లత, రంగనాయకమ్మ, డి. కామేశ్వరి, బీనా దేవి, రావినూతల సువర్నాకన్నన్, వడ్డెర చండీదాస్......అబ్బో లెక్కలేనంతమంది......అందరి పుస్తకాలు నమిలేసేవాళ్లం. ఇందులో ఎన్ని గుర్తున్నాయి అని మాత్రం అడగకండి! ఏ పుస్తకం కొని చదివిన పాపాన మాత్రం పోలేదు. ఇక ఇప్పుడు పుస్తకాలు అద్దెకిచ్చే షాపులూ లేవు, మా చుట్టాల కొట్టూ లేదు....ఏం చేస్తాం....ఓ పదేళ్ల నుండి పుస్తకాలు కొనే చదువుతున్నాం లేండి!
కథలు, సీరియళ్లే కాదు అప్పట్లో శ్రీశ్రీ ప్రశ్న-జవాబు(ప్రజ), మాలతీచందూర్ ప్రమదావనం, రామలక్ష్మి ప్రశ్నలు-జవాబులు, పురాణం సీత ఇల్లాలి ముచ్చట్లు ఇత్యాదివి చాలా ఆసక్తికరంగా వుండేవి. అచ్చంగా వీటికోసమే పత్రికలు చదివేవాళ్లు వుండేవారు. వారపత్రికలే కాకుండా వనిత, వనితాజ్యోతి, మహిళ, యువ, జ్యోతి లాంటి మాసపత్రికలు కూడా అందుబాటులో వుండేవి. ఏవో ఒకటీ అరా తప్పితే ఈ పత్రికల స్థాయి కూడా బాగుండేది, వాటిమధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ వుండేది. 70-80లలో తెలుగులో రచయిత్రుల హవా బాగా నడిచిందని చెప్పవచ్చు.అందుకే ఆకాలంలో ఆడపేర్లు పెట్టుకుని వ్రాసే మగవారు ఎక్కువగా వుండేవారు.
ఇక అసలు విషయానికి వస్తే అప్పట్లో దొరికింది ఏదైనా చదివేవాళ్లం కాబట్టి పిల్లలకంటూ ప్రత్యేకంగా పుస్తకాలు లేకపోయినా ఆ లోటు తెలియలేదేమో! అప్పటి ఆ పుస్తకాలు ఇప్పటి పిల్లలకి అంత ఆసక్తికరంగా ఎందుకు వుండటం లేదు? వాళ్ల అభిరుచులకు తగ్గట్టు తెలుగులో పుస్తకాలు ఎందుకు రావటం లేదు? నచ్చకపోవటానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి? ఇంగ్లీషు మాధ్యమంలోని చదువుల ప్రభావమా! తెలుగులో పుస్తకాలు చదివే వాళ్లు (పిల్లలు మరియు పెద్దలు) తగ్గిపోవటమా! ఇంగ్లీషు సాహిత్యం ప్రభావమా! టి.వీ.లు, కంప్యూటర్ల మహిమా! తోటి పిల్లల ప్రభావమా! తోటి పిల్లల ప్రభావం అని ఎందుకంటున్నానంటే మేమా పుస్తకం చదివాం ఈ పుస్తకం చదివాం అంటూ పిల్లల మధ్య చర్చలు జరుగుతుంటాయి, అందులో తెలుగు పుస్తకాల గురించి చర్చ వస్తే ఆశ్చర్యపడాల్సిందే. ఒకవేళ ఎవరైనా తెలుగు పుస్తకాలు చదివే పిల్లలు ఉన్నా వాటి గురించి మాట్లాడటం తక్కువతనం అనుకునే రోజులు ఇవి. అసలు ఇప్పుడు ఈ వయస్సు పిల్లలని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా రచనలు చేస్తున్నారా?ఒకవేళ రచనలు చేసేవాళ్లు ఉన్నా చదివేవాళ్లు ఉన్నారా? ఏంటో ఈ టపా అంతా ప్రశ్నలమయమే అనుకుంటున్నారా?
చివరిగా ఇంకొక్కటే ఒక్క ప్రశ్న!అసలు ఈ వయస్సు పిల్లలు చదవతగ్గ పుస్తకాలు తెలుగులో ఏం ఉన్నాయి? తెలిసిన పెద్దలు చెప్పగలరు. చదివే అభిరుచి ఉండాలే కాని ఏవైనా చదవ్వొచ్చు అంటారా!
38 వ్యాఖ్యలు:
ఇప్పుడు దొరుకుతోందో లేదో కాని సహస్రశిరచ్ఛద అపూర్వ చింతామణి ఎలాఉంటుంది
Good one
మంచి చర్చను ప్రారంభించారు.. టీనేజ్ అమ్మాయికి యద్దనపూడి నవలలు ఇవ్వండి. మిమ్మల్ని ఉర్రూతలూగించిన రాజశేఖరం, ఇతర నాయకులు ఆమెకి ఎలా అనిపిస్తారో తెలుసుకోవచ్చు.. 'కన్యాశుల్కం' చదివించారా? 'రూట్స్' తెలుగు అనువాదం 'ఏడు తరాలు' చదివిస్తే ఆఫ్రికా-అమెరికా సంబంధాల గురించి కొంతవరకు అర్ధం చేసుకో గలుగుతారు. సత్యం శంకరమంచి అమరావతి కథలు, ఖదీర్ బాబు పోలేరమ్మ బండ, కథా సంపుటాలు ఇవ్వొచ్చు. కేవలం చదివమని ఊరుకోకుండా ఆ పుస్తకాల గురించి వాళ్ళతో చర్చించండి.. అమ్మ కన్నా మంచి ఫ్రెండ్ ఎవరు ఉంటారు చెప్పండి? వ్యాఖ్య రాయబోయి వ్యాసం రాసేసినట్టు ఉన్నాను:)
@వేణుగోపాల్ గారు, అవును ఈ పుస్తకం కొనాలని నేను కూడా అనుకుంటున్నాను.
@సూర్యుడు గారు, ధన్యవాదాలు. ఆ చేత్తోనే కాస్త పుస్తకాల పేర్లు కూడా సెలవిస్తే బాగుండేది కదా!
@మురళి గారు, యద్దనపూడి రచనలు కొన్ని నాకసలు నచ్చవు, అప్పట్లోనే రాజశేఖరం నన్ను ఉర్రూతలూగించలేకపోయాడు:)మా అమ్మాయికి నచ్చుతాయి అని కూడా అనుకోను. ఏడుతరాలు, ఖదీర్‌బాబు కథలు, అమరావతి కథలు చదివేసిందండి. చర్చలు కాదు కాని తను చదివినవాటి గురించి తనకు తోచిన మాటలు వ్రాసి పెట్టుకోమంటూ వుంటాను.
బారిస్టర్ పార్వతీశం ఎలా ఉంటుందంటారు?
టపా బాగుంది. ఇప్పుడు నెట్లో చందమామ అందుబాటులో ఉన్నది కాబట్టి చదవమనండి . అలాగే మల్లిక్, యర్రంసెట్టి సాయి హాస్య రచనలు కూడా నెట్లో ఉన్నాయి. అలాగే రమణ గారి బుడుగు కూడా. (చదివే ఉండవచ్చు). ఎక్కువుగా పాత తరం నాటి నవలలు, పుస్తకాలు నవోదయ వారి బుక్ షాపుల్లో దొరకటానికి అవకాశం ఉంది.
www.maganti.org, www.teluguone.com, www.bharatadesham.com, www.mallepoolu.com, www.vikasadatri.net www.sailu.com www.teluguworld.com www.telugubooks.tk లో మీకు మీ పిల్లలకి కావాల్సిన రచనలు ఎన్నో ఉన్నాయి. ఈ వెబ్ సైట్లు మీకు తెలిసే ఉండవోచ్చు. అలాగే నాకే తెలియని వెబ్ సైట్లు ఇంకా ఎన్నో ఉండి ఉండవచ్చు. ఎవరికైనా తెలిస్తే ఇక్కడ తెలిపితే అందరకి ఉపయోగంగా ఉంటుంది.
తెలిసిన పెద్దమనిషిని కానుకానీ, ఒక ఉచిత సలహా యిమ్మంటే - రాహుల్ సాంస్కృత్యయాన్ పుస్తకాలకి తెలుగులో వచ్చిన అనువాదాలు యివ్వచ్చు. ముఖ్యంగా, చరిత్రని కథలుగా రాసిన 'ఓల్గా నుంచి గంగా'.
ఏడాది రెండేళ్ళ క్రితం హేరీపాటర్ చివరి పుస్తకం విడుదలైన సందర్భంలో మన బ్లాగుల్లో ఈ విషయమై కొద్దిగా చర్చ జరిగింది. సారాంశం ఏంటంటే పేరెంట్స్ గా మనం మన చిన్నప్పుడూ చదివిన మన రుచులు వాళ్ళకంత రిలవెంత్ గా అనిపించక పోవచ్చు. సహస్ర శిరఛ్ఛేదలూ, మధుబాబు షాడోలూ వాళ్ళకి ఏవిటీ నాన్సెన్స్ అనిపించొచ్చు. కొంచెం సీరియస్ ఫిక్షను చదవాలి అనుకుంటే ప్రతి ఏడూ మంచి కథల సంకలనాలు మూడు వస్తున్నై. ఒకటి కథా సాహితి వారిది, ఒకటి కథా వార్షిక వారిది, మూడోది తెలుగు వివి వారిది. ఉన్నంతలో ఇవి నమ్మదగిన నాణ్యత కలిగున్నాయి. కొంచెం సాంప్రదాయం, క్లాసిక్స్ తెలియాలి అంటే, అనేక పాత తరం రచయితల రచనా సర్వస్వాలని విశాలాంధ్ర సంపుటాలుగా ప్రచురిస్తోంది. యువతకి, ముఖ్యంగా అమ్మాయిలకి వాడ్రేవు వీరలక్ష్మి గారి కాలం సంపుటి ఆకులో ఆకునై, కుప్పిలి పద్మ కాలం సంపుటి శీతవేళ రానీయకు, వోల్గా కథల సంపుటి రాజకీయ కథలు నా సిఫారసు.
@భవాని గారు, అవును బాగుంటుంది, ధన్యవాదాలు.
@క్రిష్ణారావు గారు, ధన్యవాదాలు. సమస్య ఏమిటంటే నాలాగే మా పిల్లలు కూడా పుస్తకం హస్తభూషణం లాగా నెట్టులో చదవటానికి ఇష్టపడరు, అందుకే ఈ తిప్పలు. మీరు చెప్పిన సైటులు బాగున్నాయి. ఇంకా http://kottapalli.in/ బాగుంది. http://manchipustakam.blogspot.com ద్వారా పిల్లల పుస్తకాల గురించి తెలుసుకోవచ్చు.
@రమణ గారు, ధన్యవాదాలు. ఆ పుస్తకం కూడా చదివేసారు!
కొత్తపాళీ గారు, ధన్యవాదాలు. మన చిన్నప్పటి అభిరుచులు ఇప్పుడు మనకే రుచించవు, ఇక పిలల్లకి అసలే రుచించవు, స్వానుభవమే. శీతవేళ రానీయకు కొందామని ఎప్పటినుండో అనుకుంటున్నాను, కానీ ముడిపడటం లేదు.
కొత్తపాళీ: మీరు శీతవేళరానీయకు ని సిఫారసు చేయడం నాకు కొంచెం సంతోషాన్నిచ్చింది. అది వార్త లో వచ్చేప్పుడు కొన్ని చదివాను. ఆ మధ్యన ఇండియాకి వెళ్ళినప్పుడు యధాలాపంగా పిక్ చేసుకొన్న పుస్తకాల్లో అదొకటి. దాంట్లో కొన్ని వ్యాక్యాలు నాకు బాగా నచ్చాయి.
ఖచ్చితంగా అన్ని సార్లు కాదు కాని, కొన్ని సార్లు నాకు పద్మ బాగా నచ్చుతారు.
థాంక్స్.
మీ పిల్లలు పుస్తకాలు చదువుతారా !!!!!!! ఎంత అదృష్ట వంతులండీ మీరు.
నేను ఎంతో కస్టపడి మా వాళ్ళకి న్యూస్ పేపర్ చదవటం వరకూ అలవాటుచెయ్యగలిగాను.
నెట్లో చందమామ ఎక్కడ వుందో కాస్త చూపెడతారా.
లలిత గారు http://www.chandamama.com/lang/index.php?lng=TEL చూడండి. పాత సంచికలు కావాలంటే అందులో ఆర్కైవ్స్ చూడండి. మీరు కూడా చంపినేనా అయితే ఈ టపాలు చూడండి.
http://avee-ivee.blogspot.com/2008/10/blog-post.html
http://nagamurali.wordpress.com/2008/04/23/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A4-%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B2%E0%B1%81/
http://blogaagni.blogspot.com/2008/09/blog-post_12.html
కొత్తపాళీ గారు అమ్మాయిలకు సూచించిన పుస్తకాలకే నా వోటూ కూడా!పద్మ "మనసుకోదాహం" అనే కథా సంపుటి కూడా రాసారు. అదిప్పుడు దొరకడం లేదు. వోల్గా స్వేచ్ఛ, సహజ కూడా చదవదగ్గ మంచి పుస్తకాలు.ముఖ్యంగా వోల్గా రచనలు సరళమైన భాషలో చదవడానికి హాయిగా ఉంటాయి.
@సుజాత .. వోల్గా రచనలు చదవడానికి హాయిగా ఉంటాయి అన్న వారిని మిమ్మల్నే చూశాను. ఈ మాట వింటే బహుశా ఆవిడకూడా అఫెండవగలరేమో జాగ్రత్త! నా కథల్చదివాక మనసులో కొంచెం బోల్డు అలజడి ఫీలవ్వాలి గానీ హాయిగా ఉండటమేవిటి, హన్నా అని :)
ఒక్కరు కూడా భానుమతి గారి "అత్తగారి కథలు" "నాలో నేను" సూచించనే లేదు!! ప్రతి అమ్మాయి తప్పక చదవవలసిన పుస్తకాలు అవి.
@సుజాత గారు, ఓల్గా రచనలు బాగుంటాయి కాని ఆవిడ కొన్ని భావాలంటే నాకు కాస్త భయమే!
@కొత్తపాళీ గారూ, :)
@జీడిపప్పు గారు, ధన్యవాదాలు. నిజమే అత్తగారి కథలు మంచి హాస్యంగా బాగుంటాయి, తప్పక చదవవలసినదే. నాలో నేను అయితే నేను చదవలేదు కాబట్టి తెలియదు.
’శీతవేళ రానీయకు శిశిరానికి చోటీయకు’ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎంతచక్కటి పల్లవి వ్రాశారు. ఇలాంటి పదబంధాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. మంచి టపా వ్రాశారు.
మాలతీ చందూర్ గారి "సద్యోగం" మంచి పుస్తకమని నా అభిప్రాయం.
70-80లలో తెలుగులో రచయిత్రుల హవా బాగా నడిచిందని చెప్పవచ్చు.అందుకే ఆకాలంలో ఆడపేర్లు పెట్టుకుని వ్రాసే మగవారు ఎక్కువగా - ఇది 60లలోనే మొదలయిందండీ.మీరన్నట్టే ఆరోజుల్లో వాతావరణం, అభిరుచులూ కూడా వేరే. ఏమయినా మంచి చర్చ. చూద్దాం ఇంకా ఎవరు ఏం సూచిస్తారో ..
@తెలుగు అభిమాని గారు, ధన్యవాదాలు.
@చిన్నమయ్య గారు, చాలా రోజులకి కనిపించారు, ధన్యవాదాలు.
@ మాలతి గారు, అవునా! అరవైలలో సంగతులు మీరే చెప్పాలి. ఇంతకీ మీరేం సూచించనేలేదు!
నా పిల్లలు teen age లో తప్పక చలం పుస్తకాలు చదివిస్తాను.
వాళ్లకు తెలుగు సిన్మాల ద్వారా , మనం లేనప్పుడు వాళ్లు చదివే, చూసే, మాట్లాడుకొనే సంగతుల ద్వారా ఆడా మగ సంబంధాల గూర్చి తెలియటం కంటే ఆయన పుస్తకాల ద్వారా తెలియటం మంచిదను కొంటాను.
నేను నా late teens లో ఆయన బుక్స్ చదివాను.
అలాగే శరత్ సాహిత్యానికి, టాగోర్ సాహిత్యానికి తెలుగులో అనువాదాలు దొరికితే తప్పక చదివించండి.
చాలా మంచి టపా.. చిన్నపుడు నాకు 15 యేళ్ళ వయసులో యండమూరి ఒంటరి పోరాటం నవల సగం చదివాను .. మా ఇంట్లో నవల్స్ చదవడం నిషేదం లేండి.. మా అమ్మ తెప్పించుకున్నపుడు దొంగ చాటుగా చదివా నాకు బాగా నచ్చింది ... ఇక్కడ చాల మంచి పుస్తకాల గురించి మంచి సైట్స్ గురించి తెలుసుకున్నా ధన్యవాధాలు
@మైత్రేయి గారు ధన్యవాదాలు. అవును చలం రచనలు అందరూ చదవాలి. చలం రచనలలో మీకు బాగా నచ్చినవి చెప్పగలరా? మీ బ్లాగులన్నీ ఈ రోజే చూసానండి. ఐదు బ్లాగులు వ్రాస్తున్న మీకు అభినందనలు.
@నేస్తం, ధన్యవాదాలు. అది ఒంటరి పోరాటం కాదు ఆఖరి పోరాటం-రెంటికి చాలా తేడా ఉందండోయ్!
వరూధిని గారు,
ఓల్గా రాసిన సహజ, స్వేచ్ఛ మొదలైనా రచనల్లో విపరీత భావాలుండవు. మనకి నచ్చేలాగానే ఉంటాయి. మానవి నవలలో రచయిత్రి తీర్పును మాత్రం మొదట నేను యాక్సెప్ట్ చెయ్యలేకపోయాను.
మైత్రేయి గారు సూచించినట్లు చలం పుస్తకాలు యువత చదవాల్సిందే గానీ టీనేజ్ లో కాదని నా వ్యక్తిగతాభిప్రాయం. స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉంటాయో తెలియని సందిగ్ధంలో ఉండే వయసులో ఏకంగా చలం పుస్తకాలు చదివితే అన్నప్రాసన రోజు ఆవకాయ తిన్నట్లే! ఆ వయసులో కలిగే confusion అంత త్వరగా పోదనడానికి నేనే ఉదాహరణ. నేను చలం పుస్తకాలన్నీ చదివాను. మొదలెట్టింది ఇంటర్మీడియెట్ లో! అప్పుడు ఆయన భావాల పట్ల ఒక రకమైన సందిగ్ధత ఏర్పడింది. ఇప్పుడు నేను చలం రచనలని ఒక పక్కన అభిమానిస్తూనే మరో పక్క "ఇదేమిటి, ఇలా చెప్పారేమిటీయన" అని ఒక్కో రచన చదువుతూ ఆశ్చర్యపోతూంటాను. టీనేజ్ లో అంగీకరించలేకపోయిన కొన్ని భావాలు ఇప్పుడు కరక్టే అనిపిస్తాయి మరో వేపు.
యువత ఆలోచనల్లో కొంత పరిణితి వచ్చాక అంటే మైత్రేయి గారు చదివినట్లు లేట్ టీన్స్ లో చదివితేనే మంచిదని నా అభిప్రాయం.
వరూధినిగారు,
నేను మీలాగే చిన్నప్పటినుండే వార, మాస పత్రికలు, నవళ్లు చదివేదాన్ని. నాకూ రాజశేఖర్ నచ్చలా. మా పిల్లలకు మాత్రం పుస్తకాలు చదివే అలవాటు చేయించలేకపోయాను. ప్చ్...
@సుజాత గారు, మీరన్నట్లు చెలం రచనలు కాస్త మానసిక పరిణితి వచ్చాకే చదవాలి (పెద్దవాళ్లలో కూడా ఈ పరిణితి అందరిలో ఉండదనుకోండి!). అసలు చెలం అంత కాంట్రావర్షియల్ రచయిత తెలుగులో మరొకరు లేరేమో. ఆయనని ఎవరికిష్టమొచ్చినట్టు వాళ్లు అర్థం చేసుకుంటారు, కొందరికి అసలు అర్థం కాడు కూడాను!
అవును సుజాత గారు, మీరు అసలు బ్లాగు మొదలుపెట్టిన ముఖ్య ఉద్దేశ్యం మరచినట్టున్నారే! అదేనండి పుస్తకాల పరిచయం, మరొక పరిచయం ఎప్పుడందిస్తారు?.
నేను మాలతి గారి తో పాటే, చూద్దాం ఇంకా ఎవరెవరు ఏ పుస్తకాలని తమ "పిల్లలతో చదివించుదాం అని అనుకుంటున్నా" రో?
అవును, ఇక్కడ చర్చిస్తున్న పిల్లల వయస్సు ఎంతో?
@ నెటిజన్ గారు ధన్యవాదాలు.
ఏ పుస్తకాలని తమ "పిల్లలతో చదివించుదాం అని అనుకుంటున్నా" రో?--ఇక్కడ విషయం "పిల్లలు చదవదగ్గ పుస్తకాలు". రెంటికి తేడా ఉందండోయ్! ఇప్పటి పిల్లల చేత మనం మనకి నచ్చిన పుస్తకాలు చదివించలేం, ఊరికే చెప్తాం అంతే! ఎంపిక వాళ్లదే!
ఇక ఇక్కడ పిల్లల వయస్సు 17, 14.
మీ 14 కి కాదు కాని , 17 కి చలం దైవ మిచ్చిన భార్య ఇవ్వచ్చండి. నాకు తెలిసి దీనిలో మరీ తీవ్రమైన భావ జాలం లేదు. చలం మిత్రులు , పురూరవ లాంటి పుస్తకాలు కూడా స్నేహం విలువ, నిజమైన ఆప్యాయత విలువ చెప్తాయి. తర్వాత చలం ఆత్మ కధ , స్త్రీ మొ|| ఇవ్వచ్చు. చివరగా మైదానం, ఆనందం, విషాదం., గీతాంజలి.
మరో recommendation , కరుణ శ్రీ గారి ఉదయశ్రీ, కరుణశ్రీ ..
నేను కుడా మీ లాగే, మీ బాపు బొమ్మ లాగే లెక్కలేనన్ని సీరియల్స్ వార పత్రికల్లో చదివాను. అవన్నీ ఆ టైం కి కాల స్ఖేపానికి ఉపయోగ పడ్డాయి కాని నిజంగా గుర్తున్నవి, ఇంప్రెస్స్ చేసినవి , మానసిక వికాసానికి ఉపయోగించినవి చాలా తక్కువ.
కొత్తపాళీ గారు,
మీ వ్యాఖ్య మిస్ చేశాను చదవడం! వోల్గా రచనల వల్ల మనసులో కలిగే అలజడే ఒక్కోసారి హాయిగా ఉంటుంది.(అన్నీ కాదు).
ఇంకో విషయం ఏమిటంటే భాష!లేని పోని కవిత్వాన్నంతా నింపి(కుప్పిలి పద్మ ఒక్కోసారి ఇలా చేస్తుంది)బోరు కొట్టించకండా, నల్లేరు మీద నడకలా, మొదలెడితే ఆపకుండా కంఫర్టబుల్ గా చదివగలిగే భాషలో ఓల్గా రాస్తారు.అది నాకు బాగా నచ్చుతుంది!
వరూధిని గారు,
మరే! కొన్ని పుస్తకాల రివ్యూలు సగం సగం రాసి ఉంచాను. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద రాస్తూ సమీక్షలు వెనకబడ్డాయి. ఇలాగే అప్పుడప్పుడు నన్ను చరుస్తూ ఉండాలి మీరు. త్వరలో ఒక సమీక్ష!
@sujata,
I too like volga for the same reason ఇంకో విషయం ఏమిటంటే భాష!లేని పోని కవిత్వాన్నంతా నింపి(కుప్పిలి పద్మ ఒక్కోసారి ఇలా చేస్తుంది)బోరు కొట్టించకండా, నల్లేరు మీద నడకలా, మొదలెడితే ఆపకుండా కంఫర్టబుల్ గా చదివగలిగే భాషలో ఓల్గా రాస్తారు.అది నాకు బాగా నచ్చుతుంది!
మీరు వ్రాసినది బాగుంది.మేమూ చిన్నప్పుడు అన్ని (అంటే మీరు వ్రాసిన రచయితలవి) చదివేవాళ్ళము. కానీ ఈ మధ్యన "విశ్వప్రసాద్" గారి ఒక నవల చదివాము. చదువుతుంటే చాలా చైల్డిష్ గా,సిల్లీ గా అనిపించింది. చిన్నప్పుడు ఇవే నవలలు చదవడానికి ప్రాణం ఇచ్చేవాళ్ళం.కారణం ఏమిటంటారు?
@మైత్రేయి గారు, బుజ్జి గారు, ధన్యవాదాలు.
@సుజాత గారు, మీ సమీక్ష కొరకు వెయిటింగ్. (అప్పుడప్పుడు చరచమన్నారుగా, అందుకు:)
@భమిడిపాటి గారు, ధన్యవాదాలు. అవునండి పెద్దయ్యేకొద్ది మన అభిప్రాయాలు, ఆసక్తులు మారిపోతూ ఉంటాయి-కారణం వయస్సు ప్రభావమేనంటాను. నాకిప్పుడు యద్దనపూడి నవలలు అసలు చదవబుద్ది కాదు.
Dear friends,
If you are looking for సహస్రశిరచ్ఛద అపూర్వ చింతామణి find it in Balanda section of www.telugubooks.tk.
నేను మా మనవరాలి కోసం పుస్తకాలను వెతుకుతూ చివరి ప్రయత్నము గా తెలుగు గుంపు లోనూ , ప్రమదావనం లోనూ అడుగగా ,ప్రమదావనము లో మధురవాణిగారు ఈ లింక్ ఇచ్చారు. నా చిన్నప్పుడు మాఇంట్లో పిల్లలు నవలలు చదవటము నిషేధము వుండేది. బుడుగూ ,డుంబు లాంటి కథలపుస్తకాలు చదివించేది మా అమ్మ. శెలవలలో మాలతీచందూర్ పుస్తకాలనుండి బొమ్మలు చేయటము ,కుట్లు అల్లికలు చేయించింది. 7వతరగతినుండి టాంసాయర్ ,హకల్బెరీఫిన్ ,అరేబియన్ నైట్స్ తెలుగు అనువాదము చదివించింది. 10 నుండి ఆరుద్ర సమగ్ర ఆంద్ర చరిత్ర ,కళాపూర్ణోదయం లాటివి చదివించింది. సాంఘిక నవలలు అంటే నా పెళ్ళితరువాత నేను బి.యే చదివేటప్పుడు .1973 లో మా ఫ్రెండ్ ద్వారా చదవటము అలవాటైంది .ఇప్పటికీ కొనో అద్దెకు తెచ్చుకొనో చదువుతాను.
ఇక ప్రస్తుతానికి వస్తే మా మనవరాలు 12 సంవత్సరాలది .అటూ ఇటూ కాని వయసు . ఇందులో కొన్ని తను ఇంగ్లిష్ లోనే చదివేసింది.పైన అందరు చెప్పిన పుస్తకాలు చదివే వయసు కాదు.పైగా వాళ్ళస్కూల్ వాతావరణము వేరు . ఈ శెలవలకైతే ,భానుమతి అత్తగారికథలు ,మల్లాది సద్దాం ఆంటీ ఇంటి కథ ఇచ్చాను. సద్దాం ఆంటీ ఇంటికథ ఐతే ఎంజాయ్ చేస్తోంది !
వరూధిని గారు ,
మీ పోస్ట్ కంటే నా జవాబు ఎక్కువైనట్లుంది ,సారీ ఇంతకంటే కుదించి రాయలేక పోయాను క్షమించండి.
habba... teugu lo teliyaadina
tanmayatwam.... enno naa alochanalaku roopaanni choostunna
bhaavana.... s friernds i am
coming...mariyoka telugu saahitya
pipaasini anukuntunna telugaabhimaani...
Post a Comment