పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

September 29, 2014

నలభై వసంతాల చెలిమికి వీడ్కోలు..

తెలుగు వార్తా పత్రికల చరిత్రలో  ఒక అధ్యాయం సృష్టించి....వార్తల ప్రచురణలో కొత్త పుంతలు తొక్కి...ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా..ఎప్పుడు పేపరు చదువుదామా అనేట్లు చేసి ..గత నలభై సంవత్సరాలుగా అశేష ప్రజాదరణని సొంతం చేసుకుని తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రిక గా చరిత్ర సృష్టించిన ఓ ఈనాడు పత్రికా రాజమా నీకిక వీడ్కోలు.

నాకు ఊహ తెలిసేటప్పటికే నువ్వు ఉన్నావు.  నేను పేపరు చదవటం మొదలుపెట్టింది నీతోనే! 1974 లో తెలుగు పాఠకుల లోగిళ్ళల్లోకి ఉషా కిరణాలతో పోటీ పడి నువ్వు రావటం మొదలుపెట్టిన లగాయితూ ప్రవాసంలో ఉన్నప్పుడు తప్ప నిన్ను చూడకుండా ఉన్న రోజు లేదు. e-పేపరు వచ్చినా నిన్ను చేత్తో పట్టుకుని..తడిమి తడిమి చూసుకుంటూ "ఇదీ సంగతి" లో ఈ రోజు శ్రీధర్ ఏ కార్టూన్ వేసాడా అని ముందు చూసి...ఒక్కో పేజీ చదువుకుంటూ ఓ గంట సేపయినా నిన్ను ఆస్వాదించందే రోజు మొదలయ్యేది కాదు.

నీ రాక కోసం..నువ్వు రాగానే నిన్ను చదవటం కోసం ఇంటిల్లిపాదీ పోటీ పడేవాళ్ళం.  తెలుగు పత్రికా లోకంలో మొట్టమొదటి సారిగా జిల్లా సంచికలని..ఆదివారం అనుబంధాలని ప్రవేశ పెట్టిన ఘనత నీదే! ప్రతి జిల్లా నుండి పత్రికా ప్రచురణ మొదలుపెట్టిన ఘనతా నీదే! ఇతర రాష్ట్రాలనుండి ఓ తెలుగు పత్రిక ప్రచురించబడటం కూడా నీతోనే మొదలు అనుకుంటాను! మహిళల కోసం వసుంధర అని ప్రత్యేకంగా ఓ పేజీనే ప్రారంభించావు.  పేపరు క్వాలిటీ కాని, భాష కానీ, వార్తా శీర్షికలు కానీ, ఆదివారం అనుబంధం, జిల్లా ఎడిషన్సు ప్రారంభించటంలో కానీ అన్నిటిల్లో ఓ ట్రెండ్ సెట్టర్ వి నీవు. జర్నలిజం కొత్త పుంతలు తొక్కిందీ నీతోనే! మాలాంటి భాషా ప్రేమికుల్ని వేరే పేపర్ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేసిన ఘనతా నీదే!

చదువు, సుఖీభవ, ఛాంపియన్, eనాడు, సిరి, ఈతరం, స్థిరాస్థి..ఇలా వారంలో ఒక్కో రోజు ఒక్కో శీర్షికతో పాఠకులకు విలువైన సమాచారం అందిచటంలో నీకు నీవే సాటి అనిపించుకున్నావు.

ఆకట్టుకునే వార్తా శీర్షికలతో మమ్ముల్ని అలరించావు. కొన్ని శీర్షికలని చూడగానే మాలో ఆవేశం ఎగసిపడేది..రక్తం సల సలా మరిగేది. మరి కొన్ని శీర్షికలని చూడగానే విచక్షణ మేలుకునేది. నిష్పక్షపాతంగా సమకాలీన రాజకీయాలను విశ్లేషిస్తూ నువ్వు వ్రాసిన సంపాదకీయాలతో మా మనుసులని చూరగొన్నావు!

"పుణ్యభూమి", "కబుర్లు", "అక్షింతలు", "రాష్ట్రంలో రాజకీయం"...ఇలాంటి శీర్షికల ద్వారా ఎ.బి.కె ప్రసాదు, చలసాని ప్రసాద రావు, డి.వి. నరసరాజు, గజ్జెల మల్లారెడ్డి, బూదరాజు రాధాకృష్ణ లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల పరిచయ భాగ్యం కలిగించావు.

తెలుగు భాష విస్తృతి కోసం నువ్వు ప్రచురించిన "తెలుగులో తెలుగెంత", "తెలుగు జాతీయాలు", "మాటల మూటలు", "మాటల వాడుక", "మాటలూ-మార్పులూ"..తెలుగు భాషకి మంచి డిక్షనరీల లాంటివి.  ఆదివారం "బాలవినోదిని" కి ముఖ్యంగా "పదవినోదం" కు పిల్లలతో పాటూ పెద్లలమూ అభిమానులం అయ్యాం!

ఓ ఆంధ్రుడి ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పి..తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్దణకు పుట్టిన ఓ ప్రాంతీయ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో నువ్వు ముఖ్య పాత్ర పోషించావు!
ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి అతి పెద్ద మహిళా ఉద్యమం అయిన సారా ఉద్యమానికి అండదండలుగా నిలిచి ఆ ఉద్యమానికి ఎనలేని ప్రచారం చేసి..మహిళల పక్షాన నిలిచిన నిన్ను ఎన్నటికీ మరువలేము! ఆ ఉద్యమం కోసం ఓ ప్రత్యేక పేజీనే కేటాయించావు.

ఏవీ ఇప్పుడు ఆ సంపాదకీయాలు! ఏవీ ఆ వార్తా శీర్షికలు! బూతద్దం పెట్టి వెతికినా ఈనాడులో  భాషాదోషాలు కనపడవు అనుకునే రోజులు పోయాయి. ముఖ్యంగా జిల్లా ఎడిషన్సు లో భాషా దోషాలు కోకొల్లలు. ఈ మాత్రం వార్తలకి..ఈ మాత్రం భాషకి ఈనాడే చదవాలా అని అనుకునేటట్టు చేస్తున్నావు. వార్తల్లో జీవం కనపడటం లేదు.  ఇదివరకటిలా వార్తలని ఆస్వాదించలేకపోతున్నాం

తెలుగు పత్రికా చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యామయిన ఈనాడు ఇక గత చరిత్రగా మిగిలిపోతుందేమో అని అనుమానం కలుగుతుంది.

పేపరు కుర్రాడితో వేయించుకుంటే నువ్వు రావటం ఆలస్యం అవుతుందని గత 15 సంవత్సరాలుగా డైరెక్టుగా ఈనాడు సంస్థ ద్వారానే నిన్ను పొందుతున్న మేము ఇక ఈ నెల నుండి నీకు సెలవు ప్రకటించేసాం.  ఇది బాధాకరమే కానీ తప్పటం లేదు.

నిన్ను ఇక అసలు చూడను అని చెప్పనులే! ఏదో అప్పుడప్పుడు నెట్టు లో e-పేపరు చూస్తూ ఉంటానులే!

ఇక సెలవు నేస్తం!

9 వ్యాఖ్యలు:

రాజ్ కుమార్ September 29, 2014 at 11:25 AM  

డిట్టో.. అనుభవాలండీ.
హ్మ్మ్... మా ఇంట్లో ఈనాడు ని ఆపేసి సంవత్సరాలవుతుంది.

ఇంతకీ వెల్కమ్ చెప్పబోయే పేపర్ ఏంటండీ? ;)

త్రివిక్రమ్ Trivikram September 29, 2014 at 11:39 AM  

Good decision!

>> నిష్పక్షపాతంగా సమకాలీన రాజకీయాలను విశ్లేషిస్తూ నువ్వు వ్రాసిన సంపాదకీయాలతో...

>> ఓ ప్రాంతీయ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి

ఈ రెండిట్లో ఏదో ఒకటే నిజం. ఆ నిజమేమిటో మీక్కూడా తెలుసు :-).

సిరిసిరిమువ్వ September 29, 2014 at 12:06 PM  

రాజ్ కుమార్..ఈనాడు తో పాటు హిందూ మా కుటుంబ పత్రిక, సో ప్రస్తుతం హిందూ అలానే కంటిన్యూ అవుతుంది. ఇక వేరే తెలుగు పేపరు వేయించుకునే ధైర్యం లేదు.

త్రివిక్రం గారూ :). ఒకప్పుడు(అంటే ఆ ప్రాంతీయ పార్టీ పెట్టిన కొత్తల్లో)రెండూ నిజమే కదా!

మురళి September 29, 2014 at 3:04 PM  

'ఈనాడు' ఓ మంచి రీడర్ని కోల్పోతోందన్న మాట!
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిసారీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వస్తున్న ఈ పత్రిక, వైఎస్ మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులకీ పూర్తి మద్దతు ఇచ్చింది. ఎన్నికల ఫలితాలు, పత్రికని 'ప్రతిపక్ష' పాత్రలోకి మారనివ్వలేదు.. పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడే పాఠకులకి ఎక్కువగా చేరువ అవుతాయి ('ఈనాడు' విజయానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి).. కాబట్టి, కొన్నేళ్ళ వరకూ 'ఈనాడు' శైలిలో మార్పు ఆశించలేం.
ఇక, ఆదివారం అనుబంధాలు ఈనాడుకి ముందు కూడా ఉన్నాయండీ. పుస్తక రూపంలో తెచ్చి, డాక్టర్ సమరం సలహాలు లాంటి సంచలన శీర్షికలతో మార్కెట్ చేసింది మాత్రం ఈనాడే. ఒకప్పుడు మంచి కథలు వచ్చేవి.. ఇప్పుడు కథ చదవాలంటే భయం వేస్తోంది. దూబగుంట ఉద్యమాన్ని బాగా హైలైట్ చేసిన పత్రికే, ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన ప్రభుత్వం సారా నిషేధాన్ని ఎత్తేస్తే, 'సరైన సమయంలో సరైన నిర్ణయం' అంటూ అభినందించింది కూడా!
ఏదేమైనా, 'ఈనాడు' లో క్వాలిటీ బాగా తగ్గిపోయింది అన్నది ఈమధ్య తరచుగా వినిపిస్తున్న మాట.

sarma September 29, 2014 at 3:19 PM  

నలభై వసంతాల తరవాత వీడ్కోలు చెప్పడానికి కొద్దిగా ఊగిసలాడుతున్నాం. తరవాత తిసుకోబోయే నిర్ణయం తెలిసినదే! మరెవరిని ఆలోచన చేయలేకపోతున్నాం. ఇదొక దౌర్భాగ్యం.... తెనుగు పత్రికా రంగంలో....

నాగరాజ్ September 29, 2014 at 6:16 PM  

పత్రికల్ని ఫోర్త్ ఎస్టేట్ స్థాయి నుండి ఫక్తు వ్యాపారానికి దిగజార్చాక... మీడియా హౌజెస్ అన్నీ కూడా పవరులో ఉన్నోడిని భట్రాజుల్లా భజన చేయడం సర్వసాధరణమైపోయింది.
ఒకటి... ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాస్తే గవమెంట్ యాడ్స్ రావేమోననేది కారణం కాగా; రెండోది ఈ మీడియా హౌసెస్ వ్యాపారాల్లో కూడా లెక్కలేనన్ని లొసుగులుంటుండడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాస్తే... ఎక్కడ వాళ్లు వీళ్లని ఇరుకున పెట్టేస్తారోననే భయం మరో కారణం. ప్రజలకు నిజాల్ని అందించాలనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని స్వయానా మీడియా వాళ్లే తమకు తాముగా ఉప్పు పాతరేసి భూస్థాపితం చేసిపారేశారు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ కాంప్రమైజ్డ్. ఎథిక్స్ లేని పత్రికలు, టీవీలు ఎప్పుడో భ్రష్టుపట్టిపోయాయి. కాస్తో కూస్తో ఎథిక్స్ ఉన్నాయని భావించే పత్రికలు, టీవీలు కూడా పతనమైపోయాయి, కాకపోతే కొంచెం లేటుగా అంతే. ప్చ్!!

spandana October 2, 2014 at 9:54 PM  

నాదీ ఇదే ఆక్రోశమే!
నేనూ బుద్ది తెలిశాక చదివిన పత్రిక ఈనాడే! ఆ తర్వాత ప్రవాసం వచ్చాక కొన్నేళ్ళ ఎడబాటు తర్వాత "ఈనాడు"ను అంతర్జాలంలో చూసి ఎంతో మురిసిపోయి అప్పట్నుంచే మళ్ళీ అది చదవని రోజు లేదు.
కానీ ఇప్పుడసలు రుచించడం లేదు. ఇప్పుడు కాళ్ళు అయిష్టంగానే "ఆంధ్రజ్యోతి" వైపు పడుతున్నాయి. రామోజీ వుండగానే ఇలా అయితే తర్వాత ఎలా వుంటుందో!

-- చరసాల ప్రసాద్

వంశీ కృష్ణ October 16, 2014 at 12:50 AM  

తెలుగు పత్రికా ప్రమాణాలు తగ్గటం పాఠకుల దురదృష్టం. మీరన్న దానితో ఏకిభవిస్తాను ("ఇదివరకటిలా వార్తలని ఆస్వాదించలేకపోతున్నాం")
హిందూ పత్రికలోని వార్తా విశేషాలు ఇంకా మెరుగైన ప్రమాణాలతో వున్నట్టు అనిపిస్తాయి.

pruthvi March 13, 2015 at 4:30 PM  

sir,

ee rojullo telugu chadive valle takkuvipotunnaru. Alantappudu varatalu raase variki matram anta saahityam ekkada untundi. guddi lo mella chandam ga eenade better andi.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP