పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 24, 2008

వక్కపలుకులు-2

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో మొదటిసారిగా పెట్టిన e-తెలుగు స్టాలు అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి కృషి చేస్తుంది. కార్యక్రమం చాలా ధూం ధాం గా జరుగుతుంది. మరి అక్కడికి వెళ్లలేని వారు కనీసం అ కబుర్లు అయినా వింటున్నారా?

హైదరాబాదు పబ్లిక్ స్కూల్ 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబరు 25 నుండి 27 వరకు మూడురోజుల పాటు ఉత్సవాలు జరుపబోతున్నారు. మన బ్లాగర్లలో HPS పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు.

ఒబామా మానియా: ఒబామా కొరికి వదిలివేసిన కేకు ముక్కకి వేలం వేయబోతున్నారు, ప్రారంభ ధర $ 20,000 మాత్రమే. ఏమిటో ఈ పిచ్చి. ఈబేలో ఒబామా వాడిన వస్తువులకి ప్రస్తుతం విపరీతమైన డిమాండు. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఈబే సంస్థ ఒబామా వాడిన 1,11,546 వస్తువులని వేలం వేసిందట. అంటే ఆయన వాడిన టూత్ బ్రష్, ఖాళీ అయిన షూ పాలిషు డబ్బా దగ్గరనుండి టిస్యూ పేపర్ల వరకు వేటిని వదలకుండా వేలం వేసుంటారు. ఈయనకి గారాజ్ అమ్మకాలు పెట్టే అలవాటు లేదేమో మరి!

పోయినేడాది అన్నగారు (ముఖేష్ అంబాని) తన భార్యకి పుట్టినరోజు కానుకగా 250 కోట్లు విలువ చేసే జెట్ విమానాన్ని కొనిస్తే, నేడు తమ్ముడు (అనిల్ అంబాని) తన భార్యకి నూతన సంవత్సర కానుకగా 400 కోట్లు ఖర్చు పెట్టి ఓ పడవని కొనేసాడట. వ్యాపారంలోనే కాదు ప్రేమని ప్రదర్శించటంలో కూడా పోటీ అన్నమాట.

లండనులో పెంపుడు కుక్కలని వీధుల్లో వదిలేసేవారి సంఖ్య రాను రాను పెరిగిపోతుందట, దీనితో కుక్కల సంరక్షణ కేంద్రాలకి తలనెప్పి అయిపోయిందట. దానికి యజమానులు చెప్పే కారణాలు- మా తివాచీకి రంగుకి మాచ్ అవ్వటంలేదు, మా సోఫాకి మాచ్ అవ్వటంలేదు, లేకపోతే దాని రంగు మా ఇంటి రంగుతో కలవటంలేదు-ఇలాంటి కారణాలట! హతవిధీ!! ఇది కూడా ఆర్థికమాంద్యం ప్రభావమేనని అభిజ్ఞవర్గాల భోగట్టా!

చందా కొచ్చర్ ICICI బ్యాంకుకి నుతన CEO గా నియమితులయ్యారు. ఓ స్త్రీ ఈ స్థాయికి చేరటం చాలా గొప్ప విషయం.

ఇకనుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలలో 27 నుండి 30మార్కులు వస్తే ఆ విద్యార్థుల జవాబు పత్రాలని మరలా పరిశీలిస్తారట, అవసరం అయితే మళ్లీ పరిక్ష నిర్వహిస్తారట. అసలు ఇంటరు ప్రాక్టికల్సు తూ..తూ మంత్రమే అన్నది జగమెరిగిన సత్యం! ఏంటో రోజుకొక కొత్త వింత రూలు పెడుతుంటారు ఈ ఇంటరు బోర్డు వారు.

2009 మార్చి నాటికి గూగుల్ ఎర్తుకి పోటీగా ధీటుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వారి భువన్ రాబోతుంది.

అన్నట్లు ఇస్రో వాళ్లు ఈ మధ్య తొలిసారిగా ఓ విదేశీ సంస్థ కోసం వాణిజ్య ఉపగ్రహాన్ని ఒకదాన్ని విజయవంతంగా ప్రయోగించారు అంతే కాదు ఆదిత్య పేరుతో సూర్యుడి మీదకి ఓ ఉపగ్రహాన్ని త్వరలోనే పంపించబోతున్నారు. జయహో ఇస్రో!

మళ్లీ కొత్త సంవత్సరంలో కలుద్దాం, అంతవరకు సెలవు.

9 వ్యాఖ్యలు:

నేస్తం December 25, 2008 at 10:49 AM  

abboo bale vishayaalu cheppaaru :)

Kottapali December 25, 2008 at 9:55 PM  

మొత్తంగా తాంబూలమీయకుండా (అంటే మమ్మల్ని తన్నుకు చావమని వొదిలెయ్యకుండా) మా పళ్ళకి చురుకు కలిగించే వక్క పలుకుల్తో సరిపెడుతున్నారన్న మాట! బాగున్నై :)

ఓ బ్రమ్మీ December 27, 2008 at 11:08 AM  

ఏమిటండీ.. కొత్త సంవత్సరం వరకూ మరో పుట ప్రచురించకూడదని మడి గట్టుకుని కూర్చోవడం ఏమాత్రం క్షమార్హం కాదు. ఏదో బాగా వ్రాస్తున్నారు కదా అని సంతోషిస్తోంటే, ఆఖరుగా ఇదేమి ఫిట్టింగ్?

అది సరే కానీయండీ, హైదరాబద్ పబ్లిక్ స్కూల్ గురించి వ్రాసారు. ఈ విషయం గురించి అక్కడ తగిలించిన బ్యానర్ చూసి వ్రాసారా? లేక తమరు కూడా ఆ పాఠశాల పూర్వ విద్యార్దులేనా?

Dr.Pen December 27, 2008 at 12:15 PM  

@ కొత్తపాళీ...'తాంబూల'సేవనానికే కాబోలు గురువు గారు 'మంచు తుఫాను'లకు దూరంగా 'వెచ్చని ఫ్లోరిడా'లో మకాం వేసింది:-) కబుర్లు కూడా కొత్త సంవత్సరానికేనా???

@సిసిము గారు...'వక్కపలుకులు' బాగున్నై!

Bolloju Baba December 27, 2008 at 1:17 PM  

"ఏంటో రోజుకొక కొత్త వింత రూలు పెడుతుంటారు "

ఎందుకంటే, ఇంటర్ మార్క్స్ వైటేజ్ ఇవ్వనున్నారుగా అందుకన్న మాట.
ఏమిటో ఏదైనా చేసినా తప్పే, చెయ్యకపోయినా తప్పేలాగ ఉంది.
సరదాగా

సిరిసిరిమువ్వ December 27, 2008 at 1:27 PM  

@చక్రవర్తి గారు, "మళ్లీ కొత్త సంవత్సరంలో కలుద్దాం, అంతవరకు సెలవు"--ఇది వక్కపలుకులు వరకే :) అయినా కొత్త సంవత్సరం ఇంకెంతో దూరంలో లేదు కదా!!
హైదరాబద్ పబ్లిక్ స్కూల్ గురించి:-పేపరులో చూసానండి.
@ఇస్మాయిల్ గారు,:)
@బాబా గారు, "ఇంటర్ మార్క్స్ వైటేజ్", వెయిటేజ్ ఇవ్వాలి, కాని అంతకు ముందు అందులో ఉన్న లూప్ హోల్సు అన్ని మూయాలి. అలాగే ప్రాక్టికల్సు కూడా ఖచ్చితంగా చేయించి అప్పుడు ఖచ్చితమైన పరీక్షలు పెట్టాలి కదా!

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP