పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

October 22, 2015

మన అమరావతి - మన రాజధాని



ఓ మహా రాజధాని నిర్మాణానికి అంకురార్పణ----ఈ అంకురార్పణ ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో...ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్రలోనే ఒక మహోజ్వల ఘట్టం. ఈ రోజు యావత్తు ప్రపంచం చూపులూ అమరావతి వైపే! ఈ చరిత్రలో మనమూ ఓ భాగం కావటం మనకు గర్వకారణం కదూ!

కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి లాగబడి..రాజధాని లేని రాష్ట్రం గా ఏర్పడి..మీ రాష్ట్రానికి మీరు వెళ్లక ఇంకా ఇక్కడే పట్టుకు వేళాడుతున్నారన్న చీదరింపులు..ఈసడింపులు..గెంటివేతలు అన్నిటినీ దిగమింగి ఇది మా ఆంధ్రుల సత్తా అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెప్పి... పడి లేచిన కెరటంలా సగర్వంగా తలెత్తుకు నిలబడే దిశగా మొదటి అడుగు వేసే దివ్య ముహూర్తం ఆసన్నమయింది. శిధిలాల నుండి మహా రాజధాని నిర్మాణం ప్రారంభం కాబోతుంది.

శతాబ్దాల చరిత్ర ఉన్న అమరావతి మళ్లీ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతుంది.  33000 ఎకరాలు స్వచ్చందంగా ఇచ్చి ఆ ప్రాంత రైతులు రాజధాని నిర్మాణానికి  తొలి సమిధలయితే నేను సైతం రాజధాని నిర్మాణానికి ఇటుకనొక్కటి ఇచ్చాను అంటూ ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో కదం తొక్కుతూ ఈ బృహత్తర నిర్మాణం లో భాగస్వాములవటం నిజంగా ఓ అపురూప ఘట్టం.


 రాజధాని శంఖుస్థాపనకి ఇంత ఆర్భాటం అవసరమా..ఇంత ఖర్చు అవసరమా? అంటే అవసరమే! గ్లోబలైజేషన్ కాలంలో ప్రచారానికి మించిన పెట్టుబడి లేదు.  ప్రపంచం లో మేటి నగరంగా ఎదగాలంటే..పోటీలో ముందు ఉండాలంటే ప్రపంచ చూపు మన మీద పడాల్సిందే!  ప్రపంచం అంతా మన వైపు చూడాలన్నా..ఆ చూసిన చూపులు పెట్టుబడులు గా మారాలన్నా ఈ అట్టహాసం..ఈ ప్రచారం కావలిసిందే! వట్టి ప్రచారం ఉన్నా సరిపోదు...దాంతో పాటు కావలిసిన వనరులు ఉండాలి..సదుపాయాలు కల్పించాలి.  వనరులు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి.  సంకల్ప సిద్ది ఉండాలే కానీ ఏ పనైనా జరిగి తీరుతుంది.

ఇన్ని వేల ఎకరాలలో రాజధానా? అవ్వ..అవ్వ అన్నవాళ్ళే ఈ రోజు వహ్వా..వహ్వా అంటున్నారు. ఇది మన పండుగ..ప్రజల పండుగ.  కోట్లాది తెలుగు ప్రజల ఆకాంక్ష ఈ బృహత్తర రాజధాని నిర్మాణం.  భారతదేశంలో ఏ కొత్త రాజధాని నిర్మాణం అయినా ఇంత వేడుకగా ప్రజల పండుగగా జరిగిన దాఖలాలు లేవు.


రాజకీయ విభేదాలు ఉండటం సహజం కానీ ఇలాంటి చరిత్ర లో నిలిచిపోయే ఓ అద్భుతమైన ప్రజా కార్యక్రమానికి దూరంగా ఉండటం అంటే చరిత్ర హీనులుగా మిగిలిపోవటమే! రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్సు ఇప్పుడు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండి చరిత్రే లేకుండా అయిపోతుంది.  రాజకీయ అనుభవం లేని ప్రధాన ప్రతిపక్ష నేత నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించవద్దు..ఆహ్వానించినా నేను రాను అని తన అనుభవలేమిని బయట పెట్టుకోవటమే కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కుని కూడా పోగొట్టుకుంటున్నాడు. ప్రతిపక్షమంటే ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజల వాక్కును వినిపించాలి, ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు నిలతియ్యాలి కానీ ప్రజల ఆశలకి ఆశయాలకి విరుద్దంగా ఈ బహిష్కరణలు ఏంటి! ఏం సాదిద్దామని!

ఈ బృహత్తర కార్యక్రమం లో ప్రధాన భాగస్వాములైన రైతులకి నా జోహార్లు.  బంగారం పండే పొలాలని వదులుకోవటం అంటే రైతుకి తన ప్రాణాలు వదులుకోవటమే! రైతు తనకి ఎంత కష్టమొచ్చినా అప్పో సొప్పో చేసి జీవనం సాగించుదామనుకుంటాడు కానీ తనకి ప్రాణపదమైన పొలాన్ని అమ్ముకోను అంత త్వరగా ఇచ్చగించడు..అలాంటిది ఊర్లకి ఊర్లే మెజారిటీ రైతులు స్వచ్చందంగా తమ పొలాలని రాజధాని నిర్మాణానికి ఇవ్వటం నిజంగా గొప్ప విషయం..ఆ భూమి పుత్రులందరికీ నా జోహార్లు.

నభూతో నభవిష్యతి లాగా సాగుతున్న  మన అమరావతి-మన రాజధాని శంఖుస్థాపన కార్యక్రమం ద్విగ్విజయంగా జరగాలని ..రాజధాని నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తయ్యి.. మహా ప్రజా రాజధాని అన్నకోట్లమంది స్వప్నం సాకారమై ...అమరావతి ప్రపంచ పటం లో ఓ ప్రముఖ స్థానం సంపాదించుకోవాలని కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాజధాని నిర్మాణ శంఖుస్థాపన మహోత్సవ సందర్భాన నా మనః పూర్వక శుభాకాంక్షలు.

              జై తెలుగు తల్లి...జై అమరావతి...జై ఆంధ్ర ప్రదేశ్!

 

5 వ్యాఖ్యలు:

Sravya V October 22, 2015 at 7:01 AM  

జై అమరావతి...జై ఆంధ్ర ప్రదేశ్!

rajyalakshmi October 22, 2015 at 10:01 AM  

అమరావతి ఆంధ్రుల రాజధాని .స్వర్గం లోనించి మన అన్నగారు ఇంద్రుడితో (ఇంద్రా చూచితివా మాకు అమరావతి వుంది వస్తావా
చూడడానికి ?) అంటున్నారేమో !ఒక రాజధాని నిర్మాణం మనం కళ్లారా చూస్తున్నాం . ఇది అపురూప ఘట్టం . చంద్రబాబుగారు
ఆంధ్రులకు లభించిన మరో చాణుక్యులు , మరో అపర టంగుటూరి ! ఒక మానవజన్మకు ఇంతకన్నా పరాకాష్ట వుంటుందా ?

Unknown October 22, 2015 at 12:20 PM  

జై అమరావతి...జై ఆంధ్ర ప్రదేశ్!రాధిక (నాని)

hari.S.babu October 22, 2015 at 6:33 PM  

నా దృష్టిలో మొత్తం దేశానికే ఆర్ధిక రాజధానిగా మారే అవకాశం కూడా ఉంది.ముఖ్యంగా ఇన్నేళ్ళుగా నిర్లక్ష్యం చేసిన పోర్టులు పుంజుకుంటే దాని ఫలితం చెప్పలేనంతగా ఉంటుంది!ఇప్పటికీ ప్రపంచంలోని వ్యాపార పారిశ్రామికోత్పత్తులు యెక్కువగా ఓదల ద్వారానే రవాణా అవుతున్నాయి కదా!ఆ అరకంగా మొత్తం భారత అదెశానికీ మిగతా ప్రపంచానికీ మధ్య కూడలి స్థలంగా నిలబడుతుంది నవ్యాంధ్ర!పూర్తి కావలసిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావాలి.వ్య్వసాయాన్ని లాభసాటిగా నిలబేట్టడమే అత్యంత కష్టమైన పబి - ఆ ఒక్కటీ సజావుగా జరిగితే చాలు!అమరావతి ప్రపంచ నగరమూ నవ్యాంధ్ర వసుధైక కుటుంబపు ఆతిధేయీ అయి తీరుతాయి,తప్పదు!

Jai Gottimukkala October 23, 2015 at 12:40 PM  

@Haribabu Suranenii:

"ఇప్పటికీ ప్రపంచంలోని వ్యాపార పారిశ్రామికోత్పత్తులు యెక్కువగా ఓదల ద్వారానే రవాణా అవుతున్నాయి కదా!"

నిజమే కానీ ఇందులో సింహభాగం ఖనిజాలు, టోకు ముడి సరుకులు (bulk cargo), చమురు & చమురు ఉత్పత్తులు. వీటిలో లాభం పాలు తక్కువ.

లాభసాటి సెగ్మెంట్ కంటైనర్ రంగం ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరిగినా దురదృష్టం కొద్దీ మన దేశంలో ఈ ట్రెండ్ రాలేదు.

పోర్టులను ఎలా అభివృద్ధి చేయాలన్న ప్రశ్నపై మన ఆర్దికవేత్తలకు & ఉన్నతాధికారులకు సరయిన అవగాహన లేదు. ప్రతి ఒక్కరూ connectivity & warehousing గురించే మాట్లాడుతారు కానీ అత్యంత కీలకమయిన hinterland management విస్మరిస్తారు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP