వినాయకచవితి-ఇకనైనా మేలుకుందాము
హైదరాబాదు నగరంలో అతి పెద్ద సందడి గణేష్ నవరాత్రులు. ఒకరి మీద ఒకరు పోటీగా గల్లీ గల్లీకి ఓ రెండు మూడు వినాయక మండపాలు, భారీ వినాయక విగ్రహాలు, తిరుపతి లడ్డు కూడ ఈర్ష్య పడేలాంటి లడ్లు, ఆ లడ్డూల వేలం (వెర్రి), చెవుల తుప్పు వదలగొట్టే లౌడు స్పీకర్లు- అబ్బో ఆ తొమ్మిది రోజులు హడావుడి అంతా ఇంతా కాదు. ఇక నిమజ్జనం రోజు అయితే చెప్పక్కరలేదు, ఎక్కడికక్కడ ట్రాఫిక్కు జాములు. అబ్బ పండగంటే ఇంత హంగామా గొడవ అవసరమా అనిపిస్తుంది. చోటా మోటా నాయకులతో పాటు పది పన్నెండేళ్ల పిల్లలు కూడా ఓ పుస్తకం పట్టుకుని వినాయకచవితి చందాలు అంటూ బయలుదేరతారు. అడుక్కోవటంలో కూడా దౌర్జన్యమే. అసలు ఇక్కడ భక్తి కంటే జనాలు తమ పరపతి, హంగూ, ఆర్భాటాలు చూపించుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. కొన్ని రోజులు పోతే వినాయకుడు నాకీ పండగ వద్దు బాబోయి అని భూలోకం రావటమే మానేస్తాడేమో!!
ఇక నిమజ్జనాల పేరుతో చెరువులని కుంటలని ఎంత కాలుష్యం చేస్తున్నామో! మట్టి విగ్రహాల స్థానంలో ఇప్పుడు ప్లాస్టరు ఆఫ్ పారిసుతో చేసిన విగ్రహాలకి ఎక్కడలేని డిమాండు. ఇక వీటికి వాడే రంగులు రసాయనాల సంగతి చెప్పక్కరలేదు. ఈ రంగులలో ఉండేవి మెర్క్యురి, కాడ్మియం, లెడ్, కార్బన్ మొదలైన హానికర రసాయనాలే. ఇవన్ని చివరికి కలిసేది హైదరాబాదు పట్టణానికి నెక్లేసు అని మనం గొప్పగా చెప్పుకునే హుస్సేనుసాగరులోనే. ఈ సంవత్సరం ఖైరతాబాదు గణేషుడి తయారికి 12 టన్నుల స్టీలు, 1000 సంచుల పైగా ప్లాస్టరు ఆఫ్ పారిసు, 50 కట్టల కొబ్బరినార వాడారంట. కాకపోతే గుడ్డిలో మెల్ల ఏమిటంటే 2007 నుండి ఈ విగ్రహానికి సహజ సిద్ధమైన రంగుల్ని వాడుతున్నారు.
నాణానికి రెండోవైపు కూడా లేకపోలేదు. ఇదే హైదరాబాదులోని ప్రగతినగర్‌లో (కూకట్‌పల్లి దగ్గర) కాలనీ వాళ్ళు ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడికే పూజలు చేస్తారు. The National Green Corps, విజయరాం (ఎమరాల్డు స్వీటు షాపు) లాంటి వాళ్ళు మట్టి విగ్రహాల వాడకం పట్ల జనాలలో అవగాహన కలిగించటానికి తమదైన రీతిలో కృషి చేస్తున్నారు. విజయరాంగారు అయితే నిమజ్జనం బాధ్యతలుకూడా తనే చూసుకుంటారట. వారి స్ఫూర్తితో మనమూ ఆ బాటలోనే పయనిద్దాం.
మట్టి విగ్రహాలని వాడదాం, వాడమని చెపుదాం. మట్టి విగ్రహాలే కాదు, శాశ్వతంగా ఉండే కంచు, ఇత్తడి, రాతి విగ్రహాలు కూడా వాడవచ్చు, నిమజ్జనం చేయకపోతే వినాయకుడు ఏమి బాధపడిపోడు, పైగా ఆ కుళ్ళు కంపు హుస్సేనుసాగరులో తనని ముంచనందుకు సంతోషిస్తాడు కూడా..
7 వ్యాఖ్యలు:
:-)
ప్రతీ ఏడాదీ అనుకుంటున్న విషయమే ఇది. ఈ సారి కాస్త ఎక్కువ ప్రచారం జరిగిందనిపిస్తుంది ఈ సహజ సిద్ధ వినాయకులకు.
ఇక చందాల సంగతి షరా మామూలే! రేపట్నుండీ ఉండే హడావిడిని ఇవ్వాలే రప్పించేశారు, మీరీ టపాతో!
అసలు వినాయకుణ్ణి పూజ తరువాత నిమజ్జనం (విసర్జన) చెయ్యాల్సిన అవసరం ఏముంది? ఇది సామూహిక గణేశ ఉత్సవాలు ప్రబలిన తరువాత చోటు చేసుకున్న పెద్ద మార్పు అనుకుంటాను. ఇది మనం మహరాష్ట్రులనఊంచి అరువు తెచ్చుకుంటే, వాళ్లు ఈ సంస్కృతిని వంగ దేశం నుంచీ ఎరువు తెచ్చుకున్నారు. హైదరాబాదు లో రోడ్డు పక్క (కొండొకచో మీదా, మధ్యలో కూడా) గుళ్లూ, దర్గాలు తామరతంపరగా ఏడాదికేడాది పెరిగిపోతున్నట్టే, ఈ సామూహిక కార్యక్రమాలూనూ! భక్తే, ప్రధాన భావనైనట్లయితే, అది పర్యావరణానికి విఘాతం కలిగించలేదు. ఈ కార్యక్రమాల్లో, వ్యక్తిగత స్థాయిలో ప్రధాన విషయం భక్తి కాదు కాబట్టే ఈ పేచీ!
ఇదివరకీ లడ్డూల గోల లేదు. ఇప్పుడు మరీ వేలం వెర్రి గా ఎగబడి కొనుక్కొంటున్నారు లక్షలు పెట్టీ మరి. ఈరోజు పొద్దున్నే టి.వి లో విన్నా! మా అపార్ట్మెంట్ లడ్డు నేనే 450/- రూపాయలకి కొన్నా అని గర్వంగా చెప్తుంటే ఎందుకో చికాకేసింది. అక్కడెవరో 5 లక్షలకి వేలం పాడారట. జనం ఎలా తయారవుతున్నారో చూడండి. కేవలం లడ్డుకి లక్షలు పెట్టేవాళ్ళు బీదా సాదా కోసం అణపైసా ఖర్చు పెట్టరు. ప్చ్! ఈ జీవనస్రవంతి ఇలా సాగాల్సిందే. ఎవరూ మారరు .. ఎవరూ మార్చలేరు. కొన్నాళ్ళు పోతే ఫలనా లడ్డు మీరెంతకు కొన్నారు అని ఒకళ్ళనొకళ్ళు అడిగే పరిస్థితి వస్తుందేమో, ఈ సందు సందునా ప్రతిష్టించే ఈ వినాయక విగ్రహాల వల్ల వాటి నైవేద్యం లడ్డుల వల్లా . అదో పెద్ద పరువు ప్రతిష్ఠలకి సంభందించిన విషయం అనుకొనేవాళ్ళు తయారవుతున్నారు రాను రాను.
ఏ విగ్రహాలకైతే అనునిత్యం పూజా, నైవేద్యమూ చేసేవారు ఎవరూ ఉండరో వాటిని నిమజ్జనం చేసి తీఱాలి. ఇది రాష్ట్ర ప్రసక్తి లేకుండా హిందువులందఱికీ విధింపబడింది. అలా పూజాపునస్కారాలు లేకుండా అంత పెద్ద పరిమాణంలో విగ్రహాల్ని ఉంచితే అవి సామూహిక బలుల్ని కోరతాయి.
లడ్డూని అమ్మకపోతే మరుసటేడాదికి గణేశోత్సవాలు జరపడానికి డబ్బెక్కణ్ణుంచి వస్తుంది ? లక్షల్లో వసూలు చేద్దామంటే జనం అంత ఇవ్వరు కదా ! అన్నదానాలూ, తొమ్మిది రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలూ జరిపేదెలా ? అలోచించండి.
లడ్డూ ప్రతిష్ఠాత్మకం కాదు. అది స్వామివారి అనుగ్రహానికి చిహ్నం. తమ కష్టార్జితం అంత పెట్టి అది కొనుక్కున్నవారిని స్వామివారు ఇతోధికంగా అనుగ్రహిస్తారని నమ్మకం. నా పరిశీలనలో ఇది నిజం కూడా ! ఆ అనుగ్రహానికి అంత విలువిచ్చేవారుండడం సంతోషకరమే. విలువివ్వనివారంటారా ? అలాంటివారు అన్నికాలాల్లోను, అన్ని దేశాల్లోను ఉంటారు. వారిని ఎంత తక్కువ స్మరిస్తే అంత మంచిది. రమణిగారు దేని గుఱించి ఆందోళన చెందుతున్నారో అర్థం కాలేదు.
తా .ల.బా.సు గారు: నేనేమి ఆందోళన పడడం లేదండి , నా అభిప్రాయం చెప్పాను. వినాయక చతుర్ధి సంధర్భంగా నవరాత్రులు పెద్ద ఎత్తున జరగడానికంటూ , ఓ రెన్నెల్ల ముందు నుండీ చందాలు వసూలు చేస్తూనే ఉంటారు కదా! మరి ఉత్సవాలు జరపడానికంటూ లడ్డూ వేలం వేయడం అదేమి సాంప్రదాయమో నాకర్ధం కావడం లేదు. అదే 5 లక్షలు పెట్టి ఓ బంగారు దేవుని (ఏ దేవుడైనా) ప్రతిమ చేసుకొని ఇంట్లోనే ప్రతిష్టించుకొని దేవుని అనుగ్రహం అనుకొంటూ రోజు అదే లడ్డు చేసుకొని నైవేద్యం పెట్టి ప్రసాదంలా తీసుకోవచ్చుగా. ఆ రోజో ఆ మరురోజో తింటే కాని కుదరని లడ్డు కి 5 లక్షలు ఖర్చుపెట్టడం అంటే ఎమో! నాకంత గొప్పగా అనిపించడంలేదు. ఇంకోటి కలియుగ దైవం కోరిన కోర్కెలు తీర్చే దైవం అనే తిరుపతి వెంకటేశ్వరుడు లడ్డు విలువ పడిపోయిందంటారా ఇక్కడ? లేదా ఇంకా ఆయన అనుగ్రహం కలగలేదంటారా? ఇవన్నీ తర్కానికి అందనివండి. భక్తి ఉండడం మంచిదే శృతిమించిన భక్తి కష్టమే.
మీ బ్లాగు ము౦దు చూడలేదు. ఒకే లేబుల్ వల్ల ఈ టపా కూడా చూసాను.
మీ ప్రశ్న కి తాడేపల్లి గారు చక్కగా వివరణ ఇచ్చారు.
వినాయక నిమజ్జన౦ అన్నది మన స౦స్కృతి లో భాగ౦ కదా.ఇక వీధికో విగ్రహ౦ అ౦టారా. అభిరుచి కి తగ్గట్టు గా ఎవరి అభిమాన౦ వారు చాటుకు౦టారు. ఎవరిని కాదనగలము. ఇబ్బ౦దులు ఎక్కువైనపుడు జనమే ఆలోచనలో పడతారు. :-)
Post a Comment