పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

April 17, 2007

ప్రయాణంలో పదనిసలు

రైలులో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కోసారి వింతైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. మచ్చుకి ఒకటి రెండు.

ఒకసారి నేను విశాఖపట్టణం నుండి ఈస్ట్ కోస్ట్ ఎక్సుప్రెస్ కి హైదరాబాదు వస్తున్నాను. రైలు ఎక్కి అంతా సర్దుకుని కూర్చున్నాక ఒకతను వచ్చి క్షమించాలి ఇది నా సీటండి అన్నాడు. నేను బిత్తరపోయి నా టికెట్ తీసి చూసాను, అదే పెట్టె అదే సీటు నంబరు, నేను సరిగ్గానే కూర్చున్నానే అనుకుంటూ అతని టిక్కెట్ చూపించమన్నాను, అతనిది కూడా అదే పెట్టె అదే నంబరు. ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలా. రైల్వే వాళ్ళు కూడా సినిమహాళ్ళ వాళ్ళ లాగా ఒక సీటే ఇద్దరు ముగ్గురికి రిజర్వు చేస్తున్నారా ఏంటి అనుకున్నాను. ఎక్కడ పొరపాటు జరిగి వుంటుందా అని ఇంకొక సారి అతని టిక్కెట్ నా టిక్కెట్ పరీక్షగా చూసాను. అసలు సంగతి ఏమిటంటే అతనిది ముందురోజుకి రిజర్వేషన్. పాపం ఆ సంగతి చెప్పాక అతను సారీ సారీ అనుకుంటూ దిగిపోయాడు. రైల్వే టైము అర్థరాత్రి 12 గంటల తరువాత మరుసటి రోజుకి మారిపోతుంది. దానితో వచ్చిన తిప్పలు ఇవన్నీ. కొత్తవారికి కొంచం తికమకగానే వుంటుంది. మనకేమో తెల్లావారితే కాని మరుసటి రోజు అయినట్లు లెక్క కాదు కదా.

ఈ మధ్య తిరుపతి వెళ్ళుతున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. నారాయణాద్రి రైలు తెనాలి వెళ్ళేటప్పటికి సరిగా 12:02 నిమిషాలు అయ్యింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు మా పెట్టె లోకి ఎక్కి సీటు నంబర్లు వెతుక్కుంటూ వచ్చారు. ఓ సీటు దగ్గిర ఆగి అక్కడ వాళ్ళని లేపటం మొదలుపెట్టారు. వాళ్ళేమో మంచి నిద్రలో వున్నారు. ఎలాగో చివరికి విసుక్కుంటూ లేచారు. తెనాలిలో ఎక్కిన వాళ్ళు ఇవి మా సీటులండి అని వాళ్ళ సామాను పెట్టేసుకుంటున్నారు. అప్పటికే ఆ సీట్లలో కూర్చున్నవాళ్ళకి ఒక్క నిమిషం ఏమి అర్థం కాలా. అసలే మంచి నిద్రలో లేచారేమో ఒక్కసారిగా తెనాలిలో ఎక్కిన వాళ్ళ మీద పడిపోయారు, మీవేంటండి, మేము హైదరాబాదు నుండి వస్తుంటే, ఏం తమాషాగా వుందా అని. ఇద్దరు కాసేపు వాదులాడుకున్నాక టికెట్స్ తీసి చూసుకున్నారు, ఇద్దరివి ఓకే పెట్టె, ఒకే సీటు నంబర్లు. అంతలోకి టిసి వచ్చాడు, ఏమిటి గొడవ అంటూ. అతను వచ్చి చూసి, తెనాలిలో ఎక్కిన వాళ్ళని మీరు తరువాత స్టేషనులో దిగిపోండి, ఇవి నిన్నటికి రిజర్వేషను చేయించుకున్నవి అని చల్లగా చెప్పాడు. అప్పుడు చూడాలి వాళ్ళ ముఖాలు!!!

10 వ్యాఖ్యలు:

వెంకట రమణ April 17, 2007 at 10:57 PM  

మా స్నేహితుడోకసారి, ఇంటర్వ్యూకెల్లడానికని హడావుడిగా టికెట్టు బుక్ చేసుకొన్నాడు. తీరా రైలెక్కిన తరువాత చూస్తే ఆసీటులో వేరే అతనున్నాడు. రెండు టిక్కెట్లలో తేదీ కూడా ఒకటే ఉండటంతో ఇద్దరూ చాలా ఆశ్చర్యపడ్డారు. తరువాత టిక్కెట్లు రెండూ పక్కన పెట్టి పరిశీలించి చూస్తే, మా స్నేహితుడు తరువాతి నెలలో అదే రోజుకు టిక్కెట్టు తీసుకున్నాడని అర్థమయింది :).

వెంకట రమణ April 17, 2007 at 10:59 PM  

మీ బ్లాగు ఈ రంగుల కలయిక(color combination)లో చదవడానికి కష్టంగా అనిపిస్తోంది. వీలయితే కొంచం మార్చండి.

రానారె April 18, 2007 at 2:18 AM  

ఇంతవరకూ నేను చేసిన రైలుప్రయాణాల సంఖ్య పది లోపే. అయినా "మాకూ ఉన్నాయి స్వగతాలు."

వెంకట రమణ April 18, 2007 at 11:44 AM  

బ్యాక్‌గ్రౌండు రంగు మార్చినందుకు ధన్యవాదములు. ఇప్పుడు చదవడానికి బాగుంది.

సిరిసిరిమువ్వ April 18, 2007 at 1:22 PM  

వెంకట రమణ గారూ
నా బ్లాగు బ్యాక్‌గ్రౌండు రంగు ఎలా మారుతుందో నాకు అర్థం కావటం లేదండి. నేను ఒరిజినల్ గా పెట్టింది తెలుపు మీద నలుపు అక్షరాలు, కానీ అది వున్నట్లుండి అంతా బ్లూ అయిపోతుంటుంది. నేను ఈ ప్రాబ్లం నా సిస్టం లోనే కనపడుతుందేమో అనుకున్నాను ఇన్నాళ్ళు. అప్పుడప్పుడు మిగతావాళ్ళకి కూడ అలానే కనిపిస్తుందన్నమాట. మీరు తరువాత బాగుందన్నారు చూడండి అదే అసలు బ్యాక్‌గ్రౌండు. ఈ సమస్యకు నిపుణులు ఎవరైనా పరిష్కారం చెపితే సంతోషిస్తాను. ముందుగా ధన్యవాదములు.

వెంకట రమణ April 18, 2007 at 1:56 PM  

రాత్రి ఇంటి వద్దనుండి చూసినప్పుడు బ్లూగా కనపడింది అందుకే ఆవ్యాఖ్య చేశాను. ఇప్పుడు ఆఫీసులో బాగానే కనపడుతుంది. బహుశా ఇంటి దగ్గర నెట్ కనెక్షన్ కొంచెం స్లో అవడం వల్ల, బ్లాగు పూర్తిగా లోడు అవలేదనుకుంటా. ఆఫీసులోకూడా ఇప్పుడొకసారి రీలోడు చేస్తే ముందు అంతా బ్లూలోనికి మారి తరువాత కొంచంసేపటికి మాములయింది.

బ్లూగా కనిపించినప్పుడు ఒకసారి రీప్రెష్ చేస్తే సరిపోతుందేమో. ఇంటిదగ్గర ఒకసారి ప్రయత్నించి చూస్తాను.

spandana April 18, 2007 at 7:55 PM  

ఇంకెప్పుడైనా టికెట్ ఒకటికి రెండుసార్లు చూసుకోవాలన్నమాట.

--ప్రసాద్
http://blog.charasala.com

రాధిక April 19, 2007 at 3:46 AM  

మావారి కొలీగ్ ఒకాయన విమాన టికెట్ చూసి ఇలానే బ్రమపడి పాపం విమానం మిస్స్ అయ్యారు.అది టికెట్ లో ప్రోబ్లం కాదులెండి.ఏఎం,పీఎం ల కంఫ్యుషన్ వల్ల పాపం అలా జరిగింది.నాకూ ఇప్పటికీ ఈ విషయం లో చాలా సందిగ్దత వుంది.

కొత్త పాళీ April 19, 2007 at 6:14 PM  

ఇదే సమ స్య తెలుగు వారి పెళ్ళిళ్ళకి కూడా వర్తిస్తుంది అర్థ రాత్రి ముహూర్తాలతో. అందుకనే శుభలేఖల్లో "తెల్లవారితే గురువారం" అని వేస్తారు. నేనూ నా స్నేహితుడూ వాళ్ళ పెదనాన్న కొడుకు పెళ్ళికి పొద్దున ఐపోయిన పెళ్ళికి సాయంత్రం అనుకుని హాజరయ్యాము.

కొత్త పాళీ April 23, 2007 at 11:15 PM  

మీ పుస్తక దినోత్సవం టపాలో వ్యాఖ్యలకి లంకె కనబడక ఇక్కడ రాస్తున్నాను.
మంచి విషయం లేవనెత్తారు, పాత లంకెలతో సహా. ఫిక్షనా, నాన్ - ఫిక్షనా అని త్రివిక్రముడు కూడా ఒకసారి అవీ-ఇవీలో బ్లాగినారు.
2004 సంవత్సరంలో మిర్యాలగూడా దగ్గర ఒక పల్లెటూరి జిల్లాపరిషద్ హైస్కూలుకి వెళ్ళినప్పుడు అక్కడ పదో క్లాసు పిల్లల్తో ముచ్చటిస్తూ - మీ క్లాసు పుస్తకం కాని పుస్తకం ఏదన్నా చదివారా అనడిగాను. సుమారు యాభై మంది పిల్లల్లో ఒక్క పిల్లాడు ఒక సారి స్వాతి మాసపత్రిక కొద్దిగా చదివా నన్నాడు. ఘోరం అనిపించింది. వెంటనే మిర్యాలగూడాలో కలాం గారు పిల్లలనుద్దేశించి రాసిన పుస్తకం ఓ పది కాపీలు కొని ఆ బడికి బహుకరించాను హైస్కూలు క్లాసులతో చదివించమని.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP