పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 28, 2009

బ్లాగు పుస్తకంలో నెమలీక--అభినందన మందారమాల

"నా అక్షరాలు ప్రజా శక్తులవహించే విజయ ఐరావతాలు కాదు..వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలూ కాదు"

వెన్నెల్లో ఆడుకొనే ఆడపిల్లలే అందంగా ఉంటారా? తనమానాన తన పని చేసుకొని వెళ్ళే ఆడపిల్లలు అంతకంటే అందంగా ఉంటారు..........

అయినా ఇవంటే నాకు ఇష్టం.. ఎందుకంటే ఇవి 'నా' అక్షరాలు కాబట్టి. ....

ఎవరి అక్షరాలంటే వాళ్లకి ఇష్టమే.....కానీ మన అక్షరాలని ఇష్టపడే పాఠకులు ఎంతమంది ఉంటారు?

నెమలీక అంటే ఇష్టపడని పిల్లలు ఉంటారా?  అలానే నెమలికన్నుని ఇష్టపడని తెలుగు బ్లాగర్లు ఉంటారా?

చడీ చప్పుడు కాకుండా 2009 జనవరిలో బ్లాగు వ్రాయటం మొదలుపెట్టి....ఇంతింతై.......వటుడింతై అన్నట్టు  అలవోకగా ద్విశత టపాలు పూర్తి చేసుకున్న నెమలికన్ను బ్లాగు గురించి నేను చెప్పబోవటం సాహసమే! రాసిలోనే కాదు వాసిలో కూడా మెచ్చదగ్గ తెలుగు బ్లాగుల్లో ఆయనది కూడా ఒకటి.

చిన్నప్పుడు నెమలీకని పుస్తకాలల్లో దాచి పెట్టి దానికి కొబ్బరిమట్టల మధ్య ఉండే నాచు తెచ్చిపెట్టి ఆ ఈక పిల్లలు పెడుతుందని ఎదురుచూసేవాళ్లం..గుర్తుందా...ఇలాంటి ఆనాటి మన బాల్య  జ్ఞాపకాలని ఎన్నిటినో మన కళ్ళముందు సాక్షాత్కరింపచేసి..ఒక్కసారి మనల్ని మన బాల్యంలోకి తీసుకుపోయి మనస్సుని అక్కడే వదిలి వచ్చేటట్లు చేసే రచనలు ఆయన సొంతం.

బ్లాగు ప్రారంభించిన కొద్దికాలంలోనే  ఈనాడులో ఆయన బ్లాగు గురించిన పరిచయం వచ్చింది.  ఆరునెలల్లో వంద టపాలు..  ఏ టపాకి ఆ టపా విన్నూత్నమే.. బ్లాగుల్లో దీన్ని  ఓ రిఫరెన్సు బ్లాగు అనవచ్చేమో.  సాహితీప్రియులకి మంచి విందుభోజనం మురళి గారి బ్లాగు. తెలుగులో వచ్చిన ఏ కథ గురించి అయినా నవల గురించి అయినా ఆయన దగ్గర సమాచారం దొరుకుతుందనుకుంటాను. ఒక్కసారి ఆయన దగ్గర ఉన్న  పుస్తకాలు చూడాలి అని అనుకోని తెలుగు బ్లాగర్లు ఉండరేమో!  ఇప్పటికే చాలామంది బ్లాగర్ల దృష్టి మురళిగారి గ్రంధాలయం మీద పడ్డట్టు.....గ్రంధచౌర్యానికి పథకాలు వేస్తున్నట్టు అభిజ్ఞవర్గాల భోగట్టా..మురళి గారూ జాగ్రత్త!

ఓ సినిమా గురించి చెప్పినా....ఓ నవల గురించి చెప్పినా.....ఓ కథ గురించి చెప్పినా.....నాటకాల గురించి చెప్పినా  సాధికారికంగా చెప్పగల మురళి గారు తను స్వయంగా  ఓ మంచి కథకులు.  సరళమైన భాష, వివరణాత్మకమయిన శైలి, సూటిగా చెప్పగల నేర్పు ఆయన సొంతం.  మొన్న మొన్ననే పొద్దులో ఆయన మొదటి కథ  పొడిచింది. అయినా అది మొదటి కథేంటి?....నాకయితే ఆయన బ్లాగు టపాలన్నీ కథలే.

 పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు కదా..ఆలానే మన మురళి గారు కూడా తన మూడో ఏటే రచనా రంగంలోకి అడుగు పెట్టారట.  ఆ చమత్కృతి  ఏంటో ఆయన మాటల్లోనే చదవండి.  పూర్వాశ్రమంలో ఆయన రేడియో రచనలు కూడా చేసారు.  నాటకాల గురించి మాట్లాడేవాళ్లు ఈ రోజుల్లో అరుదుగా కనిపిస్తారు.....బ్లాగుల్లో అది మరింత అరుదు.  నేను తెలుగు బ్లాగుల్లో నాటకాల గురించి మొదటిసారిగా చదివింది మురళి గారి బ్లాగులోనే.  అన్నట్టు 'అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది.. మేఘం వెనుక రాగం ఉంది.....పాట మురళి గారే వ్రాసారంట! .  ఆయన సాహిత్య పిపాస ఎలాంటిదంటే ఒకటి కాదు రెండు కాదు....ఏకంగా 18 ఏళ్లు వెతికి వెతికి మరీ ఓ పుస్తకాన్ని సొంతం చేసుకున్నారట!

ఎప్పటెప్పటివో..పదిపదిహేనేళ్లనాటివి...... వార్తాపత్రికల్లో పడ్డ అలనాటి ఆణిముత్యాల లాంటి కథలు జాగ్రత్తగా దాచిపెట్టి మనకు వినిపిస్తుంటారు.  అలా  ఎన్ని కథలు  పరిచయం చేసారో చూడండి. తిలక్, వివినమూర్తి, భానుమతి, ముళ్ళపూడి, శ్రీరమణ, డా.సోమరాజు సుశీల, కేతు విశ్వనాథ రెడ్డి, బీనాదేవి, వంశీ.. లాంటి రచయతల మంచి మంచి కథల గురించి  ఇక్కడ  చదువుకోవచ్చు.  మురళి గారికి వంశీ అంటే ఓ ప్రత్యేక అభిమానం..వాళ్ల గోదావరి జిల్లా వాడయినందుకేమో....... ఎంత అభిమానం అంటే ఆయనతో ఫోనులో మాట్లాడి ఆ ఉద్వేగాన్ని....ఆ ఆనందాన్ని మనతో ఎంచక్కా పంచుకున్నారో ఇక్కడ.

సాధారణంగా పుస్తక పఠనం మీద ఆసక్తి ఉన్నవాళ్లకి సినిమాల మీద కూడా ఆసక్తి మెండుగానే ఉంటుంది.  మురళి గారి సినిమా అనురక్తికి ఆయన  సినిమాల మీద వ్రాసిన కబుర్లే   నిదర్శనం.  ఆయన  సినిమాల మీద చక్కటి చిక్కటి విశ్లేషణలు చేస్తుంటారు.  నవతరంగంలో  కూడా ఆయన వ్యాసాలు వచ్చాయి.  అసలు ఆయన ముందు నవతరంగంలో వ్యాసాలు వ్రాస్తూ అలా అలా బ్లాగు మొదలుపెట్టారు.  కాకపోతే ఎక్కువగా కొత్త సినిమాల (80ల తరువాత సినిమాలు ) గురించే ఉంటాయి.  అప్పుడప్పుడు ఆపాత మధురాల గురించి కూడా చెప్తే బాగుంటుంది!

ఆయనకి సినిమాలు చూసే  విషయంలో ఎంత గుండె ధైర్యం..సాహసం అంటే సుమనోహరుడి ఉషాపరిణయాన్ని నిర్భయంగా చూసొచ్చి నిర్భీతితో మనకి ఆ సినిమా గురించి చెప్పేంత!  ఇన్సూరెన్సు పాలసీలు, రావాల్సిన, తీర్చాల్సిన బాకీల వివరాలన్నీ ఓ పుస్తకంలో వివరంగా రాసి పెడతారంట లేండి..అదీ ఆయన ధైర్యం.

తను వ్రాసే అమ్మ చెప్పిన కబుర్లు అయితే నాకు మరీ మరీ ఇష్టం.  అవి ఆయనకి వాళ్లమ్మ చెప్పిన కబుర్లే అయినా మనకు మన అమ్మ చెప్తున్నట్లే ఉంటాయి.  "ఒలప్పో బెండకాయి కూరొండీసినావంటే..".   అంటూ వాళ్ల పిన్ని పాడిన జముకుల కథ.....వాళ్ల అమ్మమ్మ బిస్సీ కబుర్లు,...సత్తెమ్మ సత్యభామగా  మారి  చెరువుమీద నడిచే ప్రహసనం.....గోవిందరావు జమిందారు గురించి,  టాంపండు లీలలు.......కొంపముంచిన కుంటె గేదె.....అయ్యప్పనాయుడు..హరిశ్చంద్ర వేషం......అబ్బో వాళ్ల అమ్మగారు ఆయనకి ఎన్నెన్ని కబుర్లు చెప్పారో. ... ఎంత అదృష్టవంతులో మురళి గారు మీరు..

ఇక ఆయన జ్ఞాపకాలలోకి వెళ్ళామంటే ఒక పట్టాన బయటకి రాలేము.  అవి చదువుతున్నప్పుడు నిక్కరేసుకున్న చిన్న మురళి మన కళ్ల ముందు మెదులుతాడు.  మనం కూడా మన చిన్ననాటి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతాం.   ఈతపళ్ళు-ముంజెల బండి, పోలిస్వర్గం , తిప్పుడు పొట్లాం, మొగ్గల చీరలు,  మల్లికాసులు,  వాళ్ల సుబ్బమ్మగారి నీళ్ళావకాయ..... ఎన్నెన్ని జ్ఞాపకాలో! 

మురళి గారికి వాళ్ల బామ్మ గారంటే కాస్త కోపం అనుకుంటాను. పాపం పెద్దావిడిని ఎన్ని ఇబ్బందులు పెట్టేవారో .....అంతేనా వాళ్ల తాతయ్య చేత చివాట్లు కూడా పెట్టించేవారు.  ఇంతకీ పెద్దాయ్యాక అయినా తేలు కుడితే ఎలా ఉంటుందో  తెలిసిందా మురళి గారూ?

అందరిని హడలగొట్టే మురళి గారికి వాళ్ల నాన్నగారంటే మాత్రం మహా హడలు సుమండి.  పాపం ఆయన పదమూడో ఎక్కం కష్టాలు  పగవాడికి కూడా వద్దు అనిపిస్తాయి.  కత్తిరించిన జుట్టు మళ్ళీ తన తలమీద అతికించమని వాళ్ల మంగలి సత్యాన్ని   పీడిస్తుంటే ..వాళ్ల నాన్నగారొచ్చి నిద్రగన్నేరు కొమ్మతో వీపుమీద కధాకళి ఆడేసారట....... ఇవన్నీ మన కళ్లముందు జరిగినట్లే వర్ణిస్తారు.  ఈ జ్ఞాపకాల టపాలు చదువుతుంటే నాకు నాయిని మిట్టూరోడి కథలు గుర్తుకొస్తాయి.

మురళి గారి శైలి చదువుతుంటే నాకు అక్కడక్కడ ప్రళయ కావేరి కథలు..మా పసలపూడి కథలు  గుర్తుకొస్తాయి.  కుదిరితే ఓ కప్పు కాఫీ అంటూ కాఫీ కబుర్లు అయినా , తన బ్లాగులోని విషయ చౌర్యం గురించి కాపీ కబుర్లు అయినా..... మరే కబుర్లయినా  కళాత్మకంగా వ్రాయటం ఆయనకే చెల్లు.   చెయ్యి విరిగినట్టుంది అంటూ బ్లాగుల్లో వ్యాఖ్యల పెట్టె  పాత్ర గురించి..అది పనిచేయకపోతే వచ్చే ఇబ్బందుల గురించి  ఎలా చెప్పారో చూడండి.  అదే చేత్తో ఆషాఢమాసం గురించి అల్లరల్లరిగానూ చెప్పగలరు. 

కథలు...నవలలు....నాటికల  గురించే కాదు తన చుట్టూ ఉండే మనుషుల  గురించి కూడా కథ చెప్పినట్టే ఆసక్తికరంగా చెప్తారు.  కష్టం, బాధ్యత, మనసు, స్నేహం..లాంటి వాటి మీద  వ్యక్తిత్వవికాస తరగతులకి పనికొచ్చే మంచి విశ్లేషణాత్మక వ్యాసాలూ వ్రాయగలరు.  ఇన్ని రకాల వైవిధ్య రచనలతో పాటు బ్లాగు పరిచయాలు  కూడా చేసే మురళి గారి బ్లాగు గురించి ఎంత చెప్పినా అది అసంపూర్ణమే!

ఇక చివరిగా మురళి గారి బ్లాగుకే ప్రత్యేకమయిన ఓ విభాగం ఉంది..అదే నాయికల పరిచయం.  మధురవాణి నుంచి కజు వరకు ..... ప్రముఖ నవలల్లోని నాయికల గురించి అద్భుతంగా విశ్లేషిస్తూ పరిచయం చేస్తుంటారు.  పుస్తక పరిచయాలు సర్వసాధారణమే..కానీ బ్లాగుల్లో ఇలా అచ్చంగా నవలా నాయికల పరిచయాలు ఓ వైవిధ్యమే!

గోదావరి అంటే అమిత ఇష్టపడే ఈ గోదారబ్బాయి బ్లాగులో గోదావరి గురించిన ప్రస్తావనలు ఎక్కువగానే ఉంటాయి.   మన నేల, మన నీరు, మన పల్లె, మన కొండా కోనా...ఈ మన అనుకోవటంలో ఉండే ఆనందం..ఆ అనుభూతి ఈ మన బ్లాగు చదవటంలో కూడా ఉంటుంది.

మురళి గారు రెండువందల టపాలు పూర్తిచేసిన సందర్భంగా అభినందనలు తెలుపుతూ.... ఆయన నుండి శతాధిక టపాలు కోరుకుంటూ....

ఆయన ఎన్ని చేతులతో ఎన్ని కీబోర్డులతో వ్రాస్తారో నాకు తెలియదు కాని టపటపా టపాలు రాలిపోతుంటాయి...అందుచేత నేనీ టపా ప్రచురించే సమయానికి ఆయన రెండువందల టపాలు దాటేస్తే తప్పు నాది  కాదు!!

Read more...

December 20, 2009

మహామహుల రాకతో కళకళలాడిన పుస్తక ప్రదర్శన

 శనివారం (19/12/09) పుస్తక ప్రదర్శనలో ముఖ్యమయిన కార్యక్రమం వాక్ ఫర్ బుక్సు.  ఆ సందర్భంగా  చాలామంది ప్రముఖులని చూసే అవకాశం కలిగింది.

చుక్కా రామయ్య గారు (ప్రముఖ విద్యావేత్త), పరుచూరి వెంకటేశ్వరరావు గారు (సినీ రచయిత), దేవానంద్ (ఐ.ఏ.ఎస్ ఆఫీసరు), జెన్నీ (సినీ నటులు, రచయిత), తెలకపల్లి రవి గారు (జర్నలిస్టు, టి.వి విశ్లేషకులు), రవిప్రకాష్ (టి.వి 9), చొక్కాపు వెంకటరమణ (మెజీషియను మరియు రచయిత) మొదలగువారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  నడక తరువాత వీరి ప్రసంగాలు కొనసాగాయి.....అవి నేను వినలేదనుకోండి.

 ఈ కార్యక్రమంలో బ్లాగర్ల తరుపున మరియు e-తెలుగు తరుపున పి.ఎస్.ఎం లక్ష్మి,  సతీషు కుమారు యనమండ్ర, నామాల నాగమురళీధర్, ఇనగంటి రవిచంద్ర, రాజశేఖరుని విజయ శర్మ, శిరీషు కుమార్, శివ చెరువు, సి.బి.రావు, శ్రీనివాస కుమారు, వరూధిని మరియు పుస్తకం వారి తరుపున పూర్ణిమ, అరుణ పప్పు పాల్గొన్నారు.  చాలామంది చిన్న పిల్లలు విచిత్ర వేషధారణలతో .....పుస్తకం నోరు తెరవని మహావక్త,  చదవండి....చదివించండి అన్న ప్లకార్డులతో  అలరించారు.

అక్కడికి వచ్చిన ప్రముఖులకు e-తెలుగు సభ్యులు పనిలో పనిగా e-తెలుగు గురించి, బ్లాగుల గురించి ..... పుస్తకం వారు పుస్తకం సైటు గురించి వివరించి కరపత్రాలు పంచిపెట్టారు.

సరే ఇక ఆ కార్యక్రమం అయిపోయాక e-తెలుగు స్టాలుకి వెళితే అక్కడ ఊహించని అంతర్జాల ప్రముఖులు ఎదురయ్యారు.  పరుచూరి శ్రీనివాసు గారు, అక్కిరాజు భట్టిప్రోలు గారు కనిపించారు. అక్కిరాజు గారి ఫోటో వారి బ్లాగులో ఉంది కాబట్టి ఆయన్ని తేలికగానే గుర్తు పట్టాను.  అక్కిరాజు గారితో పాటు వారి అమ్మాయి భావన కూడా వచ్చింది.   నిన్న e-తెలుగు స్టాలుకి బ్లాగర్లు కూడా చాలామంది వచ్చారు. చివరిదాకా సందర్శకులతో సందడి సందడిగా ఉన్న స్టాలు ఇదేనేమో!  చివరిలో ఊహించని విధంగా రచయిత్రి మరియు బ్లాగరు అయిన చంద్రలత గారు ఓ మెరుపులా అక్కడ ప్రత్యక్షమయ్యారు.  అనుకోకుండా  ఆమెని కలవటం చాలా ఆనందం అనిపించింది.

నిన్న e-తెలుగు స్టాలుకి వచ్చిన బ్లాగర్లు

ఇంకా ఎవరయినా వచ్చారేమో......వారి పేర్లు ఇక్కడ లేకపోతే అన్యదా భావించకండి.
e-తెలుగు స్టాలు నిర్వహణలో అహర్నిశలు శ్రమిస్తున్న కశ్యప్ గారికి నా ప్రత్యేక అభినందనలు.  అలానే తనకి చేదోడుగా ఉంటూ తోడ్పాటు అందిస్తున్న సతీషు కుమారు యనమండ్ర, నామాల నాగమురళీధర్, చక్రవర్తి గార్లకు జేజేలు మరియు అభినందనలు.  మిగతా రోజుల్లో కూడా  బ్లాగర్లు తమకు వీలయన రోజుల్లో వచ్చి స్టాలు నిర్వహణలో సహాయపడగలరని ఆశిస్తున్నాను. నిన్న పి.ఎస్.ఎం. లక్ష్మి గారు చాలాసేపు స్టాలు నిర్వహణలో తోడ్పాటు అందించి వచ్చిన సందర్శకులకు అన్నీ వివరించారు.  ఆమెకి కూడా అభినందనలు.

ఆదివారం పుస్తక ప్రదర్శనకి వెళ్లే బ్లాగర్లకి ఓ అద్భుత అవకాశం.....బ్లాగర్లు A4 సైజులో వారి బ్లాగు పేరు గానీ స్క్రీన్ షాట్ గానీ తీసుకు వచ్చి స్టాలు వద్ద ప్రదర్శించుకోవచ్చు.

ఇక చివరిగా పనిలో పనిగా కొన్నంటే కొన్నే  పుస్తకాలు కొన్నాను.  అందులో ముఖ్యమయినది (ఇం)కోతి కొమ్మచ్చి...(ముళ్ళపూడి వారి  కోతికొమ్మచ్చి రెండవ భాగం)......మొన్న శుక్రవారమే విడుదలయిందట! దాంతోపాటు చాలామంది బ్లాగు మిత్రులు మీరు చదవ్వాల్సిందే అని మరీ మరీ చెప్పిన యండమూరి అంతర్ముఖం కూడా కొన్నాను.  ఇంకా సోమరాజు సుశీల గారి దీపశిఖ తీసుకున్నాను. ఇవి కాక ఇంకో ఐదు పుస్తకాలు కొన్నాను.

తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి.

Read more...

December 18, 2009

రండోయ్......రారండోయ్

హైదరాబాదు అనగానే అందరికి గుర్తుకొచ్చేది..జనవరిలో జరిగే ఎగ్జిబిషను ..దాంతోపాటు గత నాలుగయిదు సంవత్సరాలుగా అంతే ప్రాచుర్యాన్ని పొందుతున్న మరో ప్రదర్శన హైదరాబాదు పుస్తక ప్రదర్శన.  మరి ఈ సారి పుస్తక ప్రదర్శనకి ఎంతమంది బ్లాగర్లు వస్తున్నారు?  అక్కడ e-తెలుగు స్టాలు కూడా ఏర్పాటు చేసారు.  ఆసక్తి... ఉత్సాహం ఉన్న బ్లాగర్లు, బ్లాగేతరులు e-తెలుగు స్టాలుకి వచ్చి అంతర్జాలంలో తెలుగు గురించి, వికీపిడియా గురించి, బ్లాగుల గురించి, అంతర్జాల పత్రికల గురించి తెలుసుకోవచ్చు.......వీటి గురించి తెలిసినవాళ్లు అక్కడకి వచ్చే సందర్శకులకి వీటి గురించి వివరించవచ్చు. వలంటీర్లుగా రాదలుచుకున్న వాళ్లు కశ్యప్ (9396533666) (9030365266) గారిని కాని, దూర్వాసుల పద్మనాభం గారిని కాని సంప్రదించవచ్చు.

శనివారం (19/12/09) సాయంత్రం ఐదు గంటలకి వాక్ ఫర్ బుక్సు కార్యక్రమం కూడా ఉంది.  ఉత్సాహవంతులు ఇందులో పాల్గొనవచ్చు.  దీన్ని కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి  దగ్గుపాటి పురందరేశ్వరి గారు ప్రారంభిస్తారు.  


శనివారం (19 వ తేది),  ఆదివారం (20 వ తేది),  మరియు సోమవారం (21 వ తేది) మహిళా బ్లాగర్లు ఎవరయినా రాదలుచుకుంటే రావచ్చు.

తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి


Read more...

December 16, 2009

నేనిక్కడ-నువ్వెక్కడ?

నువ్వూ నేనూ చివరిసారిగా కలిసింది ఎప్పుడు?......నా పెళ్లిలోనా?
20 సంవత్సరాల సుదీర్ఘ కాలం.....
ఏ సీమలో ఉన్నావో .....ఎలా ఉన్నావో
కుశలమేనా......నీకు కుశలమేనా
అనుకుంటూ ఇన్నాళ్లూ అన్వేషణలు

పిల్లలెంత మందో?
ఎలా ఉంటారో?
నీలాగా పాడతారా?
నీ అంత సుకుమారంగానూ ఉంటారా?
నీలాగా బద్దకం ఎక్కువా?
జవాబు దొరకని ప్రశ్నలు.....మరుగునపడ్డ జ్ఞాపకాలు

ఎప్పటికయినా కలుస్తాం అన్న ఆశ
ఇక ఎప్పటికీ కలవమేమో అన్న నిరాశ
నిరాశని భగ్నం చేస్తూ....గుండెలని మీటుతూ
జాలంలో తళుక్కున మెరిసిన నీ ఫోటో
ఇప్పటికీ అదే రూపం......నీదైన అదే చిరునవ్వు

 నెమలి నాట్యం....కోకిల పాట
సందెపొద్దుల్లో సంపెంగ నవ్వులు
అమ్మ దొంగలు.....నీలి మబ్బులు
వెన్నెల రాత్రులు.....ఆరుబయట విహారాలు
నువ్వు పాడిన పాటలు......మనం చూసిన సినిమాలు

యమునా ఎందుకే నీవు.......ఇంత నలుపెక్కినావు
అంటూ మనం చేసిన డాన్సు
క్రీస్తు జననం అంటూ
మనం వేసిన గొర్రెల కాపరి వేషాలు
చివరి నిమిషపు చదువులు.....నైటవుట్ ప్రాజెక్టులు

అలల్లా జ్ఞాపకాలు
ఒకదాని వెంట ఒకటి
ఒకదానిపై మరొకటి
అలుపన్నదే లేక
ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
మునుగుతూ తేలుతూ

ఆనాటి ఆ స్నేహమానంద గీతం
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం....

12/12/09 న వ్రాసినది. (20 సంవత్సరాల తరువాత ఇక దొరకదేమో  అనుకున్న ఓ ప్రియసఖి ఆచూకీ దొరికిన సందర్భంగా )

Read more...

December 10, 2009

ఇక మేమూ ప్రవాసాంధ్రులమే!!

ఏంటో ఇన్నాళ్లు తెలంగాణా వచ్చేది కాదులే అని గుండెల మీద చెయ్యేసుకుని కూర్చున్నాం.  తెలంగాణా వచ్చేసినట్టే అని ఓ పక్క తెలంగాణా ప్రజలు ఉత్సవాలు చేసేసుకుంటున్నారు..ఇంకొక పక్కేమో కోస్తా, రాయలసీమ వాళ్లు సమైక్యాంధ్ర అంటూ రోడ్లెక్కుతున్నారు. ఎప్పటికి తేలేనో ఈ విభజనలు....పునర్విభజనలు. అదేంటో నాకయితే ఈ విభజన గొడవలో ఎవరి వాదన విన్నా సమంజసంగానే అనిపిస్తుంది..ఇంతకీ నేనెటు వైపు!! అదే తేల్చుకోలేకుండా ఉన్నాను.

ఇంకొన్నేళ్లల్లో మేము కూడా ప్రవాసాంధ్రులం అయిపోతామన్నమాట.  ఇకపై అన్ని ప్రవాసాంధ్ర సంఘాలలో మేము కూడా సభ్యులమన్నమాట!  మున్ముందు హైదరాబాదు ప్రవాసాంధ్రుల సంఘం అనో, TAH (Telugu Association of Hyderabad) అనో , TAT (Telugu Association of Telangana) అనో ....AAH (Andhra Association of Hyderabad) అనో ..మరోటనో.......సంఘాలు పెడితే అందులో మేము కూడా సభ్యులమే!!.

ఇప్పుడు నా సమస్య ఏంటంటే..ఒకవేళ తెలంగాణా వస్తే గిస్తే....మేము....  అంటే గత 20-30 సంవత్సరాలుగా తెలంగాణాలో ఉన్నవాళ్లం....ఏ రాష్ట్రానికి చెందుతాం......పుట్టి పెరిగిన ఆంధ్రాకా?.....లేక స్థిరపడ్ద తెలంగాణాకా? సరే మేము ఆంధ్రాకే చెందుతామనుకుంటే మరి ఇక్కడే పుట్టి పెరిగిన మా పిల్లలో.....వాళ్ళు తెలంగాణా బిడ్డలా?  హత్తెరికి అయితే మా ఇంట్లో సగం మందిమి ఆంధ్రా.... సగం మందిమి తెలంగాణా అన్నమాట..భలే..భలే...సరే పుట్టిన గడ్డ మీద మమకారంతో అక్కడికే వెళ్లిపోదామా అంటే అక్కడ మా పిల్లలు నాన్ లోకల్ అయిపోతారు..మరి కింకర్తవ్యం??

తెలంగాణా ఇస్తే అటువైపు ప్రత్యేక రాయలసీమ ఇవ్వాలంట...ఇటు వైపు ఉత్తర కోస్తా ఇవ్వాలంట...మరి నట్టనడుమనున్న ఆంధ్రప్రదేశ్‌కి గుండెకాయలాంటి కృష్ణ, గుంటూరు ఏమయిపోవాలంటారు? ఒక్కో జిల్లాని ఒక్కో రాష్ట్రంగా చేస్తే సరి..మళ్లీ మళ్లీ దీక్షలు లేకుండా.....ప్రాణాలు పోకుండా!......ఓ పనయిపోతుంది!!

ఏంటో ఓ కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయేటప్పుడు అందరి అభిప్రాయాలు అడిగి అందరికి అమోదయోగ్యంగా ఆస్తుల విభజన చేసుకుని విడిపోతారు.....మరి  ఇప్పటివరకు ఈ విషయంలో మనలాంటి సామాన్య ప్రజల అభిప్రాయాన్ని ఎవ్వరయినా అడిగారా?

అసలు ప్రత్యేక రాష్ట్రం వస్తే ఎవరికి లాభం.  సామాన్యులకి ఒరిగేదేమన్నా ఉందా?  పెరిగిన ఉప్పులు పప్పుల రేట్లు ఏమయినా తగ్గుతాయా?

 ఈ గొడవలేమో కాని మా పిల్లలు ఊళ్లో చిక్కుకు పోయారు.  నిన్నటి దాక ఇక్కడ గొడవలు, కాలేజీలకి సెలవలని అక్కడున్నారు..సరే ఈ రోజుతో గొడవలు అయి పోయాయి, రేపటినుండి కాలేజిలు మొదలు కదా అని బయలుదేరి రమ్మంటే ఇప్పుడు అక్కడ గొడవలు.

Read more...

December 2, 2009

వీడుకోలే వేదికయినా....

నిన్ను ఇంట్లో నుండి సాగనంపేటప్పుడు అనుకోలేదు
నీ దూరం నన్నింతగా బాధిస్తుందని
ఒకటా రెండా 18 సంవత్సరాలు
మాతో కలిసి మెలిసి వున్నావు
మాలో ఒకరివై పోయావు.
నిన్నెంత ప్రాణంగా చూసుకున్నాను
అందుకేనేమో నాకు ఇంత బాధ
నేను తప్ప ఇంకెవరు నీ మీద చేయి వేయకూడదనుకునేదాన్ని
ఎవరైనా నీ మీద చేయి వేస్తే
నా ప్రాణం పోయినట్లుండేది
వాళ్ల చేతులు ఎలా ఉన్నాయో
అవి అంటుకుని నువ్వెక్కడ మాసిపోతావో అని నా ప్రాణం కొట్టుకునేది
నీ మీద సర్వం సర్వాధికారం నాదే అనుకునేదాన్ని
నీ మీద ఈగ కూడ వాలనిచ్చేదాన్ని కాదు
నువ్వు కూడా నాతో అంతే విశ్వాసంగా వున్నావు.
నీ మీద ఎంత భారం వేసినా ఎప్పుడూ పన్నెత్తు మాట అనలేదు
ఓపికగా భరించావు
అలాంటి నిన్ను నేనెలా దూరం చేసుకున్నాను!
నేనెళ్లిపోతాను అని నువ్వెప్పుడూ అనలేదు
నేనే నీకు వయస్సు అయిపోయిందని
మా భారం మోయలేకపోతున్నావని
మాకు సరిగా సేవలు చేయలేకపోతున్నావని
నిన్ను నిర్థాక్షిణ్యంగా మెడ పట్టుకు గెంటేసాను
ఎంత కఠినాత్మురాలినో కదూ!
ఇప్పటికీ కళ్లముందు నువ్వే మెదులుతున్నావు
పచ్చటి నీ రూపు...చల్లటి నీ మనస్సు...
ఇప్పుడెక్కడున్నావో!
ఏ శిధిలాల క్రింద మగ్గిపోతున్నావో!

******************************************************************************

ఏంటో 18 సంవత్సరాలు మా ఇంట్లో మాతో పాటు సహజీవనం చేసిన మా ఐసు పెట్టెని (ఫ్రిజ్జు) ఆ మధ్య ఇంకో ఐసుపెట్టెతో మార్పిడి పథకం కింద సాగనంపి ఓ వారం రోజులు పడ్డ దిగులులో నుండి వెలువడ్డ ఓ చిన్నపాటి ఆవేదన. ప్రాణం లేని వస్తువులే అయినా కొన్నిటితో చిక్కటి అనుబంధాలు పెనవేసుకుంటాం. అవి దూరం అయినప్పుడు ఏదో సర్వం కోల్పోయినట్టుగా ఉంటుంది.

Read more...

December 1, 2009

ఆనందమానందమాయెనే---నా సెల్లు పాడయి పోయినే!!

ఏమి హాయిలే హలా!! అహ.....ఏమి హాయిలే హలా!!

సెల్లు ఉంది ఎందుకు బ్యాగులో దాచుకోనా.....ఎత్తవే అన్న అదిలింపులు లేవు..

గడప దాటటం భయం......ఎక్కడున్నావు......ఎంతసేపట్లో వస్తావు.......ఇంత లేటు అయ్యిందేం ...అన్న ప్రశ్నల జడివానలు లేవు..

నెల రోజులనుండి ప్రాణానికి ఎంత హాయిగా ఉందో!

అసలు విషయమేమిటంటే.....నా సెల్లుఫోనుకి చీడ (వైరస్సు) పట్టింది..దాంతో దాన్ని ఓ మూలకి విసిరేసాను..

ఏంటో ఇన్నినాళ్లు నేను కోల్పోయిన నా స్వాతంత్రం అంతా తిరిగొచ్చేసిన భావన కలుగుతుంది..

నిజమండీ బాబు.....ఈ సెల్లుతో నాకు అన్నీ ఇన్నీ తిప్పలు కావు..

అసలు నాకు మొదలు సెల్లే అవసరంలేదు..ఏదో అలనాడు ఆఫీసుకి పోయి ఉద్యోగం వెలగబెట్టే రోజులలో.....ఎప్పుడయినా పిల్లలు ఇంటికి ముందుగా వచ్చేస్తే సెల్లులో కబురు పంపితే ఇంటికి వచ్చి వాలొచ్చని కొనుక్కున్నాను..కానీ అదే నా మెడకి రోకలిబండలా చుట్టుకుంటుందనుకోలేదు..

ఆ సెల్లు చేత్తో పట్టుకు తిరగాలంటే నాకయితే ఏదో కొండంత భారం మోస్తున్నట్టు ఉంటుంది..

పోనీ మెడలో తగిలించుకోవాలంటే.....అలా మెడలో వేసుకున్న వాళ్లని చూస్తే నాకు మూర్చ రోగులు మెడలో వేసుకు తిరిగే పలకలు గుర్తుకొస్తాయి (ఇది నా భావన అంతే......దయచేసి వేరుగా అర్థం చేసుకోకండి). అందుకే అది ఎప్పుడూ బ్యాగులోనే ఉంటుంది..మరి అది బ్యాగులో ఉంటే తొందరగా వినపడదు కదా! ఇక మా ఇంటాయన విసుర్లు అన్నీ ఇన్నీ కావు...సెల్లు ఎత్తని దానికి ఆ సెల్లు ఎందుకూ అంటూ.. ...(మరే నాదీ అదే ప్రశ్న..అసలు నాకు సెల్లు ఎందుకు?)

నా దృష్టిలో సెల్లు అంటే ఏదో అత్యవసరానికి వాడుకోవటానికే కాని అలంకారానికి కాదు. ప్రతివాళ్ల చెవుల దగ్గర ఈ సెల్లులు చూసీ చూసీ నాకు అవి అంటే ఎంత విముఖత వచ్చేసిందో!

ఏంటో ఏదో చెప్పబోయి ఏదో చెప్పేస్తున్నా..ఆనందం ఎక్కువయినా మాటలు దొరకవు కదా!!

నిజానికి నేను కొనుక్కున్న మొదటి సెల్లుని అప్పుడెప్పుడో మా మరిది పెళ్లిలో ఎవరో లేపేసారు....అహా పోయిందిలే అని సంతోషించా....అది పోయిన నెల తిరగకుండానే మా ఇంకొక మరిది అమెరికా నుండి మా పాపకి ఓ సెల్లు కొనుక్కొచ్చాడు....అప్పటికి మా పాపకి ఇంకా 18 నిండలేదు కాబట్టీను....18 నిండకముందు పిల్లలు సెల్లు వాడటం నా నియమాలకు వ్యతిరేకం కనకానూ.....ఇంకో సెల్లు కొనటం ఎందుకు దండగ అనీనూ....నేను ఆ సెల్లు వాడుకోవటం మొదలుపెట్టా....అమ్మయ్య......ఇప్పుడు దానికి కూడా రోజులు నిండాయి. మొన్నామధ్య మా అబ్బాయి దాన్లో బ్లూ టూతో రెడ్డు టూతో ఏదో ఉంటుంది కదా..దాన్ని కెలికినట్టున్నాడు..దెబ్బకి దానికి తెగులు పట్టుకుంది...ఇక దాని నోరు నొక్కేసి పక్కన పడేసా!

సెల్లు పాడయ్యాక మొదటిసారిగా మొన్నో రోజు ఊరు వెళ్లా....

సెల్లు లేని ప్రయాణం ఎంతా ఆహ్లాదంగా ఉందో!

ఊరు బయలుదేరతానా..గుమ్మంలోనుండి కాలు బయటపెట్టకముందే మొదలవుతుంది ఈ సెల్లాయణం...

అటునుండి..మా నాన్న........అన్నయ్య

ఇటునుండి మా ఇంటాయన!

బయలుదేరావా?
ఆటోలో వస్తున్నావా? మీ ఆయన దింపుతున్నాడా?
స్టేషను చేరావా?
ట్రెయిను కరెక్టు టైమేనా? కనుక్కున్నావా?
ఏ ప్లాటుఫారమో కనుక్కున్నావా?
ఎక్కావా?
ఎక్కడి దాకా వచ్చావు?
ఎక్కడున్నావు?
ఇంకా నడికుడేనా?
ఫోను ఎత్తవే?
మీ అన్నయ్యకి ఫోను చేసావా స్టేషనుకి రమ్మని?
ఇంకా ఎంత సేపట్లో గుంటూరు చేరతావు?
నల్లపాడు దాటగానే నాకు ఫోను చెయ్యి
దిగావా?
మీ అన్నయ్య కనపడ్డాడా?
ఇంటికి చేరారా?


* .....
* .....
* .
* .
* .
* .
* .
* .
* .
* .
* .
*

మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఆ సెల్లు అలా మోగుతూనే ఉంటుంది..అసలు ఊరికి ఎందుకొచ్చానురా భగవంతుడా అనుకుంటా!

సరే ఇక పిల్లలతో వెళితే అదో ప్రత్యేకం..పిల్లలని తీసుకెళ్లకుండా వెళితే అది మరో రామాయణం..వెరసి ఈ సెల్లుఫోను కనిపెట్టిన వాడెవడురా బాబూ అని తలపట్టుకునే పరిస్థితి.

ఇక ఎప్పుడైనా ఇంట్లోనుండి అలా బజారుకి బయలుదేరతానా...నా వెనకే సెల్లు మోత కూడా బయలుదేరుతుంది. నేనేమో సామాన్యంగా ఆటో ఎక్కను.....బస్సే ఎక్కుతాను. ఆ బస్సు మోతలో సెల్లు మాట్లాడాలంటే నాకు మహా చిరాకు....అది మోగినా నాకు వినపడదు.....వినపడినా ఎత్తను. అసలు నీకు సెల్లు ఎందుకు అని మరలా క్లాసు మొదలు:)). అయినా బయటకి వెళ్ళినవాళ్లం అక్కడే ఉండిపోతామా! నాలుగు పనులూ చేసుకు రావాలా! అర్థం చేసుకోరూ!

మా పెళ్ళయిన కొత్తలో ఇంటినుండి ఊరికి బయలుదేరుతుంటే.....వెళ్ళగానే ఓ ఉత్తరం వ్రాయమ్మా అని చెప్పేవాళ్లు....

ఇక హైదరాబాదు వచ్చిన కొత్తలో .........వెళ్లగానే ఫోను చెయ్యి అనేవాళ్లు.

ఇప్పుడో......ఇంటినుండి బయలుదేరిన దగ్గరనుండి.....అడుగడుక్కీ మనం ఏ దారిన వెళుతుంది...ఎక్కడ ఆగింది....కారులో ప్రయాణమయితే ఇక చెప్పక్కర్లేదు...అన్నీ ప్రత్యక్ష ప్రసారాలే....అంత అవసరమా...ఫోనుని .ఎంత దురుపయోగం చేస్తున్నాం అనిపిస్తుంది.

వెళ్ళగానే ఓ ఉత్తరం వ్రాయమ్మా.....అని చెప్పటంలో ఉండే ఆప్యాయత.....ఈ ప్రత్యక్ష ప్రసారాలలో నాకు కనపడదు..అంతా యాత్రికం అయిపోతుంది..ఏదో కోల్పుతున్నాం అనే భావన.

ప్రస్తుతానికయితే ఈ సెల్లు లేని జీవితం నాకు హాయిగా ఉంది!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP