పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

October 14, 2008

తెలుగు-ఇంగ్లీషు విశాలాంధ్ర-క్రాస్‌వర్డ్

మా ఇంట్లో ఇంగ్లీషు పుస్తకాలు చదవటం చాలా తక్కువ. ఎవరైనా ఈ పుస్తకం చాలా బాగుంది చదువు అని చెపితేనో, ఇస్తేనో, చదవటమే కాని స్వతాహాగా ఇంగ్లీషు పుస్తకాల మీద అంత ఆసక్తి లేదు, వాటిని అంతగా కొనం కూడా. అందుకు మొదటి కారణం ఆ పుస్తకాలలో రాసేది మనకి సగం కూడా అర్థం కాదు, ఇక రెండోది మాతృభాషలో చదువుతుంటే ఉండే ఆనందం కాని ఆ పాత్రలతో మమేకం అవటం కాని వేరే భాషలో (ఇంగ్లీషులో) చదువుతుంటే ఉండదన్న ఓ భావన. నా వరకు నేనైతే ఇంగ్లీషు పుస్తకాలు ఎంత గొప్పవయినా వాటి తెలుగు అనువాదాలు చదవటానికే ఎక్కువ ఇష్టపడతాను. ఒక యోగి ఆత్మకథ, అమ్మ, ఏడు తరాలు, ఒక దళారి పశ్చాత్తాపం లాంటివన్ని నేను తెలుగులోనే చదివాను. మా పిల్లలకి కూడా వాళ్ళు ఏదైనా పుస్తకం అడిగితే ముందు దాని తెలుగు అనువాదం దొరుకుతుందేమో చూస్తాం. నండూరి రామమోహనరావు అనువాదం చేసిన మార్క్‌ట్వేన్ పుస్తకాలు, స్టీవేన్సన్ కాంచనద్వీపం అలా కొన్నవే. ఒక్కొకసారి అసలు పుస్తకాల కంటే ఈ అనువాద పుస్తకాలు చదవటమే బాగుంటుంది. R.K. నారాయణ్ రాసిన Swami and his friends కి వాసిరెడ్డి సీతాదేవి చేసిన అనువాదం స్వామి-మిత్రులు (నేషనల్ బుక్ ట్రస్టు వాళ్ళ ప్రచురణ) చదువుతుంటే ఎంత బాగుంటుందో. సొదుం రామ్మోహన్ కూడా మంచి అనువాదాలు చేస్తుంటారు.

నేషనల్ బుక్ ట్రస్టు వాళ్ళు, చిల్డ్రన్సు బుక్ ట్రస్టు వాళ్ళు, హైదరాబాద్ బుక్ ట్రస్టు వాళ్ళు, పీకాక్ క్లాసిక్సు వాళ్ళు, మంచి మంచి పుస్తకాలకి తెలుగు అనువాదాలు ప్రచురిస్తూ ఉంటారు.

చదువుకునే రోజులలో జెఫ్రీ ఆర్చర్, సిడ్నీ షెల్డాన్, షేక్‌స్పియరు లాంటి వాళ్ళ పుస్తకాలు ఏవో ఒకటి రెండు చదివి వుంటాను. ఇప్పుడు మాత్రం మా పిల్లల ద్వారా నేను కూడా అప్పుడప్పుడు ఇంగ్లీషు పుస్తకాలు చదువుతున్నా. హారీ పాటరు పుస్తకాలన్నీ నా చేత మా పిల్లలు చదివించినవే.

హైదరాబాదులో సంవత్సరం సంవత్సరం జరిగే పుస్తక ప్రదర్శనలో తప్పితే మామూలుగా పుస్తకాలు కొనాలంటే మేము వెళ్లేది విశాలాంధ్ర పుస్తకాల కొట్టుకే. అలాంటిది మొన్న ఆదివారం దారి తప్పి దారి లేక ఓ గంట కాలక్షేపం కోసం బంజారాహిల్సులోని క్రాస్‌వర్డ్ పుస్తకాల కొట్టుకి వెళ్ళాం. పిల్లలతో వెళ్ళాం కదా గంటలో ఓ 1800 రూపాయల పుస్తకాలు కొన్నాం. ఇంకాసేపు ఉంటే మా పిల్లలు క్రెడిట్టు కార్డు మీద ఇంకెంత భారం వేస్తారో ఇక చాలు అని త్వర త్వరగా బయటపడ్డాం.

మేము కొన్నవి:
1. Emma, Pride and Prejudice by Jane Austin.
2. Chowringhee by Sankar.
3. The lost child and other stories by Mulk Raj Anand.
4. Grandmother's Tale by R.K. Narayan.
5. The Bachelor of Arts by R.K. Narayan.
6. Blur Mars by Kim Robinson.
7. David Copperfield by Charles Dickens.
8. The Fountainhead by Ayn Rand.

ఇందులో మొదటి ఐదూ నా ఎంపిక. ఇక ఈ మధ్య బ్లాగుల్లో ఎక్కడ పడ్డా ఫౌంటెనుహెడ్డు గురించి గొప్పగా రాస్తున్నారని మా వారు, ఇష్టమైన పుస్తకం ఏదని ఎవరిని అడిగినా ఫౌంటెనుహెడ్డు అనే చెపుతున్నారు అసలు దానిలో ఏముందో చూద్దాం అని మా అమ్మాయి కలిసి ఆ పుస్తకాన్ని ఎంపిక చేసారు. ఇక మిగతా రెండూ మా పిల్లల ఎంపిక. మరి ఇందులో ఏది ఎలా ఉంటుందో వీటిని చదివిన చదువరులే చెప్పాలి.

ఇక క్రాస్‌వర్డ్, వాల్‌డెన్ లాంటి పుస్తకాల కొట్టులతో నచ్చని విషయం ఏమిటంటే అక్కడ చూద్దామన్నా ఒక్క తెలుగు పుస్తకం కూడా కనపడకపోవటం. ఇంగ్లీషు కొట్లలో తెలుగు పుస్తకాలు ఎలా దొరుకుతాయి అంటారా! మరి తెలుగు కొట్లలో ఇంగ్లీషు పుస్తకాలు దొరకటంలే....

19 వ్యాఖ్యలు:

oremuna October 14, 2008 at 5:21 PM  

చాలా కొన్నారుగా!

వాల్టన్ వాడు, ఒడిస్సీ వాడూ కంటి తుడుపు కోసం కొన్ని తెలుగు పుస్తకాలు పెడతారు, క్రాస్ వర్డ్ అయితే అన్యాయం ఒక్క పుస్తకం కూడా ఉంచరు.

ఇహ మీరు కొన్న పుస్తకాలన్నీ చదివి రివ్యూలు బ్లాగాలి సుమా!!

Kottapali October 14, 2008 at 5:30 PM  

చాలా బావుందండీ .. సకుటుంబ సమేతంగా సినిమాలకో హోటళ్ళకో వెళ్ళడం విన్నాంఉ గానీ పుస్తకాల కొట్టుకి వెళ్ళడం వినలే. టపా టైటిలు చూసి, మీరు కూడా సత్యసాయి మేష్టారిలా మీ సోంత ప్రైవేటు గడీ (క్రాస్వర్డ్) మొదలు పెట్టారేమో ననుకున్నా! జేన్ ఆస్టిన్ ఇంతకు ముందు చదివారా? ఆవిడ శైలి మీకు నచ్చుతుందని నాకనిపిస్తోంది ఎందుకనో. ఎమ్మా ఐతే మరీనూ. పిల్లలు డేవిడ్ కాపర్ఫీల్డ్ ఎంపిక చేశారంటే నాక్కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ హేరీపాటర్ అన్నీ చదివేశారా? చదివేస్తే, మీ అభిప్రాయం ఏవిటి? పోయినేడు చివరి పుస్తకం రిలీజైన సందర్భంగా నేనో టపా రాశాను, చూశారా? ఇప్పుడు కూడా ఇంగ్లీషులో మంచి నవలలు వస్తున్నాయి. ఎవరైఆ పూనుకుని చక్కటి అనువాదాలు చేస్తే బానే ఉంటుంది.

నిషిగంధ October 14, 2008 at 7:59 PM  

కొత్తపాళీగారన్నట్లు భలే చక్కగా సకుటుంబ సమేతంగా వెళ్ళారుగా పుస్తకాలషాపుకి!! నేను కూడా మీలానే! తెలుగు పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం ఇంగ్లీష్ నవల చదువుతున్నప్పుడు ఉండదు.. ఇంక అందులో ఏ కాస్తంత ఫిలాసఫీనో, రొమాన్సో ఉంటే అస్సలు చదవబుద్ది కాదు! అందుకే Fountainhead చదవడం మొదలుపెట్టి ఓ 50 పేజీలయ్యాకగానీ ఉత్సాహం కలగలేదు! Dan Brown పుస్తకాలు 'Angels and Demons' and 'Davinci Code' ఇచ్చిన కిక్కు ఈ మధ్య ఏ ఇంగ్లీష్ బుక్ ఇవ్వలేదు :-)

Purnima October 14, 2008 at 9:08 PM  

మొన్న అమ్మని తీసుకెళ్ళా క్రాస్ వార్డ్స్ కి! "నువ్వో రెండు మూడు సార్లు వస్తేనే వీడి షాపిలా తగలడిపోయిందా?" అని సటైర్ వేసింది. నేనో పది రోజుల ముందెళ్ళాను, అక్కడ పుస్తకాల కన్నా నా రూం చాలా బెటరనిపించింది. ఏమైనా సర్దాడా?

మీరు కొన్న పుస్తకాలన్నీ మనం ఎంటరయ్యే దరిదాపుల్లోనే ఉండేవనిపిస్తుంది. క్రాస్ వర్డ్స్ లో క్లాసిక్స్ సెక్షన్ బాగుంది, నేను అక్కడ: The picture of Dorian Gray, O'Henry Short Stories, Pearl S Buck short stories, Jack London writings లాంటివి కొన్నాను. ఒక్కో పుస్తకం రెండొందల కన్నా తక్కువే! హోశ్చర్యం!!

మాసబ్ టాంక్ దగ్గర ఆశోక ప్లాజా అనుకుంటా, Books and Beyond అని కొత్తగా పెట్టారు. బానే ఉంటుంది. ఇక తెలుగు పుస్తకాలంటే విశాలాంధ్రనే, మరెక్కడా అవకాశం లేదు.

కిరణ్ గారన్నట్టు, మీ రివ్యూలకోసం ఎదురుచూస్తాం.

happy reading!

Anil Dasari October 14, 2008 at 10:03 PM  

రెండ్నెల్ల క్రితం ఇండియా వెళ్లి తిరిగొస్తున్నప్పుడు హయిదరాబాదులో మంచి పుస్తకాల షాపు ఏదని అడిగితే చాలామంది 'వాల్డెన్, వాల్డెన్' అనరిచారు. సరే, దీన్సంగతేదో చూద్దాం అనుకుని ఆల్వాల్ నుండి ట్రాఫిక్కులో రెండు గంటల పాటు ఈది వాల్డెన్ చేరి చూస్తే అక్కడున్న తెలుగు పుస్తకాలు వందో, నూట పాతికో! ఓ మూలన మొహమాటానికి ఓ అరలో సర్దాడు. కొన్నిట్నయితే అర కూడా వేస్టన్నట్లు కిందనే పెట్టేసుంచాడు. వాటిలోనే ఓ పది ఏరుకుని కొని బయటపడ్డా. షాపు వాడిని తిట్టుకుని ఏం లాభం? కొనేవాళ్లు లేకనే తెలుగు పుస్తకాలు తక్కువ పెట్టినట్లున్నాడు.

నాకు తెలీకడుగుతా, హయిదరాబాదులో - ఆ మాటకొస్తే ఆంప్ర లో - తెలుగు పుస్తకాలు చదవటం అంటే నామోషీనా? అంగ్ల పుస్తకాలకున్నంత గిరాకీ తెలుగు పుస్తకాలకి లేకపోవటం ఏమిటి?

Purnima October 14, 2008 at 11:11 PM  

అబ్రకదబ్ర గారు: నామోషీ అనే కాదు, కొనడానికి సరైన సమాచారం లేక కూడా! ఇప్పుడొక కొత్త ఇంగ్లీషు పుస్తకం వస్తే ఎవరో ఒకరి ద్వారానో, ఏ మాధ్యమం ద్వారానో తెలుస్తుంది. కానీ, తెలుగు పుస్తకాల గురించి చెప్పేవారుండరు, తెలుసుకోవాలని అనిపిస్తున్నా.

నా విషయమే తీసుకుంటే, బ్లాగుల్లోకి వచ్చే వరకూ నాకు తెలిసిన రచయితలు గోపిచంద్ (మాకు పాఠ్యాంశం ఉండేది తొమ్మిదో తరగతిలో), యండమూరి ( household name కదా), శ్రీశ్రీ ఇంకా ఇలా చాలా ఫేమస్ అయిన వాళ్ల పుస్తకాలే! ఇక్కడికొచ్చాక పుస్తకాలు, రచనలూ, రచయితలూ ఇవ్వన్నీ తెలుస్తున్నాయి.

మీరు నామోషీ అన్నట్టు, ఇంకొంత మంది ఈ తరం వాళ్ళకి తెలుగెక్కదు అని సింపుల్గా చేతులు దులిపేసుకుంటారు. అదీ నిజం కాదు, ధ్యాస మళ్ళించగలగాలే కానీ, తెలుగంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. మాకు చెప్పాలే గానీ, మేం మాత్రం ఓ పట్టు పట్టమా? :)

మన సాహితీ సంపద గురించి, తెలియని వారికీ, తెలిసీ మర్చిపోయిన వారికీ తెలిసేట్టు చేయాలి. ఓ పుస్తకం చదివాక, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఓ టపా రాసినంత చిన్న ప్రయత్నం నుండి ఇంకెంత పెద్దగా నైనా ఇది చేయగలగాలి.

మీరేమంటారు?

చేతన_Chetana October 15, 2008 at 5:37 AM  
This comment has been removed by the author.
చేతన_Chetana October 15, 2008 at 9:32 AM  

నేను ఇండియా వెళ్ళినప్పుడు విజయవాడ నవోదయా లో కొనుక్కున్నాను. నవోదయా రామ్మోహన్రావుగారు, చక్కగా కబుర్లు చెప్పి (పుస్తకాలు చూస్తున్న మాతో (నేను, మా తమ్ముడు), విజయవాడ పాత రోజులు, పాత పరిచయస్తులు గురించి మా నాన్నగారితో), అడిగిన పుస్తకాలే కాక వేరే రికమండేషన్లు చూపించారు. నేను అంతకుముందు ఇంట్లోనూ అక్కడ ఇక్కడ దొరికినవి చదవటమే, తెలుగు పుస్తకాలు ఇంట్రెస్ట్‌గా కొనుక్కోవటం అదే మొదటిసారి.

KumarN October 15, 2008 at 10:49 AM  

అబ్రకదబ్ర గారూ..మీకు వాల్డెన్ తెలీకపోవడం ఆశ్చర్యంగా ఉంది నాకు. అది చాలా సంవత్సరాల నుంచి ఉందండీ..నేనెప్పుడూ సోమాజీగూడ లో దానికి వెళ్ళేవాణ్ణి.
అప్పట్లో ఒక్క తెలుగు పుస్తకం నాకక్కడ కనపడెది కాదు. మా బాస్ "7 హేబిట్స్" చదివి చాలా ఇన్స్పైర్ అయిపోయి, మా ఆర్గనైజేషన్ అందరినీ చదవమని రికమెండ్ చేస్తే, అప్పుడు పరిచయమయిది ఆ షాపు నాకు.

కానీ ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు పుస్తకాలంటే విజయవాడే బెస్టు అనుకుంటా. బోల్డన్ని దొరుకుతాయి. ఒకప్పడు రష్యా సాహిత్యం కూడా పుంఖానుపుంఖాలుగా దొరికేది. ఇప్పుడు నేను విజయవాడకెళ్ళట్లెదు కాబట్టి, కోఠి లోని విశాలాంధ్రనే జిందాబాద్ అనుకుంటా ఇండియా కెళ్ళినప్పుడళ్ళా. విశాలాంధ్ర కాకుండా పోయిన సారి వెళ్ళినప్పుడు నేను బడిచౌడి లోనో, ఆ పరిసర ప్రాంతాల్లొనో(సుల్తాన్ బజార్..ఆంధ్రబ్యాంకు, లేక సైదాబాదు, మిధాని వెళ్ళే బస్సులు ఆగే స్టాండు దగ్గర) ఒక రెండు తెలుగు పుస్తకాల షాపులు దొరికాయి నాకు, అవి కూడా పెద్దవే..(సారీ పేర్లు గుర్తు లేవు..కొంచెం లోపలికి ఉంటాయి అవి) క్రింద అన్ని కాంపిటీటివ్ బుక్స్ స్టఫ్ ఉంటుంది..వాడికి చాలా ఎక్స్ప్లయిన్ చెస్తే పైకెక్కడికో పంపించాడు నన్ను ఓ అబ్బీ నిచ్చి. ఆ అబ్బాయి నన్నక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు నీ ఓపిక అని.

పైన కొంచెం చీకటిగా, పెద్దగా ఉన్నప్ప్పటికీ, కొన్ని దొరికాయి నాకు..ఇఫ్ అయాం రైట్ తస్లిమా నస్రీన్ 'లజ్జా'( తెలుగు) అక్కడే కొన్న్నా నేను..అలాగే మరి కొన్ని కూడా..బట్ ఏదీ కూడా విశాలాంధ్ర కు సాటి రాదనుకోండి. సాధారణంగా నేను పుస్తకాలూ, మ్యూజిక్(ఆబిడ్స్) ఒకే ట్రిప్ లో అయిపోగొట్టుకుంటా. పోయినసారి సజ్జద్ అలి కాసెట్ కావాలి అని బెంగుళూర్, హైద్ లో ఎన్నో షాపులు తిరిగినా దొరకనిది, ఆబిడ్స్ లో ఓ చిన్న సందులో దొరికింది.

నిజంగానే చాలా మందికి, తెలుగు రచయితలు తెలవరండీ కొనడానికి, చదవడానికీ. నేను కొంచెం గ్రాంధికం ఎక్కువైతే చేతులెత్తేస్తా. ఇక పురాణల జోలికి అస్సలు వెళ్ళననుకోండి.

సిరిసిరిమువ్వ October 15, 2008 at 12:20 PM  

@ఒరెమూనా, నేనా రివ్యూలు బ్లాగటమా! అదీ ఇంగ్లీషు పుస్తకాలకి, భలే వారే మీరు. ఇవి చదవటానికే నాకు ఏళ్ళు పూళ్ళు పడుతుంది, నాకందులో అర్థం అయ్యేది 50 శాతం, అందులో నేను మీకర్థం అయ్యేటట్లు చెప్పగలిగేది ఓ 5 శాతం ఉంటుందేమో :))
@కొత్తపాళీ గారు, మేము పుస్తకాల షాపుకి ఎప్పుడెళ్ళినా సకుటుంబసపరివారసమేతంగానే వెళతాం. నేను పిల్లలు కలిసి ఓ బండెడు పుస్తకాలు ఎంచి పెడతాం, అందులో నుండి చదువరి గారు ఇది ఇంగ్లీషా అయితే వద్దు, ఇవి కథలా అయితే వద్దు అంటూ వాటిని ఓ చిన్న కట్టెడు చేసేస్తారు :))

జేన్ ఆస్టిన్‌వి ఇంతవరకు నేనేమి చదవలేదండి. పిల్లల డేవిడ్ కాపర్ఫీల్డ్ ఎంపిక--Oliver Twist, A Tale of Two Cities, Great Expectations చదివారు, వాటి ప్రభావమేమో!
హేరీపాటర్--చివరిది చదవలేదు. మొదటినుండి అన్నీ మరొకసారి చదివి అప్పుడు లాస్టుది చదువుదామని ఆగా కానీ ఆ మరోసారి ఇప్పుడప్పుడే వస్తుందనిపించటంలా. హేరీపాటర్ మీద మీ పోస్టు చూసా. అందులో మీరు చెప్పిన వాటన్నిటితో పాటు మార్కెటింగ్ మహిమ కూడా తోడయిందిలేండి. ఆ క్రేజ్ ఎంతలా తయారయ్యిందంటే స్కూలులో హేరీపాటర్ చదవనివాళ్ళని తేలికగా చూసేటంతగా, అలా చూడబడకుండా ఉండటం కోసం అయినా చదివిన పిల్లలు బోలెడు మంది.

జ్యోతి October 15, 2008 at 12:48 PM  

వరూధినిగారు,

మీ పిల్లలకు మంచి అలవాటు చేసారండి. ముఖ్యంగా తెలుగు పుస్తకాలు.

Anil Dasari October 15, 2008 at 1:19 PM  

కుమార్జీ,

నాకు హయిదరాబాదు పెద్దగా తెలీదండీ. ఎప్పుడో పదకొండేళ్ల క్రితం ఓ ఏడాదిన్నర అక్కడున్నా. అప్పుడు ఉద్యోగ వేటలోనే సరిపోయింది, ఇక పుస్తకాల షాపులకి తిరిగే టైమెక్కడ? మళ్లీ మొన్ననే వెళ్లటం.

సిరిసిరిమువ్వ October 15, 2008 at 2:10 PM  

@నిశిగంధ, Angels and Demons, Davinci Code---నేను చదవలేదు కాని రెండిటిలో మా అమ్మాయికి Angels and Demons బాగా నచ్చింది.
@పూర్ణిమ, మేము ఉదయం పూట వెళ్ళాం కనక కాస్త సర్దే ఉన్నాయిలే. మనం ఎంటర్ అయ్యే దగ్గర తీసుకున్న పుస్తకాలు Chowringhee, The lost child, మిగతావి లోపలే తీసుకున్నాం.

@అబ్రకదబ్ర గారు, "అంగ్ల పుస్తకాలకున్నంత గిరాకీ తెలుగు పుస్తకాలకి లేకపోవటం ఏమిటి"---గిరాకీ లేకపోవటం లేదు కాని పూర్ణిమ చెప్పినట్లు పుస్తకాల గురించి జనాలకి తెలియాలంటే మనవంతు ప్రయత్నం మనం చేయాలి, ముఖ్యంగా ఈ తరం పిల్లలకి తెలుగు పుస్తకాలు చదవటం బలవంతంగానైనా అలవాటు చేయాలి. ఎవరి పిల్లలకో కాదు మన ఇంట్లో మన పిల్లలకి మనం అలవాటు చేస్తే, వాళ్ళు మరొకరికన్నా ఆ అలవాటు అంటించరంటారా!! ఇకనుండి మీరు కూడా ఎవరికైనా ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే ఓ మంచి తెలుగు పుస్తకం ఇవ్వండి.

సిరిసిరిమువ్వ October 15, 2008 at 2:28 PM  

@ చేతన గారు, నవోదయా రామ్మోహనరావుగారి గురించి చాలా చోట్ల విన్నా. వీలైతే ఒకసారి విజయవాడ నవోదయకి వెళ్ళాలని కోరిక.

@ కుమార్ గారు, మేం కూడా కోఠి విశాలాంధ్ర జిందాబాద్ బాపతే. మరో తెలుగు పుస్తకాల కొట్టు గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. ఈ సారి అటు వెళ్ళినప్పుడు వెతుకుతాం.

@ జ్యోతి గారు, మేం పిల్లలకి ఇచ్చే ఆస్తిపాస్తులు అవే :))

సుజాత వేల్పూరి October 15, 2008 at 2:44 PM  

అబ్రకదబ్ర,
హైదరాబాదులో చాలా విషయాలు నామోషీయే లెండి! వాల్డన్ లో, క్రాస్ వర్డ్ లో మీకు తెలుగు పుస్తకాలు దొరకనే దొరకవు! ఒడిస్సీలో దొరికే తెలుగు పుస్తకాలు మనకక్కర్లేనివి!

మంచి పుస్తకాలు అనగానే చాలామంది వాల్డన్, క్రాస్ వర్డ్ పేర్లే చెప్తారు. తెలుగు పుస్తకాలు కావాలంటే మనమే వెదుక్కోవాలి. ఒక్కసారి కోఠీ వెళ్ళామంటే దగ్గర దగ్గర లోనే చాలా షాపులు ఉంటాయి కాబట్టి కాసేపు తిరిగి మరీ కొనొచ్చు. నా పద్ధతి ఇదే! డిసెంబరు వస్తే పండగే అనుకోండి. నిజాం కాలేజీ గ్రౌండ్ అంతా మనదే!

వరూధిని గారు,
త్వరలో పుస్తకాల మీద మంచి రివ్యూ రాయాలి మరి!

కొత్త పాళీ October 15, 2008 at 5:04 PM  

@Purnima .. Well said.

హైదరాబాదు సంగతి నాకు తెలియదు గానీ ఇదివరకు (సుమారు 20 ఏళ్ళ క్రితం) కొంచెం పెద్ద రైల్వే స్టేషన్లలో ఉండే హిగిన్‌బాదంస్, వీలర్ బుక్ స్టాల్సులో అప్పటి పాపులర్ నవల్లు ఇంగ్లీషు తెలుగు రెండూ విరివిగా దొరికేవి. బస్ స్టాండ్లలో షాడో, ఇత్యాది పాకెట్ నవల్లు బాగా దొరికేవి. ఇలాంటి పుస్తకాలు ఇంచుమించు అసలు కనబడ్డం మానేశాయి. అలాంటిది 2003లో శ్రీకాకుళం బస్ స్టాండులో ఒక తోరణంలా కనిపించాయి ఈ డిటెక్టివ్ నవల్లు, అదే ట్రేడ్ మార్కు పంచ రంగుల ముఖ చిత్రంతో సహా. కొని తెచ్చుకుందామని ఆశ పడ్డాను గానీ బస్సుకి టైమైపోయి పరిగెత్తాల్సి వచ్చింది.
తెలుగు పుస్తకాల ప్రేమికులకి తప్పక దర్శించాల్సిన మరో ప్రదేశం విజయవాడ లెనిన్ సెంటర్లో ఉండే పాత పుస్తకాల షాపుల వరస.
జనవరి ప్రారంభంలో జరిగే పుస్తకాల పండుగ కూడా హైదరాబాదు పండగ కంటే చాలా పెద్దది. దాన్ని చూడ్డంకోసమే అయినా ఆ సమయంలో విజయవాడ వెళ్ళి రావచ్చు.

సుజాత వేల్పూరి October 15, 2008 at 5:27 PM  

మొన్న దసరా సెలవులకు వూరు వెళ్ళినపుడు గుంటూరు అరండల్ పేట ఒకటో లైన్లో ఉండే పాత పుస్తకాల షాపులన్నీ వెదికి చాలా పాత పుస్తకాలు ప్రస్తుతం ప్రింట్ లో లేనివి కూడా సంపాదించగలిగాను. ప్రస్తుతం అద్దె పుస్తకాల షాపులు నడవటం లేదు కాబట్టి వాటిని టోకున అక్కడ అమ్మేస్తారు కాబోలు, ఎన్ని నవలలు, ఇతర పుస్తకాలు ఉన్నాయో చెప్పలేను. అపన (అపరాధ పరిశోధన) అనే పీరియాడికల్ లో వచ్చిన పాత నవలలు కూడా దొరికాయంటే నమ్మండి!

అలాగే లిబర్టీ థియేటర్ ఎఉదురుగా ఉన్న షాపులో కూడా కొన్ని పాత పుస్తకాలు, పిల్లల పాకెట్ నవలలు దొరికాయి.

కాస్త ఓపిక చేసుకుని ఆదివారాలు ఆబిడ్స్ GPO నుంచి మొదలెట్టి పాక్కుంటూ ఆంధ్రా బాంక్ దాకా వస్తే బోలెడు పుస్తకాలు అన్ని భాషలవీ దొరుకుతాయి మన హైదరాబాదులోనైనా!

Rajendra Devarapalli October 15, 2008 at 9:15 PM  

లిబర్టీ థియేటర్ ఎఉదురుగా ఉన్న షాపు...ఇంకా అలాగే పాతపుస్తకాలే అమ్ముతున్నారా?చాలా సంతోషం మంచి మాట చెప్పారు :)

సిరిసిరిమువ్వ October 17, 2008 at 11:15 AM  

సుజాత గారు, చాలా పుస్తకాలే కొన్నారన్నమాట. ఒక రోజు చెప్పపెట్టకుండా మీ ఇంటికొచ్చేస్తా!

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP