పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

July 26, 2011

గూడు చినబోయెరా!

Home is a place you grow up wanting to leave, and grow old wanting to get back to.

ఉదయం ఏడుగంటలకి కాళ్లు అప్రయత్నంగా మంచం దగ్గరికి లాక్కెళతాయి..పెదాలు..ఇక లే నాన్నా టైము ఏడవుతుంది..కాలేజికి టైమవుతుంది అనబోతాయి..ఎదురుగా ఖాళీ మంచం వెక్కిరిస్తూ కనపడుతుంది..కళ్లల్లో అప్రయత్నంగా నీళ్లు..చ.. ఇంత బేలనవుతన్నానేంటి అని నన్ను నేనే మందలించుకుని..నిగ్రహించుకుని....ఇంట్లో ఏ గదిలోకి వెళ్ళినా వాడిది ఏదో ఒక వస్తువు..అలమారలో బట్టలు...PS2, Ipod, హెడ్డుఫోన్సు,  అన్నీ వాడిని అనుక్షణం గుర్తు చేస్తూ ఉంటే  వాస్తవాన్ని మెల్లమెల్లగా జీర్ణించుకుంటున్నా! ఎక్కడో 2500 కి.మీ దూరాన ఉన్నాడనుకుంటే మరీ దిగులుగా ఉంటుంది.

మా అబ్బాయిని IIT గౌహతికి పంపించినప్పటినుండి నా పరిస్థితి ఇది.  వాడు వెళ్ళి వారం కూడా కాలేదు..ఏంటో కొన్ని యుగాలయినట్టుంది. 

నేనూ డిగ్రీనుండి హాస్టలులోనే ఉండి చదువుకున్నా.  అప్పట్లో మా అమ్మ ఇంత బెంగపడలేదే! నాకూ ఇంటి మీద అంత బెంగ ఉండేది కాదు.  మా ఊరినుండి పట్టుమని అరగంట ప్రయాణం కూడా ఉండదు మా కాలేజికి..వారం వారం వచ్చేసేదాన్ని ఇంటికి.  అయినా ఆ రోజుల్లో మా అమ్మకి అంత బెంగపడే సమయం కూడా ఉండేది కాదేమో! ఇంటినిండా మనుషులు..పనివాళ్ళు..పొలం పనులు..ఊర్లోనే అమ్మా. నాన్నా. అక్కాచెల్లెళ్లు. తమ్ముళ్లు ఇంక బెంగెందుకుంటుంది!

ఇప్పుడేమో ఇంట్లో ఉండేదే ముగ్గురమో..నలుగురమో..అందులో ఒకళ్లు దూరంగా వెళితే..ఇల్లంతా ఖాళీ..ఖాళీగా కనపడుతుంది. సెలవల్లో మా పిల్లల్ని ఇంటికి పంపించి రెండో రోజునుండి వాళ్ళ మీద బెంగపెట్టేసుకుని  ఎప్పుడొస్తారా అని ఎదురుచూసేదాన్ని.  ఇప్పుడు నాలుగు సంవత్సరాలంటే..తలుచుకుంటే దిగులు ఇంకా ఎక్కువవుతుంది.

ఈ నాలుగు సంవత్సరాలనేముందిలే పిల్లలు ఎదుగుతున్న కొద్దీ పిల్లలకి మనకీ ఒక్కో అడుగు దూరం పెరిగిపోతూ ఉంటుంది అనిపిస్తుంది నాకు..మగపిల్లలయితే మరీనూ!


మరీ ఒకటో తరగతి నుండో... ఆరో తరగతినుండో పిల్లలని హాస్టలులో ఉంచేవాళ్ళు ఎలా ఉంచుతారా అనిపిస్తుంది!  పెద్ద చదువులకి వచ్చాక ఎటూ తప్పదు కదా!

19 వ్యాఖ్యలు:

Sravya V July 26, 2011 at 3:19 PM  

నా పరిస్థితి ఇది. వాడు వెళ్ళి వారం కూడా కాలేదు..ఏంటో కొన్ని యుగాలయినట్టుంది.
---------------------

హ్మ్ ! అయ్యో మీరే ఇంత దిగులు పడితే మీ అబ్బాయి :(((

అయితే IIT గౌహతి లో వచ్చిందా సీట్ Congrats for that !

రాజేష్ జి July 26, 2011 at 3:45 PM  

$సిరిసిరిమువ్వ గారు

హ్మ్..శీర్షికపేరుతోనే మీరు గుండెని పిండేశారు.ఆహ్.. మీ బాధని అర్ధం చేసుకోగలను. ఇహ దూరం తప్పదేమో! మీ అబ్బాయి గది మూసేయండి.బ్లాగు/బజ్జుల మీద లగ్నం చేయండి..కొంత ఉపశమనం లభించవచ్చు.

IIT లో చేరిని మీ అబ్బాయికి అభినందనలు.

Anonymous,  July 26, 2011 at 3:50 PM  

వరూధిని గారు మీ బాధని నేను బాగా అర్ధం చేసుకోగలను.
మా వాడిని ఏడవ తరగతిలోనే హాస్టల్ లో వెయ్యాల్సివచ్చింది. పిల్లలిద్దరూ వుండగా అదో సందడి .సాయంత్రం అయ్యేసరికి గూట్లో పక్షుల సందడిచేసినట్టూ పోట్లాటలు, చాడీలు, నవ్వులు, గెంతులు ఎంత హడావిడో . ఇప్పుడవన్నీ ఏం లేవు మా పాప ఒక్కతే అయిపోయి , తనపనేదో తాను చేసుకుపోతుంది . కామ్మ్ గా తెల్లారుతుంది. ఇంకా కామ్మ్ గా పొద్దుపోతుంది .

Ravi July 26, 2011 at 4:27 PM  

ముందుగా మీ అబ్బాయి విజయానికి అభినందనలు.
మీ లాగా దిగులు పడే వాళ్ళకోసమే ఈ ఆదివారం ఈనాడు లో ఓ వ్యాసం రాశారు ఓసారి చదవండి.
ఐఐటీ లో చదువంటే ఎలా ఉంటుందో మనకు కొన్ని విషయాలు తెలుసు. మీ అబ్బాయి దాని ఒత్తిడికి లోనవకుండా ఉండాలంటే ఫోన్ లో బాగా మాట్లాడుతూ ఉండండి. అక్కడ తన మనసుకు కష్టం కలిగేలా ఏం జరిగినా దాని గురించి చెప్పమనండి. అలా ఉంటే మీకు, మీ అబ్బాయికి దగ్గరున్న అనుభూతి ఉంటుంది.

లత July 26, 2011 at 4:46 PM  

ఐ.ఐ.టి లో చేరినందుకు మీ బాబుకు అభినందనలు
దిగులు తప్పదండి మెల్లగా అలవాటు పడతాము

Sravya V July 26, 2011 at 6:27 PM  

ఇంతకీ చదువరి గారు కూడా ఇదే దిగుల్లో ఉన్నారా ఏంటండి, ఎక్కడా కనపడటం లేదు :(

మాలా కుమార్ July 26, 2011 at 6:30 PM  

మీ బాబు iit లో చేరి నందుకు కంగ్రాట్స్ అండి .

వేణూశ్రీకాంత్ July 26, 2011 at 6:54 PM  

ముందుగా మీ బాబుకు అభినందనలు..
టపా శీర్షికతోనే కదిలించేశారండి మొదటి పేరా చదివాక నేను మొదట హాస్టల్ కి వెళ్లినపుడు అమ్మ చెప్పిన కబుర్లు గుర్తొచ్చాయ్.. కానీ అందరూ అన్నట్లు తప్పదు కదండీ పిల్లల అభివృద్ధికోసం ప్రతి తల్లిదండ్రులకు తప్పని బాధ ఇది. ఐనా ఆ దూరం మనుషుల మధ్యే కానీ మనసుల మధ్య కాదు కదండీ.. ఇద్దరికీ కాస్త అలవాటయ్యేవరకూ తరచుగా మాట్లాడుతూ ఉండండి.. పైగా అమ్మానన్నల నీడన కాక స్వంతంగా హాస్టల్ లో ఉండటం ఇండివిడ్యువాలిటీని ఎలాంటి పరిస్థితులనైన తట్టుకునే తత్వాన్ని ఇంకా బోలెడు పాఠాలను నేర్పుతాయి కనుక అలా ఆలోచిస్తే కాస్త ఊరట చెందవచ్చు.
కుటుంబమంతా ఉన్న ఊరు వదలలేక ఉన్నచోట మంచి చదువు దొరకక తప్పని సరి ఐతేనే కదండీ పెద్ద చదువులకైనా హైస్కూల్ చదువులకైనా పిల్లలు ఇల్లు వదిలి ఉండాల్సి వచ్చేది. ఇంకా సెల్ ఫోన్లు, వీడియో చాటింగ్ లు లాంటి ఆధునిక వసతులున్న ఈ రోజుల్లో ఇలా ఉండటం ఒకప్పటితో పోలిస్తే నయమేనండి.
హ్మ్ ఏమైనా బయటనుండి ఇలా కబుర్లు చెప్పడం సులువే అనుకోండి..

సిరిసిరిమువ్వ July 26, 2011 at 9:28 PM  

జ్యోతి గారూ..అవునండి.

శ్రావ్యా..థాంక్యూ! చదువరి గారు వాడితో బాటు గౌహతి వెళ్ళారు.అదీ సంగతి:)

రాజేష్ గారూ..థాంక్సండీ! బ్లాగు/బజ్జుల మీద లగ్నం చేయండి..అహ్హాహ.అంత అవసరం లేదులేండి.

లలిత గారూ..నిజమండి..పిల్లలు ఎదురుగా ఉంటే ఎంత పోట్లాడుకుంటారో కదా! మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. సందడే లేదు.

సిరిసిరిమువ్వ July 26, 2011 at 9:33 PM  

కొత్తపాళీ గారూ..:(

రవిచంద్ర..బాగున్నారా?బెంగుళూరు వెళ్లాక మీరు ఎక్కడా కనపడటం లేదు. నా బెంగ నాలోనే ఉంచుకుంటానండి..మా వాడి దగ్గర బయటపడను.రోజుకొక పదిసార్లు అన్నా ఫోనులో మాట్లాడుతున్నా! వాడు బాగానే ఉన్నాడులేండి.

లత గారూ..ధన్యవాదాలు. ఈ ఎడబాటు మీకు కూడా అనుభవమే కదా!

సిరిసిరిమువ్వ July 26, 2011 at 9:37 PM  

మాలా గారూ..ధన్యవాదాలు.

వేణూ..నిజమే ఇవన్నీ తప్పని పరిస్థితులు. వెనకటి రోజులతో పోల్చుకుంటే చాలా నయం. భౌతికంగా దూరంగా ఉన్నా సెల్లు ఫోన్ల పుణ్యమా అని దగ్గరగానే ఉంటున్నాం..అయినా తల్లి మనసు కదా..తల్లడిల్లుతుంటుంది!

MURALI July 26, 2011 at 10:30 PM  

ముందుగా మీ బాబుకి అభినందనలు. కాస్తో కూస్తో ఈ సెల్‌ఫోన్లు వచ్చాక కొంచెం నయం. రోజూ ఫోను చేస్తూ ఉండండి. తనకీ దిగులు, ఒత్తిడి తగ్గుతాయి.

శ్రీలలిత July 26, 2011 at 10:51 PM  

వరూధినిగారూ,
మీ బాబు పైచదువులకోసం IIT కి వెళ్ళాడంటే భవిష్యత్తులో కట్టుకునే సౌధంలో మొదటిమెట్టు ఎక్కినట్టే.
మీ చేయి అందినంతవరకూ అతనికి వెన్నుగా నిలబడండి. చూడండి.. చూస్తూండగానే మీ అబ్బాయి ఉన్నతవిద్య లభ్యసించి మీకు ఆనందం తెస్తాడు.
భగవంతుడు అతనికి అన్నివిధాలా తోడ్పడాలని ఆశిస్తూ..
అభినందనలతో,
శ్రీలలిత..

Rajendra Devarapalli July 26, 2011 at 11:38 PM  

బాగుందండి,మంచి సమాచారం.సరే నేను చెప్పేది కూడా వినండి.మావాడొకడికి గౌహతి(గవహతి అనాలేమో కదా?)యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసరు ఉద్యోగం వస్తే జాయినింగ్ రిపోర్టు ఇవ్వటానికి వెళ్ళి చేరకుండానే..చెప్పా చెయ్యకుండా పారిపోయొచ్చాడు,పైగా కొద్దిరోజుల్లో వాళ్ళావిడకు అక్కడ ఒక పెద్దస్కూలులో మంచి ఉద్యోగం సిద్ధంగా ఉందికూడా.
దీన్నిబట్టి చూస్తే తెలీటంలా మీ అబ్బాయి,ఇంకాఅలాంటి వందలమంది పిల్లలు ఎంతహీరోలో:)

సిరిసిరిమువ్వ July 27, 2011 at 5:39 AM  

శ్రీలలిత గారూ, మీ ఆశీర్వచనాలకి ధన్యవాదాలు.

రాజేంద్ర గారూ..అవును కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. మా ఫ్రెండు M.Sc లో కూడా ఇంటి మీద బెంగతో రోజూ ఏడ్చేది. మా పిల్లలు నిజంగానే హీరోలేనండి.

మురళి July 29, 2011 at 5:04 PM  

"ముందుగా ప్రతిష్టాత్మకమైన సంస్థలో సీటు సంపాదించినందుకు మీ అబ్బాయికి అభినందనలు.. తల్లిదండ్రులందరికీ తప్పని ఫేజ్ అండీ ఇది.. మీకే అలవాటైపోతుంది, కొద్ది రోజులకి.. " ....ఇది నేను రెండు రోజుల క్రితం ఇక్కడ పోస్ట్ చేసిన వ్యాఖ్య.. రాలేదండీ ఎందుకనో..

Maina August 14, 2011 at 9:57 PM  

sakhi,

mana iddaram reeommates gaa vundi M.sc lo kooda ekki ekki edustunte nuvvu odaarchi ekkirinchina kshaname gurtuku vastundi

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP