పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

March 10, 2009

రంగుల పండుగ......మరక మంచిదే

హోలీ-రంగుల పండుగ-మేము చదువుకునే కాలంలో అంటే ఓ 25 సంవత్సారాల క్రితం ఈ పండుగ గురించి కోస్తా ప్రాంతంలో పెద్దగా తెలియదు. శ్రీరామ నవమికి గులాం చల్లుకోవటమే తెలుసు కాని ఇలా రంగుల్లో మునగటం తెలియదు. మేము డిగ్రీలో వుండగా బాపట్ల ఇంజనీరింగు కాలేజి పిల్లలు కాస్తంత హోలీ ఆడేవారు. అమ్మాయిలు కూడా రోడ్ల మీదకి వచ్చి రంగులు చల్లుకోవటం మాకొక వింతగా వుండేది. ఆ తరువాత తమిళనాడులో కూడా ఈ పండగ అంతగా చేసుకునే వాళ్లు కాదు. తరువాత తరువాత దక్షిణాదిలో ఈ పండుగ వ్యాప్తి చెందటానికి మీడియా మరియు  సినిమాలే ముఖ్య కారణం అనిపిస్తుంటుంది నాకు.

పెళ్లయ్యాక తెలాంగాణా ప్రాంతానికి వెళ్లాక మాత్రం ఈ పండుగ తన అసలు రంగుల్లో కనపడింది. మేమున్న ప్రాంతంలో ఈ పండగ చాలా బాగా చేసుకునేవాళ్లు. పెద్దా చిన్నా ఆడా మగా తేడా లేకుండా అందరూ రోడ్ల మీదే వుండేవారు ఆరోజు. ముందే పిల్లలకి వళ్లంతా నూనె రాసి అట్టిపెట్టే వాళ్లం. హోలీ ఆడనివాళ్లు కాలనీలో చాలా తక్కువ వుండేవాళ్లు. ఆడటం  ఇష్టం లేని వాళ్లు ఇళ్లల్లో తలుపులేసుకుని కూర్చున్నా తలుపులు పగలకొట్టి మరీ వాళ్లని వాళ్లతోపాటు ఇంటిని కూడా రంగుల్లో ముంచి వెళ్లేవాళ్లు. పిల్లలకి కూడా మంచి సరదాగా వుండేది. అంతా రంగుల్లో మునగటం అయ్యాక మగవాళ్లు గోదావరిలో స్నానాలు చేసి వచ్చేవాళ్లు. ఇంట్లో ఆడవాళ్లకి ఇంటిని, పిల్లలని, వంటిని శుభ్రం చేసుకోవటం సరిపోయేది. తరువాత మధ్యాహ్నమో రాత్రో క్లబ్బులో హోలీ స్పెషల్ విందు కూడా వుండేది. అదొక సామూహిక వేడుక లాగా వుండేది. మరే పండగ కూడా ఇలా అందరూ కలిసి చేసుకోవటం కనిపించదు.

జనమంతా ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ రంగుల పండుగలో అక్కడక్కడా అపశ్రుతులు వింటూ ఉంటాం. ఈ రంగులు కొంతమంది జీవితాలలో మాయని మరకలు మిగిలిస్తుంటాయి. విచక్షణా రహితంగా కృత్రిమ రంగులు వాడి  కళ్లు పోగోట్టుకునే వారు, చర్మ వ్యాధులతో, ఆస్త్మా సమస్యలతో,  ఇంకా వివిధ రకాల అలర్జీలతో బాధపడే వాళ్లు చాలా మంది ఉంటారు. అంతే కాదు కొన్ని రకాల కృత్రిమ రంగుల వల్ల కాన్సరు, మూత్రపిండాల సమస్యలు కూడా రావచ్చు. వేడుకగా రంగులు చల్లుకునే వాళ్లు కొన్ని సూచనలు పాటిస్తే ఈ రంగుల మరకలు మంచివే అవుతాయి.
  1. సహజ రంగులనే వాడండి. ఇవి మన శరీరానికే కాదు పర్యావరణానికి కూడా మంచివి.
  2. రంగులు ముఖంపై-ముఖ్యంగా కళ్లల్లోకి, ముక్కుల్లోకి, నోట్లోకి  పడకుండా చూసుకోండి. 
  3. ఎదుటివారి ముఖాలపైనా కళ్లల్లోనూ రంగులు కొట్టకండి.
  4. రంగులు చల్లుకునేటప్పుడు కళ్లద్దాలు పెట్టుకోవటం ఉత్తమం.
  5. కళ్లల్లో రంగు పడ్డట్టు అనిపిస్తే వెంటనే కళ్లని చల్లటి నీటితో బాగా కడుక్కోండి, కంటికి ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించండి.. 
  6. చంటిపిల్లలని ఈ వేడుకలకి దూరంగా వుంచండి.
సహజ రంగులని మనమే ఇంట్లో చేసుకోవచ్చు. పసుపు, కుంకుమ, పూలు, పళ్లు, ఆకులు, రకరకాల పిండులు- అసలు మనం వంటింట్లో నిత్యం వాడే వస్తువులు ఈ రంగుల తయారీలో వాడవచ్చు.  ఇంటికి,  వంటికి, పర్యావరణానికి అన్నిటికి మేలు చేసిన వాళ్లమవుతాం. ఇవి తయారు చేసుకోవటం కూడ సులువే. ఆకులని, పూలని, గింజలని ఎండబెట్టి పొడిచేసుకుని లేదా నీళ్లలో నానబెట్టి (అవసరమయితే కాస్తంత ఉడకపెట్టుకొని)  ఆపై కావలసినన్ని నీళ్లు కలుపుకుని చల్లుకోవటమే.

ఎరుపు రంగు కోసం గంధం, ఎర్ర మందార పువ్వులు, flame of forest (మోదుగ) పువ్వులు, గోగు పూలు, దానిమ్మ తొక్కు,  టమాటా, కారెట్టు, సున్నం పసుపుల మిశ్రమం.
పసుపు రంగు కోసం పసుపు శనగపిండిల మిశ్రమం, బంతి పూలు, పసుపుపచ్చ చేమంతి పూలు.
ఆకుపచ్చ రంగు కొరకు గోరింటాకు, గుల్‌మొహర్ ఆకులు, వీట్ జెర్మ్ (గోధుమ మొలకలు), పాలకూర, కొత్తిమీర, పుదీనా, టమాటా ఆకులు
బ్లూ రంగు కోసం సిరా చెట్టు (Indigo plant) అంటారు చూసారా దాని కాయలు.
ముదురు కెంపు రంగు కోసం బీటురూటు, ఉల్లిపాయ తొక్కలు.
పారిజాత పూల కాడలను ఎండబెట్టి వాటిని అవసరమయినప్పుడు నీటిలో నానపెడితే మంచి సింధూర వర్ణం తయారు.
బ్రౌన్ రంగు కోసం కాఫీ పొడి కాని టీ పొడి కాని మరగపెట్టిన నీళ్లు
ఇక నలుపు రంగు కూడా చేయవచ్చు ఎలా ఆంటారా-నలద్రాక్ష రసం వాడవచ్చు. అంతే కాదు ఎండబెట్టిన పెద్ద ఉసిరికాయల్ని ఓ ఇనుప మూకుడులో ఉడికించి ఓ రాత్రంతా అలాగే వదిలేసి మరునాడు కావలసినంత నీటిని కలుపుకుంటే మిలమిలలాడే నలుపు రంగు సిద్ధం.

అబ్బ ఈ మాత్రం శ్రమ కూడా మేం పడలేమంటారా సరే మనలాంటి వారి కోసం అదిలాబాదుకి చెందిన కొంతమంది మహిళలు మోదుగ పూలతో రంగులు తయారుచేసి అమ్ముతున్నారు. మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మరియు అదిలాబాద్ కృషివిజ్ఞానకేంద్రం వారు కలిసి ఈ రంగులు అమ్మే కేంద్రాన్ని నిన్నటినుండి (09/03/09) కోఠి మహిళా కళాశాల వద్ద ఏర్పాటు చేసారు. ద్రవరూపంలో అయితే ఒక సీసా 20 రూపాయలు పొడి రూపంలో అయితే ఒక్కో ప్యాకెట్టు 30 రూపాయలట. ఇంకా వివరాలు కావాలంటే 9989623829 కి ఫోను చేసి  తెలుసుకోవచ్చు.

అందరికి హోలీ శుభాకాంక్షలు.

7 వ్యాఖ్యలు:

మురళి March 10, 2009 at 5:39 PM  

బాగుందండి.. రంగులతో పాటు కోడిగుడ్లను తలపై కొడుతూ ఉంటారు కదా.. ఆ విషయం ప్రస్తావించలేదు..

నేస్తం March 10, 2009 at 7:23 PM  

నిజమే కోస్తాలో ఈ పండగ సంబరాలు తక్కువే ..చాలా బాగా రాసారు

సత్యసాయి కొవ్వలి Satyasai March 10, 2009 at 8:50 PM  

మీరిచ్చిన ప్రకృతి సహజ రంగుల తయారీ సలహాలు బాగున్నాయి. నాకు కూడా ఈపండగతో పరిచయం బాపట్ల కాలేజీలోనే అయింది. ఉత్తరాదిలో భాంగు ఈపండగలో ముఖ్య భాగం. ఢిల్లీలో ఉన్నరోజులలో ఏసిడ్ బల్బులు వేస్తారని చదివేవాళ్ళం.

ఏకాంతపు దిలీప్ March 10, 2009 at 9:07 PM  

కోస్తాలో కాలేజీలు ఉన్న చోట తప్పితే ఈ పండగ పెద్ద జరుపుకోరు కదా... ఈ మధ్య రంగుల వాళ్ళ మర్కెటింగ్ పుణ్యమా అని ఈ పండగ కూడా ఊళ్ళల్లోకి వెళ్తున్నట్టుంది...

ఏకాంతపు దిలీప్ March 10, 2009 at 9:10 PM  

ఈ రోజు ఇక్కడ డిల్లీలో కామదహనం కార్యక్రమాలు మొదలేట్టేసారు... మా బ్లాకులో భోగి మంటలలాగా మంటలేసారు... రేపు ఇంక రంగులతో ఆట...
పిల్లల్లు ఈ పాటికే చినా తయారీ రంగు పిచికారీ జల్లే పంపులతో, పగిలే రంగు నీళ్ళ బెలూన్లతో వీధిల్లో తిరుగుతున్నారు...
సత్యసాయి గారన్నట్టు, అందరూ హడావుడి చేసినతరవాత భాంగ్ ఒకరికొకరు ఇచ్చుకుని తాగుతారు...

సిరిసిరిమువ్వ March 11, 2009 at 11:04 AM  

@మురళి గారు, అవును కోడిగుడ్ల సంగతి మర్చిపోయాను. ఇప్పుడే మా అపార్టు‌మెంటు ముందు పిల్లలు కోడిగుడ్లతో నెత్తిపై కొట్టుకుంటున్నారు:)
@నేస్తం, కోస్తాలో ఇప్పుడు కూడా ఈ సంబరాలు కాలేజీల వరకే పరిమితం అనుకుంటా!
@సత్యసాయి గారు, ధన్యవాదాలు. భాంగు గురించి విన్నా కాని ఏసిడ్ బల్బులు గురించి తెలియదు. మీరెప్పుడైనా బాపట్ల కబుర్లు చెపుతారేమో విందామని చూస్తున్నా. కొత్తపాళీ గారు ఏవో కొన్ని చెప్పి ఇక వాటి గురించే మర్చిపోయారు:)
@దిలీపు గారు, అవునండి, కాలేజిలకే పరిమితం, ఊళల్లోకి ఇంకా వెళ్లినట్లు లేదులేండి,వెళ్లినా ఆశ్చర్యపడాల్సింది లేదు.

మాలతి March 13, 2009 at 4:52 PM  

బాగుందండీ మంచి సలహాలు ప్రకృతిసహజమయిన రంగులగురించి. అసలు ఈరంగులపండుగ ఎలా మొదలయిందో చెప్పగలరా. నాకు తెలుసుకోవాలని వుంది.
నాకస్సలు తెలీదు, కోస్తాదాన్ని కావడంచేత. చిత్తూరుప్రాంతాల్లో కూడా లేదనుకుంటా

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP