పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

April 1, 2012

ఏం వైభోగం మా రామయ్యది!

 శ్రీరామ నవమి, హనుమ జయంతి మా ఊరి గుడిలో బాగా చేసే పండగలు.  మధ్యలో కొన్నాళ్ళు హడావిడి తగ్గినా గత ఏడెనిమిది సంవత్సరాల నుండి మళ్ళీ బాగా చేస్తున్నారు.

ఊరందరినీ ఓ చోట కలిపే ఈ రెండు పండగలంటే అంటే నాకెందుకో ప్రత్యేక ఇష్టం.

మా ఊరి కళ్యాణ రామయ్య
ముఖ్యంగా శ్రీ రామ నవమి నాడు ఎక్కడెక్కడో ఉన్న మా ఊరి అబ్బాయిలు .. అమ్మాయిలు తరలి వస్తారు...వాళ్ళ అదృష్టానికి ఆనందపడుతూ నేను వెళ్ళలేకపోతున్నందుకు బాధ పడుతూ ఉంటాను.  ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం ఒకసారి వెళ్ళాను.


రాములోరి పెళ్ళి పందిరిలో వేదమంత్రాల మధ్య రాములోరి కళ్యాణం జరుగుతుంటే కలుసుకునే  స్నేహాలు కలబోసుకునే జ్ఞాపకాలు...ఏమ్మా బాగున్నావా .. పిల్లలేం చేస్తున్నారు అనే పలకరింపులు...కొత్త కోడళ్ళ పరిచయాలు...మధ్య మధ్యలో  మాట్లాడకండర్రా అనే పెద్దల మందలింపుల మధ్య..అయ్యో అప్పుడే కళ్యాణం అయిపోయిందా!



ఓ పక్క పెద్ద పెద్ద గాబుల నిండా.. గంగాళాల నిండా పానకం....ఇంకో పక్క కొబ్బరి.వడపప్పు ప్రసాదాలు..ఆ పానకం రుచే వేరుగా ఉంటుంది.....గుడి ధర్మకర్తలు మా అమ్మమ్మ వాళ్లే కాబట్టి మాకు కాస్త స్పెషల్ ట్రీట్మెంటు ఉంటుంది. ఇంటికి పానకం..వడపప్పు వస్తాయి.

మా చిన్నప్పుడయితే పందిట్లో ఓ పక్క భజనలు జరుగుతుంటే ఇంకో పక్క మా నాయనమ్మ వాళ్ళు రంగులు..పానకం...పేడ నీళ్ళు చల్లుకుంటూ పిల్లలకన్నా ఎక్కువ సందడి చేసేవాళ్ళు.  ఇప్పుడు అంతా యువకుల సందడే!


ఈ సంవత్సరం అయితే నాలుగు జంటలు పీటల మీద కూర్చుని రాములోరికి తలంబ్రాలు పోస్తున్నారట! అందరూ వేరే ఊర్లల్లో ఉండేవాళ్ళే!

సాయంత్రం రాములోరి ఊరేగింపు ఎంత కనుల పండుగగా ఉంటుందో...రథం మీద ఊరేగుతూ ఇంటింటి ముందు ఆగుతూ..హారతులందుకుంటూ..ఏం వైభోగం మా రామయ్యది!

అందరికి శ్రీరామనవమి శుబాకాంక్షలు!

Read more...

March 8, 2012

వెలలేని మా ఖజానా...

హైదరాబాదులోని నౌబత్ పహాడ్ కింద ఖజానా ఉందో లేదో కానీ అంతకన్నా విలువైన ఖజానా మా  ఇనప్పెట్టెలో ఉండిపోయింది ఇన్నాళ్లు. ఈ ఖజానాని వెలికితీయటానికి స్పూర్తినిచ్చిన వంశీ గారికి ధన్యవాదాలు. ఇనప్పెట్టెలో భద్రంగా ఉన్న వీటిని అప్పుడప్పుడు తీసి చూసుకుంటూ ఉంటాం కానీ ఇలా వెలికితీయాలన్న ఆలోచన వంశీ గారి టపా చూసాకే కలిగింది.

చిన్ననాటి వస్తువులు, ఉత్తరాలు, స్నేహితులు, పరిసరాలు, జ్ఞాపకాలు...ఏవైనా మనకి అపురూపమే. కొన్నిటిని తలుచుకుంటూ...కొన్నిటిని చూసుకుంటూ...."గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్" అనుకుంటూ ..

ఎప్పుడో క్లాసులో టీచరు "congratulations" అంటూ చక్కగా అక్షరాలు చెక్కి ఇచ్చిన చాక్ పీసుని ఇప్పటికీ భద్రంగా దాచుకున్న నేను...

ఏంటో నా ఈ పిచ్చి..నాలాంటి పిచ్చోళ్ళు అసలుంటారా అనుకుంటుండే దాన్ని... కానీ బ్లాగుల్లోకి వచ్చాక తెలిసింది నాలాంటోళ్లు చాలామందే ఉన్నారని. ముఖ్యంగా వంశీ గారి ఖజానాలు చూస్తుంటే నాకు నన్ను నేను చూసుకుంటున్నట్టే ఉంటుంది.  ఆయనవి తరగని ఖజానాలనుకోండి!

చిన్నప్పుడు మా నాయనమ్మకి రాత్రి పూట కాళ్ళు వత్తితే నాకూ ..మా అన్నయ్యకి రోజూ చెరొక ఐదు పైసలు ఇచ్చేది..తర్వాత పది పైసలు..పదిహేను పైసలు..మా వయస్సుతో పాటు అలా అలా పెరిగి ఇరవైతో ఆగిపోయింది.  అవన్నీ భధ్రంగా కిడ్డి బ్యాంకుల్లో దాచుకునేవాళ్లం. తిరునాళ్లలో మామిడికాయ ముంతలు..యాపిల్ కాయ ముంతలు అమ్మేవాళ్ళు..మొదట్లో వాటిల్లో దాచుకునే వాళ్ళం..తర్వాత ఈ బొమ్మలు.



  




ఇదిగో ఈ అమ్మాయి బొమ్మ నాది..ఇందులో  బయటపడ్డ సంపద..అక్షరాలా అరవై తొమ్మిది రూపాయలు..







ఈ ఆంధ్రా బాంకు బుడ్డాడు మా అన్నయ్యది..ఇందులో బయటపడ్డ సంపద అక్షరాలా యాబది రూపాయల పన్నెండు పైసలు!


 ఈ నిధుల వెలికితీతలో  బయటపడ్డ  అపురూపమైన నాణాలు కొన్ని చూడండి..

                 1977 నాటి క్వార్టరు డాలరు..


                   1947 బ్రిటిష్ పాలన నాటి రూపాయి నాణెం..


 
                   1946 బ్రిటిష్ కాలం నాటి అర్థరూపాయి నాణెం....


                గాంధీ స్మారక 20 పైసల నాణెం..


ఇన్నాళ్లు మా ఇనప్పెట్టెలో ఉన్న ఈ సంపదని మొన్న ఇంటికెళ్ళినప్పుడు భధ్రంగా తెచ్చుకున్నా. మా అన్నయ్యది కూడా నేనే తెచ్చేసుకున్నా:)

Read more...

February 24, 2012

నా బ్లాగుకి పంచ వసంతాలు!

ఏంటో ఈ మధ్య నా బ్లాగు జోలికే వెళ్ళటం లేదు. ఈ రోజు ఎందుకో బ్లాగులోకి వెళ్తే అసలు ఈ సంవత్సరం ఒక్క టపా కూడా వ్రాయలేదు! హతోస్మి!  దిక్కూ మొక్కు లేనట్టు పడున్న నా  బ్లాగుని చూస్తే దిగులేసింది.

ఏం చెయ్యను! గత రెండు నెలలుగా ఊపిరి పీల్చుకోను కూడా తీరికలేనంత పని!

జనవరి 2 న మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం..ఆ తరువాత మా అక్క వాళ్ళ అబ్బాయి పెళ్లి హడావిడి..ఇదిగో పోయిన వారంతో అన్నీ ముగిసి తెరిపిన పడ్డా!

పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు
తాళాలు.. తలంబ్రాలు
మూడే ముళ్ళు ..ఏడే అడుగులు
మొత్తం కలిసి నూరేళ్లు....
ఎంత బాగా చెప్పాడు ఆత్రేయ!

పెళ్ళంటే ఆడపెళ్లి వారి కంటే మగ పెళ్ళి వారికే ఎక్కువ హడావిడి ఉంటుంది.  వాళ్లకి ఒక్క రోజుతో అయిపోతే మగపెళ్ళి వారికి మూడు రోజుల హడావిడి!

 ఇప్పటి కాలపు పెళ్లిలా షామియానాలు..బఫే భోజనాలు..ఒక్క పూట తంతులా  కాకుండా... తాటాకు చలువ పందిళ్లు, మేళతాళాలు, బంతి భోజనాలు.. పదహారు రోజుల పండగ దాకా అన్నీ దివ్యంగా ..సాంప్రదాయబద్దంగా జరిపాం.

ఇంతకీ నేనివాళ గమనించిన విషయం ఏంటంటే  ఫిబ్రవరి 21 కి నా బ్లాగు మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు..అప్పుడే ఐదు సంవత్సరాలు అయిపోయాయా? ఇప్పటివరకు ఇది కూడా గమనించలేదు నేను!

 ఈ టపాతో కలిపి ఓ 130 టపాలు వ్రాసినట్టున్నా..మరీ నత్త నడకంటారా? పోనీలేండి  నా వరకు నాకది ఎక్సుప్రెస్సు నడకే!  నా బ్లాగు ప్రయాణం బహు సమతుల్యతతో నడుస్తుంది..అంత వేగంగానూ నడవటం లేదూ ...మరీ మూలనా పడటం లేదు.

ఈ ఐదు సంవత్సరాల బ్లాగు ప్రయాణం లో అన్ని రుచులు ఆస్వాదించా! మంచి స్నేహితులూ దొరికారు! కొంతమంది మంచి మితృలు కనుమరుగయ్యారు!  కొత్త మితృలు జత కలిసారు!

నా దృష్టిలో బ్లాగన్నది మన జీవితంలో ఓ భాగం కాదు.  మన అభిప్రాయాలు, మనసులోని భావాలు పంచుకోవటానికి ఓ వేదిక అంతే! కుదిరిన రోజు వ్రాస్తాం..లేని రోజు లేదు! నచ్చిన వాటిని మెచ్చుకుంటాం..నచ్చని వాటిని వదిలేస్తాం!

నా మొదటి వార్షికోత్సవ టపా! 

సర్వే బ్లాగు జనా సుఖినోభవంతుః

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP